Friday 1 August 2014

విజాతులన్నియు వృధా వృధా - అన్నమాచర్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన: విజాతులన్నియు వృధా వృధా..
          విజాతులన్నియు వృధా వృధా.- అజామిళాదుల కదియే జాతి.
౧.       జాతి భేదములు శరీర గుణములు
జాతి శరీరము సరి తోడనే చెడు,
          ఆతుమ పరిశుద్ధం బెప్పుడును అది నిర్దోషంబనాది
           ఈతల హరివిజ్ఞానపు దాస్యం - బిది యొక్కటే పొ సుజాతి.  // విజా //
౨.       హరి ఇందరిలో నంతరాత్ముడిదే
          ధరణి జాతి బేధము లెంచ
          పరమయోగు లీభావ మష్టమదము భవనికారమని మానిరి
          ధరణిలోన బరతత్వజ్ఞానము ధర్మమూలమే సుజాతి  //  విజాతి //
౩.       లౌకిక వైదిక లంపటులకు నివి
          కైకొను నవశ్య కర్తవ్యంబులు,
          శ్రీకాంతుడు శ్రీవేంకటపతి సేసిన సంపాదనమిందరికి
          మేకొని ఇన్నియు మీరినవారికి నీ నామమే సుజాతి  // విజాతి //
భావం:
          విభిన్నములైన జాతులన్నీ వ్యర్ధములే. అజమిళుడు మొదలగు కులభ్రష్టులైన వారిదే జాతి?
          జాతులలో కల భేదములన్నియు అశాస్వతమైన శరీరమునకు మాత్రమే! శరీరము నసించినంతనే అవియు నశించును. కానీ ఆత్మ ఎప్పుడూ పవిత్రమైనది. ఆత్మకు ఏ దోషములూ ఉండవు. అట్టి ఆత్మజ్ఞానముతో హరినెరిగి చేయు దాస్యమొక్కటే ఉత్తమజాతి లక్షణము.
          అదిగో! శ్రీహరి అన్ని జీవులలో అంతరాత్ముడై ఉన్నాడు ఆ పరమాత్ముని ధ్యానించు పరమ యోగులు లోకములో జాతి భేదములను ప్రధానముగా పాటించు అష్టమదములతో గూడి, మాయామయమైన సంసారమునకు సంభందించిన తిరస్కారభావమనియు తెలిసి జాతిభేదద్రుష్టిని విడనాడిరి. కావున పరతత్వమునేరిగి ధర్మములను పాటించుటే ఉత్తమజాతి లక్షణమగును.

          లౌకిక కార్యములలోనూ, వైదికాచారములలోనూ తలమునుకలై తపించువారికి మాత్రమే జాతిభేదములు పాటింప దగినవై ఉన్నవి. లక్ష్మీకాంతుడైన శ్రీ వేంకటేశ్వరుడు తనమాయచే జీవులకొసగిన సంపదలు. దేవా! ఈమాయను దాటి సదా మిమ్ము ధ్యానించు వారికి నీ నామ సంకీర్తనమొక్కటే సుజాతి లక్షణము.            

No comments:

Post a Comment