ఒక్కడే మోక్షకర్త ఒక్కడే శరణాగతి – దిక్కని
హరిగొల్చి బదికిరి తొంటివారు. !!
నానా దేవతలున్నారు నానాలోకములున్నవి – నానా
వ్రతాలున్నవి నడిచేటివి.
జ్ఞానికి గామ్యకర్మాలు జరిపి పొందేదేమి –
ఆనుకొన్న వేదోక్తాలైనా నాయగాక! !!
ఒక్కడు దప్పికి ద్రాపు వొక్కడు కడవ నించు – నొక్క
డీదులాడు మడుగొక్కటి యందే,
చక్క జ్ఞానియైనవాడు సారార్ధము వేదమందు – తక్కక
చేకొనుగాక తలకెత్తుకొనునా ? !!
ఇది భగవద్గీతార్ధమిది యర్జునునితోను – యెదుటనే
ఉపదేశమిచ్చె గృష్ణుడు,
వెదకి వినరో శ్రీ వేంకటేశు దాసులాల బ్రదుకుద్రోవ
మనకు పాటించి చేకొనరో! !!
భావం:
మోక్షమునకు కర్తయైనవాడు శ్రీహరి ఒక్కడే. అతనిపై
భక్తీ ఒక్కటే శరణాగతి. ప్రాచీనులైన భక్తులెందరో హరి ఒక్కడే దిక్కని నమ్మి సేవించి
ధన్యులైరి.
ఎందరో దేవతలున్నారు, ఎన్నో లోకములున్నవి, ఎన్నో
వ్రతములున్నవి ఆయా దేవతలను తృప్తిపరచుటకు, స్వర్గాది ఫలములను ఆశించి చేయు
కామ్యకర్మలు వేదములో చెప్పబడినవే. అయినను జ్ఞానికి అనిత్యములగు స్వర్గాది సుఖములపై
ఆశ ఉండదు.
మడుగులో నీటిని ఒకడు దాహము దీర్చుకొనుటకు, ఒకడు
కడవ నింపుకొనుటకు, ఒకడు ఈత కొట్టి విహరించుటకు ఉపయోగింతురు. ఇట్లు జనులు వారి
కోరికలకనువుగా ప్రవర్తింతురు. అట్లే విశాలమైన వేదములలో ఎన్నో విషయములు చెప్పబడి
యున్నవి. అందులోని జ్ఞానార్ధమును మాత్రమె జ్ఞానవంతుడు చేపట్టును, తక్కినవాటి
జోలికి పొడనుట
ఇదియే భగవద్గీత లోని భావము. దీనినే అర్జునునకు
శ్రీ కృష్ణుడు ఉపదేశించెను. శ్రీ వేంకటేశ్వరుని దాసులారా! ఈ విషయమును సావధానముగా
వినుడు. మనకు జీవనమార్గమిదియే, దీనిని పాటించి ధన్యులు కండు.
గీతా సారమును అన్నమయ్య సంక్షిప్తంగా ఇందులో
విశదీకరించినాడు.
No comments:
Post a Comment