ఈ వారం అన్నమయ్య కీర్తన
సందెకాడ బుట్టినట్టి చాయల పంట
యెంత-చందమాయ చూడరమ్మ చందమామ పంట॥
..
మునుప పాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్ను గొనచూపులపంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట॥
..
వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి జాజరపంట
కలిమి కామిని తోడ కారుకమ్మినపంట
మలయుచు తమలోని మర్రిమాని పంట॥
..
విరహుల గుండెలకు వెక్కసమైన పంట
పరగచుక్కలరాసి భాగ్యము పంట
అరుదై తూరుపుకొండ నారగబండినపంట
యిరవై శ్రీ వేంకటేశునింటిలోని పంట॥
భావం: శ్రీమతి బి. కృష్ణకుమారి గారి సౌజన్యంతో..
.కొండలరాయుని భక్తుడైన సంకీర్తనాచార్యులు ఆ శశాంకుడిని సరికొత్తగా అభివర్ణిస్తున్నాడు. ఈ కీర్తనలో పాలవెల్లి పంట, పండువెన్నెల పంట, విష్ణుమూర్తి చూపుల పంట, వేంకటేశ్వరుని ఇంటిలో పంట ..ఇలా రజనీకాంతుడిని రకరకాల పంటలుగా ప్రస్తుతించడం పదకవితాపితామహుడి పదాల ప్రతిభకు పరాకాష్ఠ.
అసురసంధ్య వేళలో ఆగమించే ఆ ఆత్రేయుడి అద్భుత శఇక్కడ ోభకు అన్నమయ్య అచ్చెరువు చెందుతున్నాడు. అలా దర్శనమిస్తున్నపున్నమి చందమామని ఛాయల పంటగా తలచి మురిసిపోతున్నాడు. ఇక్కడ ఛాయ అంటే కాంతి అని అర్ధం.
ముందు పాలసముద్రంలో మొలచి పండిన ఆ పంట దేవతలకు కూడా ఇష్టమైన పంట అట! అంతేకాకుండా ఆ వెన్నెలరాజు వేరెవరో కాదుట ! వైకుంఠవాసుడైన ఆ శ్రీమహావిష్ణువు చల్లని చూపేనట ! వెరసి ఆ సుధాకరుడు విశాలగగనపు వీధిలో వెన్నెలపంటట ! ఇలా అన్నమాచార్యులు తన భావుకతతో మనల్ని చంద్రలోకంలోనే కాదు దేవలోకంలోనూ విహరింపజేసాడు.
విరహుల గుండెలకు వెక్కసమైన పంట. సహజమైన ప్రేమను చిగురింపచేయడంలో ఆ శీతాంశుడు మన్మధుడి పక్షాన నిలిచేవాడట! ఇక పాలమీగడలాంటి పండు వెన్నెలలో వేడుకల పంటట! ఆకర్షణ పెంచేవాడట ఆ లక్ష్మీదేవి సోదరుడు. మర్రివాని పంట అంటే ఎక్కువ పంట అని అర్ధం. మర్రి విత్తనం ఎంత చిన్నదైనా మర్రిచెట్టు మాత్రం పెద్దది. ఆ విధంగా వెన్నెల విశ్వమంతా విస్తరించునని అన్నమయ్య భావం.
తుషారకిరణుడు తారాపథానికి పరమభాగ్యమైన పంట. తూర్పు కొండపై ఆరగ పండిన పంట. కడపటికి కోనేటిరాయుని ఇంటిపంట అని ముక్తాయింపు పలికాడు.
No comments:
Post a Comment