Tuesday, 26 June 2018

అంత చక్కని వాడవు అన్నిటా జాణవు నీవు -- అన్నమయ్య కీర్తన.



ఈ వారం అన్నమయ్య కీర్తన..
అంత చక్కని వాడవు అన్నిటా జాణవు నీవు
సంతోసాన నుప్పొంగీ సారెకు నా మనసు. !!
పొలసి నిన్నొకమారు పూఁచి తప్పక చూచితే
వలవక వుండుదురా వనితలు
నిలువున నెప్పుడైనా నీ రూపు దలఁచుకొంటే
వులిపచ్చి చెమటల నోలలాడకుందురా? !!
సముకాన నీతోను సంగతాలు సేసితే
తమకించకుండుదురా తరుణులు
జమళి మేనులు సోఁక సరసము లాడితేను
మమతల నిన్ను నిట్టె మరుగక ఉండుదురా.. !!
ఈడుజోడై నిన్నుఁ గూడి యెడవాయ కుండితే
వేడుకఁ జొక్కకుందురా వెలఁదులు
ఈడనె శ్రీ వేంకటేశ! యేలితివి నన్ను నిట్టె
ఏడవారూ నీ పొందుల కేఁకరకవుందురా! !!
ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని వశీకరణ శక్తిని కొనియాడుతున్నాడు. ఆ దివ్యమంగళరూపము దర్శనమవగానే మనం కూడా ఒళ్ళు తెలియని పరిస్థితికి లోనౌతాము. స్వామి ఆకర్షణ శక్తి అంతటిది.
స్వామీ! నీవేమో అంత చక్కని వాడవు. దానికితోడు సరసత్వం గల జాణవు. నిన్ను చూసిన ప్రతీసారీ నా మనసు ఉప్పొంగిపోతుంది.
నిన్నొక్కమారు తరచి చూసినవారు వలపు చెందక ఉండగలరా? ఎప్పుడైనా నీ రూపమును నిలువెల్లా ప్రేమతో చూచిన చిరు చెమటలతో మేను చెమర్చక నుండునా?
నీ సముఖానికి వచ్చి నీతో చేరికగా ఉంటే తరుణులకు తన్మయత్వం కలుగదా? ఇరువురి మేనులు తాకుతూ సరసములాడితే వారిలో మమత కలిగి నీ పొందుకోసం తహతహలాడరా?
ఈడుజోడుగా నుండి ఎడబాటు లేక నిన్ను కూడి ఉంటే వెలదులు మైమరచిపోకుందురా? ఓ వేంకటేశ్వరా! నన్నూ నిట్టె ఏలితివి. ఎక్కడివారూ నీ పొందు కోసం ఉవ్విళ్ళూరక ఉండగలరా?

No comments:

Post a Comment