అన్నమయ్య కీర్తన
ఊరకే ఉన్నాఁ డితఁడు వోరుపుతోడ
ఈ రీతి మాటలాడ అరుహమా ఇపుడు? !!
మంతనము లాడెనంటా మగువతో నీవతని
నెంకెంత సేసేవే ఇపుడు నీవు.
వంతులు తప్పక వుండవచ్చీఁ గాక రమణుఁడు
అంతేసి మాటలకు నరహమా ఇతఁడు. !!
అంగనచేతి విడెమాకు నందుకొనే నంటా
యెంగిలి మాటాడకువే యెగసెక్కేన
జంగిలిలో నీ తోడ సరసము నాడీఁగాక
అంగమంటి ఇంత సేయ నరుహమా ఇతఁడు !!
మేడమీదనున్నచెలి మేలమాడి కూడెనంటా
ఆడుకొనేవింతలోన అందరితోడ
వోడక శ్రీ వేంకటేశుఁ డొడివట్టి నిన్నుఁగూడె
ఆడనీడా గేలిసేయ నరుహమా ఇతఁడు. !!
భావం...అన్నమయ్య చెప్పిన ఈ సరస శృంగార కీర్తనలో తాను దేవి చెలికత్తె అయి స్వామి తరుపున ఇలా మాట్లాడుతున్నాడు.
నీ రమణుడు నిన్నేమీ అనటం లేదని ఊరకనే ఉన్నాడని ఇన్ని యెగ్గుల నెంచుతున్నావు. అతను ఓర్మితో ఉన్నాడని నీ చేత ఇన్ని మాటలు పడుటకు అర్హుడా ఇతడు? ఇది నీకు తగిన పనియేనా?
దేవీ! నీ విప్పుడు ఎంతెంత వింత పనులు సేసేవే. ఆ మగువతో మంతనాలాడుతున్నాడని ఇతనిపై నెపము వేస్తున్నావు. ఆమె నీ రమణుడికి వరుస కాకపోవచ్చు. మాట తప్పకుండా నీ దరికి వస్తున్నాడే కదా! కానీ అతనిని అన్ని మాటలు అనవచ్చునా? దానికతడు అర్హుడేనా?
దేవీ నీ రమణుడు ఆమె చేతి తాంబూలము అందుకొన్నాడని దెప్పిపొడిచి అపభ్రంశపు మాటలనకమ్మా!.అవేమీ పట్టించుకోకుండా నీతో సరసమాడేడని అతని చేయిబట్టి నిలబెట్టి ఇంత సేయ తగునా? దీనికతడు అర్హుడా?
దేవీ! ఆ మేడలోనున్న చెలి నీ రమణునితో పరాచికములాడి, ఆపై కూడినదని ఇంతలోనే అందరితో చెవినిల్లు కట్టుకొని మరీ చెబుతున్నావు కానీ ఏమాత్రం నీ మాటలు లెక్కచేయక నిన్ను ఒడిసిపట్టి నిన్ను కూడినాడు. అక్కడా ఇక్కడా నీ రమణుని గేలిసేయ తగునా? ఈ అపనిందలన్నిటికీ స్వామి అర్హుడా?
ఈ కీర్తనలో భర్తపట్ల అనురాగం కల భార్య మనస్సు ఎలా ఉంటుందో చక్కగా వివరించాడు అన్నమయ్య.
No comments:
Post a Comment