Saturday, 14 October 2017

చాలు చాలు నీ హరియే మాకును – సకల క్రియలకు నాయకుడు. - అన్నమయ్య కీర్తన


ప. చాలు చాలు నీ హరియే మాకును – సకల క్రియలకు నాయకుడు.
నాలుక తుదనే యీత డుండగా - నలుగడ నెవ్వరి వెదకేము. ॥
౧. ఏలినవాడట లక్ష్మీ విభుడట – యేమిటను కొరత మాకికను
నాలో నున్నాడు బ్రహ్మతండ్రి యట – నా కాయుష్యము బాతా.
పాలజలధిపై దేవుని వారము – పాడి మాకు నిక నే మరుదు?
ఆలింపగ నేమింతటి వారము – అన్యుల కిక జెయి చాచేమా? ॥
౨. భూకాంతాపతి కింకరులము యీ - భూములన్నియును మా సొమ్మే
పైకొని చక్రాయుధుడే మా దాపు – భయములన్నిటా బాసితిమి,
ఈకడ నచ్యుతు మరగు చొచ్చితిమి – యెన్నటికిని నాసము లేదు.
ఏ కొరతని యిక నాసపడుచు – నే మెవ్వరికి నోళ్ళు దెరచెదము. ॥
౩. శ్రీ వైకుంఠుని దాసులమట యర – చేతిది మోక్షము మా కిదివో
పావన గంగా జనకుని బంట్లము – పాపము లన్నిట బాసితిమి.
శ్రీ వేంకటపతి వరము లియ్యగా - జిక్కిన వెలుతులు మాకేవి?
యీ వైభవముల దనిసిన మాకును – యితరుల దగిలెడి దికనేది? ॥
భావమః ఇదే మాకు చాలు. ఇంత కంటె మాకేమియు వలదు. శ్రీ హరియే మాకు అన్నిటా నాయకుదు. ఇతడు మా నాలుక చివరనే ఉన్నాడు. ఇంక మేము నలువంకల వేరొకరి కోసమై వెదకవలసిన అవసరమే లేదు.
ఈతడు సిరిసంపదలకు నిలయమైన శ్రీ మహాలక్ష్మికే మగడు. ఇంక మాకెందైన కొరత కలదా? ఈ చరాచర సృష్తి కర్త అయిన బ్రహ్మను కన్న తండ్రి నాలోనే ఉన్నాదు. ఇక నా కాయువునకు కొదువా? పాలకడలిపై పవళించు దేవుని వారము. ఇక మాకు పాడి కెమి లోటు? పరికించి చూడగా ఆ పరమాత్ముని కృపచె మే మింతటి వారమైతిమి ఇక ఇతరుల చెంత చేయి చాపుదుమా?
మేము భూదేవి భర్త అయిన శ్రీ హరికి దాసులము. ఈ భూములన్నీ మా సొత్తే. చక్రాయుధుడై శ్రీ హరి మా చెంత నుండగా మా భయములన్ని తొలగిపోయినవి. మేము అచ్యుతుని శరణు జొచ్చితిమి. మా కెన్నటికి నాశము లేదు. ఇంక మాకేమి కొరత కలదని ఇతరుల ముందు నోరు తెరిచి యాచించెదము?
మేము శ్రీ వైకుంఠుని దాసులము. మాకు మోక్ష మరచెతనే ఉన్నది. పాపనాశిని అయిన పవిత్ర గంగానదికి తండ్రియైన హరికి సేవకులము మేము. అన్ని పాపముల నుండి విముక్తి పొందితిమి. శ్రీ వేంకతటేశ్వరుడే మాకు వరములిచ్చు దేవత. మాకిక వెలితి యేది? ఇన్ని వైభవములతో త్రుప్తి నొందిన మాకు ఇతరుల వెంతబడి దేబిరించవలసిన ఆవశ్యకత యేమున్నది?
ఆన్నింటా ఆ పరమాత్ముదు అండగా ఉండగా ఇతర చింతలు మనకేలా అని అన్నమయ్య ఈ కీర్తనలొ మనకి వివరించాడు.

No comments:

Post a Comment