Friday, 13 October 2017

అదె శ్రీవేంకటపతి అలమేలు మంగయును కదిసివున్నారు తమకమున బెండ్లికిని - అన్నమయ్య కీర్తన




అన్నమయ్య కీర్తన :
పెళ్ళి - ఈ పదం వినగానే వయసుతో నిమిత్తంలేకుండా అందరి మనసుల్లోనూ ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. పెళ్ళయినవారు తమ పెళ్ళివేడుకలను గుర్తుచేసుకుని చిరునవ్వు చిందుతారు. వయసులో ఉన్నవారు తమకు జరగబోయే పెళ్ళిగూర్చిన ఊహా లోకంలో విహరిస్తారు. చిన్న పిల్లలేమో కొత్తబట్టలూ, బంధుజనాల కలయికలూ, ఆటలూ, పాటలూ వీటిని తలచుకుని సంబరపడతారు. పెళ్ళిలో అందరికన్నా ఎక్కువ ఆనందించేది వధూవరులే! మరి వాళ్ళే కదా ఆ వేడుకకి ప్రధాన ఆకర్షణ
పల్లవి 
అదె శ్రీవేంకటపతి అలమేలు మంగయును
కదిసివున్నారు తమకమున బెండ్లికిని
చరణం 1
బాసికములు గట్టరో పైపై దంపతులకు
శేసపాలందియ్యరో చేతులకును
సూసకాల పేరంటాండ్లు సోబానంబాడరో
మోసపోక యిట్టే ముహూర్తమడుగరో
చరణం 2
గక్కునను మంగళాష్టకములు చదువరో
తక్కక జేగట వేసి తప్పకుండాను
నిక్కినిక్కి చూచేరదే నెరి దెర దియ్యరో
వొక్కటైరి కొంగుముళ్ళు వొనరగ వేయరో
చరణం 3
కంకణదారములను కట్టరో యిద్దరికి
సుంకుల బెండ్లిపీట గూచుండబెట్టరో
లంకె శ్రీవేంకటేశు నలమేల్ మంగని దీవించి
అంకెల బానుపుమీద నమరించరో
భావం :
అదిగో చూడండి, వధూవరులుగా అలంకరించబడిన శ్రీవేంకటేశుడూ, అలమేలుమంగా ఎంత ఆసక్తితో కాచుకునున్నారో పెళ్ళికొరకు!
కాబోయే ఆ దంపతులకు త్వరగా బాసికాలు కట్టి తలంబ్రాలు చేతికందివ్వండి. ఎవరక్కడ? పేరంటాండ్లా? మీరు పాటలందుకుంటేకదా పెళ్ళి హడావిడి మొదలయ్యేది! పాటలు పాడుతూ, ఆటపట్టిస్తూ అమ్మాయికి అన్ని అలంకారాలూ చెయ్యండి. ఏంటి అమ్మాయి ముఖంలో సిగ్గుమొగ్గలు కనబడవేం? వదలకండి; ఏకాంతంలో శ్రీపతిని కలుసుకోబోయే ఆ శుభగడియ ఎప్పుడో అడగండి; అప్పుడు ఎన్ని సిగ్గులొలకబోస్తుందో చూద్దురుగానీ.
తొందరగా మంగళాష్టకములు చదివి వధువు చేత గౌరీ వ్రతం చేయించండి. వ్రతం పూర్తవగానే పూజచేయించిన మురుగుని(గాజులు) చేతికి తొడగి తీసుకురండి. పురోహితుల వారూ, మంత్రాలవీ నెమ్మదిగా చదివితే ఎలాగూ? చూడాండి, ఒకరినొకరు చూసుకోవాలని ఉబాలటపడి నిక్కి నిక్కి చూస్తూ నెరితెరని కిందకి లాగేస్తున్నారు. ఇక చాలు ఆ నెరితెర తొలగించండమ్మా! జీలకర్రబెల్లం, మాంగల్యధారణం పూర్తయ్యాయి; ఇక నెమ్మదిగా కొంగుముళ్ళు వేయండి.
ఇద్దరి చేతులకూ కంకణదారాలు కట్టించి, పెండ్లి పీటమీద పక్కపక్కన కూర్చోబెట్టండి. అలమేలుమంగ చేయందుకున్నానన్న విజయగర్వంతో శ్రీవేంకటేశుడు లోలోపల ఎంతలా ఆనందిస్తున్నాడో వికసిస్తున్న ఆ ముఖంలో కనబడట్లేదండీ? చూడ చూడ తనివి తీరని ఈ జంటని అందరూ దీవించండి. దీవెనలవి అయిపోయాయి; ఇక ఇద్దర్నీ తీసుకెళ్ళి అలంకరించబడిన ఆ పానుపుమీద కూర్చోబెట్టిరండి.
- పొన్నాడ లక్ష్మి (భావం courtesy శ్రీ అవినేని భాస్కర్)

No comments:

Post a Comment