Friday, 29 July 2016

ఇన్నిటికీ నీశ్వరేచ్చ - ఇంతే కాక -- అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన. 30.7.16.

ప.         ఇన్నిటికి నీశ్వరేచ్ఛ  – ఇంతే  కాక
            తన్నుదానే హరిగాచు – దాసుఁడైతేఁ చాలు.
౧.         ప్రకృతిఁబుట్టిన దేహి – ప్రకృత (ప్రకృతి?) గుణమే కాని
            వికృతి బోధించబోతే – విషమింతే కాదా,
            ఒక విత్తు వెట్టితే వే – రొకటేల మొలుచును
            ప్రకటమైన వట్టి – ప్రయాసమే కాక.
౨.         పాపానఁ బుట్టిన మేను – పాపమే సేయించుగాక
            యేపునఁ బుణ్యముతోవ – యేల పట్టును,
            వేపచేఁదు వండితేను – వెసనేల బెల్లమవును
            పై పై బలిమి సే సే – భ్రమ ఇంతేకాక
౩.          ప్రపంచమైన పుట్టుగు – ప్రపంచమునకే కాక
            ఉపమించ మోక్షమున – కొడఁబడునా ?
            ప్రపన్నుఁ డైన వేళ – భాగ్యాన శ్రీ వేంకటేశుఁ  
            డపుడు దయఁ  జూడఁగ – నధికుడౌ  గాక !

భావము: ఏది జరుగవలెనన్నను భగవంతుని యిచ్ఛ ననుసరించి జరుగవలసినదే. ఆయనకు  దాసు డగుడొక్కటే జీవుని కర్తవ్యము. అప్పుడు దయానిధి అయిన శ్రీహరి తానే కాపాడును.
             భగవంతుని లీలవలన జీవుడు ఈ  దేహాన్ని ధరించి ప్రకృతి నుండియే శరీరముతో జన్మించినాడు. వీనికి ప్రకృతి సహజమైన గుణములుండునే గాని ఇతర  గుణములుండవు. కాదని ప్రకృతి కతీతముగా ప్రవర్తించు మని వానిని బలవంతము చేసినచో విషమమైన పరిస్థితికి దారి తీయును. ఒక చెట్టు విత్తు నాటినచో ఆ చెట్టే మొలుచును గాని వేరొక చెట్టు యెట్లు మొలుచును? ఒకవేళ అలా మొలిపించుటకు ప్రయత్నించిననూ వృధా ప్రయాసయే యగును గానీ ఫలముండదు కదా!
            ఈ శరీరము పాపకర్మముచే పుట్టినది. ఇది మనచే తనకు సహజమైన పాపకర్మమునే చేయించుగాని పుణ్యమార్గము నెందు కనుసరించును? వేపచేదు వండినచో చేదుగానే ఉండునుగాని బెల్లము వలె తియ్యగా ఎట్లుండును? అట్లే  ఈ తనువును పుణ్యపథముణ నడిపింప గలమని పూనుకొనుట ఒట్టి భ్రమయేగాని మరేమియు కాదు సుమా!
            మన జన్మము ప్రపంచ ప్రవృత్తికి సంబంధించినది. ఇది  ప్రపంచ మాయాజాలమున మనలను తగిలించుటకే

ప్రయత్నించును గాని మోక్షమున కంగీరంచునా? కావున  జీవుడు భగవంతుని యెడల ప్రపన్నుడు కావలెను. అప్పుడు భాగ్యవశమున  శ్రీ వేంకటేశుడు దయ చూడగా , అతడు ముక్తుడై అధికుడగును.

No comments:

Post a Comment