Friday, 15 July 2016

కానవచ్చి కానరాదు కమలాక్ష నీ మాయ - అన్నమయ్య కీర్తన.

ఈ  వారం  అన్నమయ్య కీర్తన.

ప.         కానవచ్చి  కానరాదు  కమలాక్ష నీ మాయ.
            తానె  వెంట వెంట తగిలీనిదివో..                    ||
౧.         తొల్లి నీవు గలవు తోడనే నేను గలను
            ఎల్లగ  ఈ ప్రపంచము  ఇంతా గలదు
            గొల్ల ఎద్దులప్పటివే గోనేలే కొత్తవైనట్లు
            చల్లని  నేనోకడనే జన్మములే వేరు.               ||
౨.         వేదములు నాటివే వినుకులు నాటివే
            ఆదినుండి చదివే, అదియే వేరు
            వేదతో  వెన్నబట్టి నేయి వెదకబోయినట్లు
            దాదాత నా తెలివి ఇతరుల నడిగెను.             ||
౩.          వైకుంఠము ఉన్నది, వరములు ఉన్నవి
            ఏకట శ్రీ వేంకటేశు యేలితి నన్ను
            గైకొని పువ్వు ముదిరి గ్రక్కన పిందయినట్లు
            నీకు శరణన గాను నే నీడేరితిని                    ||

భావము:               ఓ కమలాక్ష! పరమాత్మా!  నీ  మాయ కనిపించీ  కనిపించనట్లు ఉంటుంది.  నీవే మమ్మల్ని  వెంట వెంట తగులుకొని  ఉంటావు.
            ముందర  నేవే ఉంటావు.  నీ వెంటనే నేను ఉంటాను. అలాగే  ఈ  ప్రపంచమంతా ఉంటుంది. చూడగా, చూడగా ఎద్దులు ఎప్పటివే వాటిపై కప్పే గోనేలే కొత్తవి (ఆత్మలు ఎప్పటికి ఒకటే శరీరాలే వేరు) అన్నట్లు, నేనోకడినే కావచ్చు, జన్మములే వేరుగా  ఉంటాయి.
            వేదములు  ఆనాటివే, వినుకులు (విని నేర్చుకోవడం) నాటివే, ఆదినుంచి చదివే చదువులు అవే, చదివే పద్ధతులు వేరు.  వెన్నని  దగ్గిరలో ఉంచుకుని నేయికోసం వెదకినట్లు, నా తెలివి తెల్లారి మహా దాతవు నీవుండగా    ఇతరులను ఆశ్రయించి, అర్ధించేను.  

            వైకుంఠము ఉన్నది, నువ్వు మాకిచ్చే వరములూ ఉన్నవి. శ్రీ వేంకటేశ్వరా ! దయతో మమ్ము పాలిస్తున్నావు. పువ్వు ముదిరి పిందె అయినట్లు నిన్ను శరణు వేడి నేను కృతార్ధుడనైతిని.

No comments:

Post a Comment