ధరణి నెందరెన్ని – తపములు చేసినాను
హరిక్రుప గలవాడే – అన్నిటా బూజ్యుడు.
మితి లేని విత్తులెన్ని – మేదినిపై జల్లినాను
తతివో విత్తినవే – తగ బండును .
ఇతర కాంతలు మరి – యెందరు గలిగినాను
పతి మన్నించినదే – పట్టపు దేవులు.
పాలుపడి నరులెన్ని – పాట్లబడి కొలిచినా
నేలిక చేపట్టినవాడే – ఎక్కుడు బంటు.
మూలనెంత ధనమున్నా – ముంచి దాన ధర్మములు
తాలిమితో నిచ్చినదే – దాపురమై నిల్చును.
ఎన్నికకు గొడుకులు – యెందరు గలిగినాను
ఇన్నిటా ధర్మపరుడే – ఈడేరును,
ఉన్నతి జదువు లెన్ని – వుండినా శ్రీ వేంకటేశు
సన్నుతించిన మంత్రమే – సతమై ఫలించును.
భావము:
ఇలలో ఎందరో ఎన్నో తపములు చేయుచున్నారు. కానీ వారందరూ పూజనీయులు కాజాలరు. వారిలో శ్రీహరి కృపను సాధించినవాడే అన్నిటా పూజ కర్హుడగును.
అదను జూడక నేలపై ఎన్ని విత్తనములు జల్లినను అవి ఫలింపవు. బాగుగా దున్నిన నేలలో అదనున చల్లిన విత్తనములే చక్కగా ఫలించును. అలాగే ఒక రాజుకు ఎందరో రాణులుందురు కాని వారెల్లరు పట్టపు రాణులు కాలేరు. రాజు ఎవరిని ఎక్కువగా మన్నించి గౌరవించునో ఆమెయే పట్టపు రాణిగా చలామణి యగును.
ఒక ప్రభువు వద్ద ఎందరో సేవకులు కష్టించి సేవించిననూ, వారందరూ ప్రధాన సేవకులు కాజాలరు. ఆ ప్రభువు ఎవరిని ఎక్కువ నమ్మకముతో చేపట్టునో అతనే ప్రధానాధికారిగా గుర్తింపబడును. ఒకని వద్ద ఎంతో ధనముండును. కానీ అది అతనికి ఏ విధంగానూ సాయపడదు పాత్రులైన వారికి దానం చేసిన ధనమే అతనికి జన్మాంతరము లో కూడా సహాయమై నిల్చును.
ఎవరికైన కొడుకులు లెక్కకెందరో పుట్టవచ్చు. కానీ వారిలో ఎవరు ధర్మపరుడో వాడే తల్లితండ్రుల ఋణము తీర్చి వారి దినము దీర్చును. అలాగే లోకములో ఎన్నో చదువులుండవచ్చు, కానీ వాని వల్ల ప్రయోజనముండదు. ఆ వేంకటేశ్వరుని సన్నుతించు మంత్రమే శాశ్వతమైన చదువై అభీష్టఫలములను ఇచ్చునది.
No comments:
Post a Comment