Monday, 25 February 2019

అన్నియు నందే యున్నవి అదిగో మాట - అన్నమయ్య కీర్తన



ఈ వారం అన్నమయ్య కీర్తన :

అన్నియు నందే యున్నవి అదిగో మాట
ఎన్నుకొనే దినములు ఇదిగో మాట ॥

సీత నీకు జెప్పి పంపి శిరోమణి నీకిచ్చె
నాతల నే మెరంగము అదే మాట
చేతి నీ ఉంగరమును శిరసున నెత్తుకొనె
ఏ తలంపు నెట్లవునో ఇదిగో మాట ॥

తాడుపడ్డమేనితోడ తలంపు నీకొప్పగించి
ఏడవుతా నెరంగదు ఇదివో మాట.
పాడిదప్ప దించుకంతా పదిల మాకెగుణము
ఆడ నేమి జోటులేదు అదిగో మాట. ॥

తెరవ నీకు బాసిచ్చె దేవతలమాట విను
ఎరింగినదే ఇందరు ఇదిగో మాట.
గురుతై శ్రీవేంకటాద్రి గూడితి రిద్దరు మీరు
అరిమురి రామచంద్రా అదిగో మాట.
భావ మాధుర్యం :

ఈ కీర్తన విశ్లేషణ అనుకున్నంత సులభం కాదు. ఎవరు ఎవరికి చెబుతున్నారో కూడా అంత తేలికగా అర్ధం కాదు. ఇది హనుమంతుడు శ్రీరామునికి వినిపిస్తున్న లంకలో సీతాదేవి దర్శనం. 

రామచంద్రా ! ఇదిగో ఈ మాట విను. అన్ని భావాలు ఈ సందేశంలోనే ఉన్నవి. ఈ ఒక్క మాట విను. సీతమ్మ కడసారి ఆశతో దినములు లెక్కించుకుంటున్నది. సీతమ్మ తన శిరోమణి నా చేతికిచ్చి ఈ సందేశం వినిపించింది. ఆ తరువాత ఏమి కానున్నదో నేనెరుగను. ప్రభూ ! నీ చేతి ఉంగరము తన శిరసున ఉంచుకుని, తన ఆశలేమౌతాయోనని రోదించింది. ఇదిగో ఈ మాట విను ప్రభూ. ఆమె కృశించిన మేనితో తలపులన్నీ నీపై నిలిపి రోదించుచున్నది. ఆమె సుగుణరాశి. అణుమాత్రమూ ధర్మము తప్పని సుశీల. కదులుటకు వీలు లేని చోటున ఉన్నది. ఆ వనితామణి నీకు దేవతల బాసను గుర్తు చేసింది.
అందరికీ నీ ప్రతిజ్ఞ రాక్షస సంహారం అని తెలుసు. శ్రీ వేంకటాద్రి మీద నీకు ఏదబాటు లేదు రామచంద్రా. యుగాల పర్యంతం నీకదే స్థిర నివాసం.

భావ విశ్లేషణ : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు.

Friday, 15 February 2019

కొట్టరో ఉట్టులు గోపాలబాలురు - అన్నమయ్య కీర్తన



ఈ వారం అన్నమయ్య కీర్తన.
కొట్టరో ఉట్టులు గోపాలబాలురు
ఇట్టే కృష్ణుని ఎదుటను
పట్టరో వారలు పాలు నేతికిని
గట్టిగ జోరున గారీ నవిగో ॥
కూడరో మూకలు కోలలవారలు
వేడుక గృష్ణుని వెంటవెంట
ఆడుచు మెసగరో అడుకులు జక్కిలాలు
వాడల వాడల వరుసతోను ॥
నిక్కితీసుకోరో నెరవారికాండ్లు
మక్కువ గృష్ణుని మరంగునను
ఎక్కరో శ్రీవేంకటేశు కొండమీద
పెక్కు నురుగులు పెరుగులు నివిగో ॥
భావ మాధుర్యం :
అన్నమయ్య చెప్పిన ఈ కీర్తన అధ్యాత్మ కీర్తన అంటే బాగుంటుంది. శ్రీ కృష్ణుడు ఎక్కడ చూసినా అలిమేలుమంగను మచ్చికతో కలిసి ఉన్నవాడే. ఉట్ల పండగ జరిగే కృష్ణాష్టమి నాడు దీనిని చెప్పి ఉంటారు.
గోపాల బాలుల్లారా ! ఉట్లను పగులగొట్టండి. ఇట్టే శ్రీకృష్ణుడు మీ ఎదుటనే ఉన్నాడు. పాలు, నెయ్యి కారిపోతున్నాయి జోరుగ ధారగ. దోసిలిపట్టి తాగండి. గుంపుగా కూడి కోలాటాలు వేడుకగా కృష్ణునితో కలిసి ఆడండి. ఆడుతూనే రేపల్లెలోని ప్రతి వాడకూ పోయి అటుకులు, చక్కిలాలు తినండి. ఓ సామర్ధ్యంగల కుర్రవాండ్లూ! ఎత్తుగా ఎగిరి ఈ ఉట్టిని కొట్టండి. కావాలంటే కృష్ణుడు మీ ముందున్నాడు. శ్రీ వేంకటేశ్వరుని కొండ ఎక్కారంటే బోలెడంత పాల నురుగులు, పెరుగులు దొరుకుతాయి.

Wednesday, 16 January 2019

యిరవగుజీవుల కెంతగలిగినా పరధనకాంతలే బలుప్రియము - అన్నమయ్య కీర్తన






అన్నమయ్య కీర్తన :
ఈ లౌకిక ప్రపంచమంతా మాయామయం. ఈ మాయను మానవుడు సులభంగా దాటగలడా? కనుక భగవంతుని శరణుజొచ్చి మాయ మేలిముసుగులో నుంచి మనం బయటపడాలి. ఏదో ఒక అద్భుత సంఘటన జరిగి ఆ శ్రీహరి కృప కలిగితే చెప్పలేము కానీ అన్యులకు ఇది దుస్సాధ్యం అంటున్నాడు అన్నమయ్య.
పల్లవి: కటకట యీమాయ గడచుట యెట్లో
ఘటనల హరికృప గలిగినఁ గాక
చ.1. యిరవగుజీవుల కెంతగలిగినా
పరధనకాంతలే బలుప్రియము
ధరఁ గర్మాపుఁజేతలలోనెల్లా
సొరదిఁ బాపమే సులభము ॥కటకట ||
చ.2. నానారుచులు యనంతము గలిగిన
కానిపదార్ధమె కడుఁ దీపు
పానిన చదువుల పఠన లుండగా
మానని దుర్బాషమాఁటలే హితవు ॥కటకట॥
చ.3. యెదలో శ్రీవేంకటేశ్వరుఁడుండఁగ
సదరపు దివిజులు చవులయిరి
అదనను శ్రీగురుయానతి గలుగఁగ
పొదిగొని యివి తలపోయఁగ వలెసె ॥కటకట॥
విశ్లేషణ:
అయ్యయ్యో! ఈ మాయను దాటడం ఎటుల? అర్ధం కావడంలేదు. ఏదైన దైవ సంఘటన జరిగి ఆ శ్రీనివాసుని దయ కలిగితే వేరే విషయం కానీ మామూలుగా దాట శక్యమా!
చ.1.
ఆహా! శ్రీహరీ! ఈ భువిపై స్థిరంగా ఉన్న జీవులు ఎంత చిత్త చాపల్యం కలిగినవారు? వీరికి ఎంత ధనం ఉన్నప్పటికీ పరధనం మాత్రమే వీరికి ప్రియము. ఇంట సతి ఉన్నప్పటికీ పరకాంతలమీదనే వీరి ధ్యాస! ఈ భూమిపై పుణ్యకార్యాలు చేయాలంటేనే అందరికీ కష్టం. పాపకార్యాలు వరుసగా చేస్తూఆ విషయంలో మాత్రం ముందుంటారు కదా!
చ.2.
మనకు తినడానికి తయారుగా అనేక పదార్ధాలు ఉన్నప్పటికీ, మనకు కాని పదార్ధమే ఎక్కువ తీపుగా ఉంటుంది కదా! పొరుగింటి పుల్లగూర రుచి చందాన ఉంటుంది మన నైజం. అలాగే మనం ఎంతో కష్టపడి గురుశుశ్రూష చేసి వేద,వేదాంగాలను చదువుకుని నెమరు వేసుకోవడానికి భగవంతుడిని ధ్యానించడానికి నాలుకపై తయారుగా ఉన్నప్పటికీ, మనం అనకూడని మాటలు పాపపూరిత భాషణలే సదా చేస్తూ ఉంటాము. అవే మనకు ఇష్టంగా ఉండడం మాయకాకపోతే మరి ఏమిటి?
చ.3.
అందరి హృదయక్షేత్రాలలో స్థిరంగా నెలకొని శ్రీవేంకటేశ్వరస్వామి ఉండగా, తేలికగా అనుగ్రహం కలుగుతుందని వెళ్ళి చిల్లరదేవుళ్ళను చేరి ఇష్టప్రీతి కొలవడం ఎందుకు? తగిన సమయంలో గురువుగారి శిష్యరికం చేసి ఆయన ఆశీర్వాదం పొందవలెను గదా! అలా చేసినట్లైతే మనకు అనేక సమస్యలు నశించి ధన్యులవడం తధ్యము అని అన్నమయ్య నివేదిస్తున్నాడు.

అక్కర కొదగని యట్టి అర్ధము లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే - అన్నమయ్య కీర్తన




అన్నమయ్య కీర్తన
పల్లవి: అక్కర కొదగని యట్టి అర్ధము
లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే
చ.1. దండితో దనకు గాని ధరణీసు రాజ్యంబు
యెండె నేమియది పండే నేమిరే
బెండు పడ గేశవుని బేరుకొనని నాలికె
వుండనేమి వుండకుండ నేమిరే ॥ అక్కర ॥
చ.2. యెదిరి దన్ను గానని యడపుల గుడ్డికన్ను
మొదల దెరచెనేమి మూసెనేమిరే
వెదకి శ్రీపతి సేవ వేడుక జేయని వాడు
చదివెనేమి చదువు చాలించె నేమిరే ॥ అక్కర ॥
చ.3. ఆవల నెవ్వరు లేని అడవిలోని వెన్నెల
కావిరి గాసెనేమి కాయకున్న నేమిరే
శ్రీవేంకటేశ్వరుని జేరని ధర్మములెల్ల
తోవల నుండెనేమి తొలగిన నేమిరే ॥ అక్కర ॥
భావం :
మనదగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ మనకు అవసరమైనప్పుడు అది మనకు అక్కరకు రావాలి కదా! అలా కానప్పుడు ధనం ఎంతవున్నా ఉపయోగశూన్యమే కదా! అసలు లేకపోయినప్పటికీ ఉపయోగం ఏమీ ఉండదు అని అర్ధాన్ని గూర్చిన గొప్ప సత్యాన్ని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.
1. దేశాన్ని పరిపాలించే చక్రవర్తికి లేక మహారాజుకు ధనం దండిగా ఉండాలి. అలా కాకపోతే ఆ రాజుగారికి ఏమి ఉపయోగం ఉండదు కదా! బలహీనుడైన మానవుడు కేశవుని నామం జపించి రక్షణ పొందాలి అలా కాని నాడు ఆ నాలుక ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి?
2. విరోధులను ఎదిరించడానికి కండ్లు కావాలి. దానికి ఉపయోగించనటువంటి కన్నులు ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? అలాగే శ్రీపతిని కన్నులతో వెదకి వెదకి పట్టుకుని సేవించగలగాలి. అలా చేయని వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఉపయోగం ఏమిటి?
3. ఎటువంటి మనుష్య సంచారంలేని అడవిలో ఎంత పున్నమి వెన్నెలలు కాస్తే మాత్రం ఉపయోగం ఏమిటి? ఎవరికి ఉపయోగం? ఆ వెన్నెల చీకటిని తొలగించినా ఏమీ ఎవరికీ ఉపయోగం ఉండదు కదా! మానవుడు ఏ ధర్మ శాస్త్రాలు చదివినా పురాణాలు చదివినా దానికి పరమార్ధం ఏమిటి? చదివినది ఏ చదువైనప్పటికీ అది శ్రీవేంకటేశ్వరుని దరికి జేరే మార్గం నేర్పాలి. అలా కానప్పుడు మన జీవనంలో ఎన్ని వేదాలు, ధర్మాలు, శాస్త్రాలు పురాణాలు చదివితే నేమిటి? చదవకపోతే నేమిటి? అన్నీ వృధానే కదా!

Friday, 21 December 2018

పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా! - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన
అన్నమయ్య ఈ కీర్తనలో నాలుక పవిత్రం కావాలంటే ఉబుసుపోని పలుకులు, వాళ్ళ మీద వీళ్ళమీద చెప్పుకునే చాడీలు వద్దు అంటున్నాడు. శ్రీవేంకటేశ్వరుని బహువిధాల కీర్తించినప్పుడు మాత్రమే మనిషి జిహ్వ పవిత్రమౌతుంది అంటున్నాడు.
కీర్తన:
పల్లవి: పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా!
వేవేల కితని నింక వేమాఱునుం బాడి ||పల్లవి||
చ.1.హరినామములే పాడి అతనిపట్టపురాణి
ఇరవై మించినయట్టియిందిరం బాడి!
సరస నిలువంకలాను శంఖచక్రములఁ బాడి!
వరదకటిహస్తాలు వరుసతోఁ బాడి ||పావ||
చ.2.ఆదిపురుషునిఁ బాడి అట్టే భూమిసతిఁ బాడి
పాదములఁ బాడి నాభిపద్మముఁ బాడి
మోదపుబ్రహ్మాండాలు మోచే వుదరముఁ బాడి
ఆదరానఁ గంబు కంఠ మంకెతోఁ బాడి ||పావ||
చ.3.శ్రీవెంకటేశుఁ బాడి శిరసుతులసిం బాడి
శ్రీవత్సము తోడురముఁ జెలఁగి పాడి
లావుల మకరకుండలాలకర్ణములు పాడి!
ఆవటించి యితనిసర్వాంగములుఁబాడి ||పావ||
“ఓ జీవుడా! నీ జిహ్వతో శ్రీనివాసుని వేవేల కీర్తించి పావనం కారాదా! నీ నాలుకను పావనం చేసుకోరాదా! అని విన్నవిస్తున్నాడు.
ఓ జిహ్వా! నిరంతరం శ్రీహరి నామాలను కీర్తించు. ఆయన పట్టపురాణి యైన ఇందిరను కీర్తించు. ఆ శ్రీహరి శంఖు చక్రాలను కీర్తించు. ఆయన కటిప్రదేశములో నున్న వరద హస్తాన్ని కీర్తించు. ఆవిధంగా కీర్తించి తరించమని మోక్షప్రాప్తిని పొందమని అన్నమయ్య ఉద్బోధ.
ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువును ప్రార్ధిద్దాం. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీదేవి ఆయన పాదములను ఒత్తుతుండగా చూచి తరించి కీర్తిద్దాం. పదునాలుగు భువనభాండమ్ములను ఆనందంతో మోస్తున్న ఆదిదేవుని కీర్తిద్దాం. ఆదరంగా శంఖంవంటి కంఠముగల శ్రీనివాసుని చేరి కీర్తిద్దాం.
శ్రీవేంకటేశ్వరుని మనసారా త్రికరణ శుద్ధితో కీర్తిద్దాం. ఆయన శిరసుపై ఉన్న తులసిమాలను కీర్తిద్దాం. విజృంభించి ఆయన వక్షస్థలంపై గల శ్రీవత్సము అనే పేరుగల పుట్టుమచ్చను కీర్తిద్దాం. ఆదేవదేవుని మకరకుండలములను గాంచి కీర్తించి తరిద్దాం. పొందికగా శోభించే ఆయన సర్వాంగాలను కీతించి తరిద్దాం రండి అని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.
విశ్లేషణ : శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య

Monday, 17 December 2018

ఇన్నియు నుండగా తమకేమి గడమ - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన


ప. ఇన్నియు నుండగా తమకేమి గడమ
ఉన్నవాడు శ్రీ పురుషోత్తమ రాజు


1. వీలుచు నీ రావటించి వేదమరాజు
కూలికి గుండ్లు మోచి కూర్మరాజు
పోలిమి నేలలు దువ్వి బొలమురాజు
నాలి బడుఛాటలాడి నరిసింగరాజు //


2. చేకొని చేతులు చాచి జిక్కరాజు
రాకపోగా దపసాయె రామరాజు
రాకట్నములె గట్టి రాఘవరాజు
రేకల బసుల గాచి కృష్ణరాజు


3. మగువల కిచ్చలాడి మాకరాజు
జగమెల్ల దిరిగీని జక్కరాజు
నగుబాటు దీర శ్రీ వెంకటనగముపై
వెగటై లోకమునేలే వెంగళరాజు

పురుషోత్తమ రాజు గారికి ఎన్నో ఘనమైన బిరుదులున్నాయి. ఇంకేమి కొరత ?
సాక్షాత్తూ సిరిని కూడా కలిగి యున్నవాడు. నీటమునిగిన వేదాలను బయటకు తెచ్చ్చిన వేదమరాజు (మత్స్యావతారం ). శ్రమపడి కొండను మోసిన కూర్మరాజు. (కూర్మావతారం). కోరలతో నేలను తవ్విన పొలమురాజు (వరాహావతారం). లక్ష్మీదేవి కన్నుగప్పి చెంచు కన్యతో యవ్వనపులాటలాడిన నరసింగరాజు (నరసింహావతారం).


కఠినమైన ఉద్ద్దశ్యంతో చేతులు చాచిన జిక్కరాజు (వామనావతారం). (చేతిలో చిన్న దండం కాబట్టి జిక్క అన్న పదం ఉపయోగించాడు పేద తిరుమలయ్య). రాజులపై దండెత్తి చివరకు రాముని దర్శనం చేసుకున్న తరువాత తపస్సుకు వెళ్లిన పరశురామరాజు. రాజరికాన్ని విడిచిపెట్టి అడవులకేగిన రాఘవరాజు (రామావతారం). రేపల్లెనందు పశువులుగాచిన కృష్ణరాజు.


పడుచులతో ఇఛ్చాకములాడి పనులు సాధించిన మాకరాజు (బుద్ధావతారం).
జగములంతటా తిరుగుతూ రక్షణచేసే చక్కరాజు. (కల్కి అవతారం). పై అవతారాల్లో చేసిన పనులకు అలసటపొంది వెంకటాచలముపై నిలబడి లోకరక్షణ చేస్తున్నాడు వెంగళరాజు.


వార్ధక్యం



నా ఆత్మీయ సోదరుని పరితాపం చూసి కలిగిన భావోద్వేగం.
బరువైన బాధ్యతలను సంతోషంగా స్వీకరించి మాతాపితరుల ఋణం
తీర్చుకున్న రోజులు ..
సంతాన లేమితో మానసికవ్యధని అనుభవించినా ప్రాప్తమింతేనని సరిపెట్టుకుని నిరాశ చెందని రోజులు.
ఉన్నలో ఉన్నంత అసహాయులకు సాయం చేసి సంతృప్తి పొందిన రోజులు.
అయినవాడని చేరదీసి, ఆలనా పాలనా చూసి చరమాంకంలో ఆదుకుంటాడని
ఆశించిన రోజులు.
స్వార్ధపరులైన వారు చూపిన అమానుష నిర్లక్ష్య చర్యలకు తనలో తానే
ఆక్రోశించిన రోజులు.
అనారోగ్యంతో, ఆవేదనతో అర్ధాంగి నిష్క్రమణం. ఒంటరితనంతో
పరితపించిన రోజులు.
వృధ్ధాప్యంలో ఆదుకోవలసిన చేయి తృణీకరిస్తే ఆవేదనతో దుఃఖిoచిన రోజులు.
ఒంటరిగా పూటకూళ్ళ ఇంటి భోజనంతో అంత్యదినం కోసం ఆశగా
ఎదురుచూస్తున్న రోజులు
-- పొన్నాడ లక్ష్మి