Thursday, 17 December 2015

ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాల - అన్నమయ్య కీర్తన



ప.       ఎత్తరె ఆరతులీమెకు ఇంతులాల
          హత్తెను శ్రీవెంకటేసు కలమేల్మంగ.

౧.       హరి ఉరముపై సొమ్ము అరతగట్టిన తాళి
          సరిలేని దేవుని సంసారఫలము
          సిరులకు బుట్టినిల్లు సింగారములవిత్తు
          మెరుగుబోడి యలమేలుమంగ .              !!
౨.       పరమార్మునికి నాత్మభావములో కీలుబొమ్మ
          కెరలుచునితని భోగించే మేడ
          సరసపు సముద్రము సతమైన కొంగుపైడి
          అరిది సంపదలది యలమేలుమంగ.                   !!
౩.       శ్రీ వేంకటేశుని దేవి చిత్తజుని గన్నతల్లి
          ఈవిభుని కాగిటిలో యేచిన కళ
          బూవపు పెండ్లి మేలు పొందిన విధానము
          ఆవల నీవల నీపె యలమేలుమంగ.                   !!.

భావము: (అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు).
                ఇది మంగళగీతము. శ్రీ వేంకటేశ్వరుడు అలమేలుమంగా, పరమాత్మ, ఆత్మలు. వారి సంగమమే జగన్మంగళము. ఓ ఇంతులారా ఆ దంపతులకి హారతులు ఇయ్యండి. స్వామి అలమేలుమంగను హత్తుకొనినాడు. ఈ దేవి ఎవరు? శ్రీహరి ఉరముపైన సొమ్ము, దేవి కంఠసీమనలంకరించిన మంగళసూత్రము. సిరులకు కాణాచి. సింగారములకు బీజము. శ్రీహరి సంసారఫలము పైడిఛాయతో విలసిల్లే అలమేలుమంగ.
          పరమాత్ముడైన హరి ఆత్మభావములో కీలుబొమ్మవలె నడుచునది. అతిశయించి ఆయన భోగాలనుభవించే దివ్యసౌధము. సరసాల సాగరము. శాశ్వతమైన శ్రీహరి కొంగుబంగారము. అరుదయిన సంపదలందించే శ్రీమహాలక్ష్మి ఈ అలమేలుమంగ.
          ఈ దేవియే శ్రీ వేంకటేశ్వరుని పట్టపురాణి. మన్మధుని కన్నతల్లి. శ్రీ వేంకటేశ్వరుని కౌగిలిలో ఒదిగిపోయిన కళ. మేలైన హరి పెండ్లి భోజనము. ఆయన పొందిన నిధానము. అటు తిరుమలలోను, ఇటు వైకుంఠం లోనూ ఆమె అలమేలుమంగ.

Wednesday, 16 December 2015

అమృతవాహిని






ఈ నెల 15వ తేదీనాడు హైదరాబాద్ లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆవరణలో ప్రముఖ రచయిత్రి  శ్రీమతి గంటి సుజల గారు రచించి, ఆంధ్రభూమి నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల 'అమృతవాహిని', కధల సంపుటి 'ప్రియే చారుశీలే'  పుస్తకాలు ఆవిష్కరించ బడ్డాయి. 'అమృతవాహిని' నవలకి ముఖచిత్రంగా చిత్రకారులయిన మా శ్రీవారు (పొన్నాడ మూర్తి) గారి కుంచెలో చిత్రీకరించబడిన చిత్రం ముఖచిత్రంగా రూపుదిద్దుకుంది. ఆశించినదానికంటే మిన్నగా నవలలో పాత్రకి తగ్గట్టుగా వచ్చి, పలువురు ప్రశంసలు పొందింది.
పుస్తకానికి ముఖచిత్రం వెయ్యడం ఇది వారి తొలి ప్రయత్నం. సభకు  విచ్చేసినవారందరూ  ప్రశంసిస్తుంటే నాకెంతో ఆనందం కలిగింది. ఇలా చిత్రలేఖనంలో ఒక్కొక్క మెట్టు పైకెక్కి ముందుముందు అఖండ విజయం సాధించాలని భగవంతుని కోరుకుంటున్నాను.

-- పొన్నాడ లక్ష్మి

Wednesday, 28 October 2015

అట్లతద్దె - అట్ల తదియ




అట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్ -మూడట్లోయ్
బహుశా ఈ పాట ఎవరికీ తెలియదనుకుంటాను.  ఏమి లేదండి నేను చెప్తున్నది అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం(ఉట్టికింద ముద్ద) చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, ఒప్పులగుప్పలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలలు ఊగుతారు. ఉట్టి  కింద ముద్ద తినడానికి ఇంట్లో ఉన్న మగపిల్లలు కూడా పోటీ పడేవారు.
అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తెల్లవారుఝామున  ఎవరి చేతులు ఎంత బాగా పండాయో చూసుకుంటూ వెన్నెల్లో అందరూ బృందంగా చేరి  ఆటలతో, పాటలతో తదియ రోజు చాలా సంతోషంగా గడుపుతారు. ప్రతీ ఇంట్లోనూ ఎలాగో అలాగ ఉయ్యాల  ఏర్పాటు చేస్తారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలాబాగా జరుపుకునేవారు. పొద్దు ఎక్కాగ తల స్నానం చేసి, చక్కగా ముచ్చటగా ముస్తాబు అయి, దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. అదీ ఎలా అనుకుంటున్నారు? పది రకాల పండ్లు ఆరారా  తింటూ, పది కిళ్ళీలు నములుతూ, ఉయ్యాలలూగుతూ సరదాగా గడుపుతారు.  సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు . ఆ తరువాత అమ్మవారికి, ఒక ముత్తైదువ కి పది అట్లు, తిమ్మనం, తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు పొంది, అ అట్లే వీరుకూడా భుజించి నోము పూర్తి చేసుకుంటారు. ఈనాడు ఆధునికత అనే ముసుగులో మరుగుపడిపోయిన నోము ఇది. తల్లితండ్రులు కొంచెం శ్రద్ధ తీసుకుంటే, ఒక్కరోజయినా, తెల్లవారుజాము అందాలు, వెన్నెలలో ఆటలు ఈకాలం పిల్లలు అనుభవించి ఆనందిస్తారు.
అట్ల తదియకు ఒక కథ ఉంది :
ఒక వూర్లో రాజు గారమ్మాయి, వెలమవారి పిల్ల, బ్రాహ్మ్నవారి పిల్లా, కోమటిపిల్ల,నలుగురు వివాహం కాకముందు చిన్నతనంలో నే అట్లాతదియనోము చేద్దామనుకున్నారు తదియనాడు వుపవాసం వున్నారు. రాజుగారమ్మాయి అతిసుకుమారి కనుక సాయింత్రం కాగానే ముఖము వాడి మూర్ఛపోయినది. వీధిలోనుండి అన్నగారు వచ్చి అమ్మా! చెల్లెమ్మ ఏది అని అడుగుగా నాయనా! అట్లతదియ నోము చేద్దామనుకుని ఉపవాసముంది . చంద్రోదయం వరకు వుండలేక మూర్చపొయినధి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య ఏమి దారని అలోచించి వెంటనే దూరంగావున్న చింత చెట్టుకు అద్దం పెట్టి దానికి ఎదురుగా చిన్న మంట పెట్టి చెల్లిలిని లేపి అదిగో చంద్రుడు ఉదయించాడు అనిచెప్పగా కలతనిద్ర లొ వున్న ఆ అమ్మాయి నిజంగా చంద్రుడని బావించి,  ఫలహారం చేసేను. కొన్నాళ్ళకు వివాహం చేయగా వయసు మీద పడిన వాడు భర్తగా సంప్రాప్తమయ్యేను. నేను అట్లతదియ నోము నోచినా నాకు ఇదేమీ ప్రారబ్దం అని భాద పడుతూ ఒకనాడు రాత్రి అడవికి వెళ్ళిపొయినది.
ఓ అమ్మాయి ఒంటరిగా ఈ అడవిలో ఎక్కడికి పోతున్నావని పార్వతి పరమేశ్వరులు మారు వేషములో వచ్చి అడుగగా నాయనా మీరేమైనా అర్చేవారా తీర్చేవారా మీకెందుకు అని చెప్పి నడుస్తోంది. మీము ఆర్చెదము తీర్చేదము నీ సంగతి చెప్పు అని అడిగిరి . ఆ చిన్నది వారికి నమస్కరించి వారి స్నేహితులుతో చేసిన నోము గురించి చెప్పి, తనకు మాత్రమె ముసలి భర్త లబించాడని, నాకు మాత్రమె ముసలి భర్త లభించటానికి కారణం ఏమి  నా పాపమా? అని తన భాదను వివరించింది.
వారు దానికి చిన్నదానా నీవ్రతం భంగమైనది అని చెప్పి, ఆ అమ్మాయి అన్నగారి వలన జరిగిన చర్య సవివరంగా చెప్పారు. జరిగినదానికి నేను ఇప్పుడు ఏమి చేయ్యనని వారిని అడుగగా మరలా ఆ వ్రతం నిష్టగా చెయ్యమన్నారు. ఆమె తిరిగి రాజ్యానికి చేరి తదియరోజు ఆ వ్రతం చేసినది. ముసలి భర్త మంచి అందమైన యువకుని గా మారెను. అది చుసి అందరూ  కారణమడుగగా జరిగిన వృతాంతం చెప్పెను.  ఇది అట్ల తదియ నోము కథ.
ఈ కధ విని అక్షింతలు తలమీద వేసుకొని చంద్రుని చూసి పదకొండు అట్లు, తాంబూలం ముత్తైదువకు ఇచ్చి తను అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్న పదకొండు అట్లు తినాలి.
ఇదండి అట్ల తద్ది నోము. మరి వీలున్నంతవరకు మన పిల్లల చేత చేయిద్దామా?
 
 (పొన్నాడ లక్ష్మి)

Monday, 26 October 2015

సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి - (మొల్ల రామాయణం)



మొల్ల రామాయణం లోని పద్యం.
సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి యే
ర్వడ ఒక కాంత  యయ్యెనట, పన్నుగ నీతని పాదరేణు లి
య్యెడ వడి నోడ సోక నిది ఎట్లగునో యని సంశయాత్ముడై
కడిగె గుహుండు రామపదకంజయుగంబు శుభంబు పెంపునన్ .

రామపాదం సోకి రాయి ఒక కాంతగా (అహల్య) అయిందట. ఇప్పుడు నీ పాదం సోకితే నా నావ ఏమౌతుందో అని గుహుడికి సందేహం కలిగిందట.ఎందుకైనా మంచిదని ముందుగా రాముని పాదపద్మములను కడిగి ఆ తరువాతే తన నావను ఎక్కనిచ్చాడట.  ( ఈ సుకుమార కల్పన ఆధ్యాత్మ రామాయణం లోది. వాల్మీకి రామాయణం లో లేదు.)

అయితే ఇదే భావంతో బాపు గారి సంపూర్ణ రామాయణంలో గుహుడికి చక్కని పాట పెట్టారు. గీత రచయిత కొసరాజు గారు ఈ పద్యం ప్రేరణతోనే ఆ పాట రాసారనుకుంటా.
          “నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయనాదంట
          నా నావ మీద కాలుపెడితే ఏమవుతాదో తంట
          దయచూపి ఒక్కమారు కాళ్ళు కడగనీయమంట
          మూడు మూర్తులా నీవు నారాయణమూర్తి వంట.
          రామయ తండ్రి, ఓ రామయ తండ్రి......

- పొన్నాడ లక్ష్మి