కొండవేలనెత్తినట్టి గోవిందా, నిన్ను
కొండించేరు యసోదకు గోవిందా..
గొల్లెతలు మొక్కేరు గోవిందా నీ
కొల్లల చీరలిమ్మని గోవిందా
గొల్లువెన్న దొంగిలగా గోవిందా నిన్ను
గొల్లున నవ్వేరు వీరె గోవిందా…
గోవుల గాచే వేళ గోవిందా పిల్ల
గోవిని వలచిరి గోవిందా
గోవళులై యమునలో గోవిందా
నీకు
కోవరమున్నారురా గోవిందా…
కొట్టేటి వుట్లకింద గోవిందా నీతో
గొట్టెవాటై పెనగేరు గోవిందా
గుట్టుతో శ్రీవేంకటాద్రి గోవిందా కూడి
గొట్టాన బెట్టేరు బత్తి గోవిందా….
శ్రీవేంకటేశ్వరుని పరమభక్తుడైన పదకవితాపితామహుడు,
పలుకీర్తనల్లో చిన్నికృష్ణుని
చిలిపిచేష్టలకు, లీలాప్రదర్శనలకు పదాకృతినిస్తూ రేపల్లెను మన కళ్ళముందుకు
రప్పించాడు. ఆ క్రమంలో వచ్చిందే ఈ కీర్తన. వ్రేలితో కొండనెత్తడం దగ్గర నుంచి,
వెన్నను దొంగలించడం వరకు ఆ వేణుగానలోలుడి విన్యాసాలను పాటగా పాడుకొని పరవశించిపోయాడు.
ఆడేపాదే వయసున్న చిన్నికృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడం అద్భుతమైన
ప్రక్రియ. అదే అద్భుతాన్ని పల్లవిలో ఉద్ఘాటించాడు.గోవిందా అన్న నామంతో అటు
శ్రీకృష్ణునీ, ఇటు శ్రీనివాసునీ స్మరించుకుంటున్నాడు. ‘గొండించేరు’ అంటే కొండెములు
చెప్పడంతో పాటు పొగడుట అని కూడా అర్ధాలు ఉన్నాయి. బాలకృష్ణుడు అల్లరి చేసినప్పుడు
యశోదమ్మకు అతడిపై చాడీలు చెప్పినవారే, కొండనెత్తడం, కాళీయమర్ధనం వంటి
అద్భుతకార్యాలు నెరవేర్చినప్పుడు ఆ అమ్మ ముందు అతనిని పొగద్తలతో ముంచెత్తారు.
యమునానదిలో గోపికలు జలకాలాడుతున్నవేళ నీవు వాళ్ళ చీరలు అపహరించావు.
అవి ఇమ్మని వాళ్ళు ఎంతగా వేడుకున్నారు. ఆ గోపకాంతలే నీవు వెన్న దొంగలించినప్పుడు
గలగలా నవ్వుకున్నారు. వస్త్రాల కోసం ప్రార్ధించిన ఆ నోళ్ళే వెన్నను చాటుగా
తిన్నప్పుడు పకపకా నవ్వుకున్నాయని పోల్చుతున్నాడు. నిజంగా ఆ గొల్లెతల పుణ్యమే
పుణ్యం.
గోవులకాచేవేళ నీవొక్కడివే పిల్లనగ్రోవి ఊదుకుంటూ వెళుతుంటే గోపికలు
చూచి నిన్ను వలచారు. అలాగే యమునాతీరంలో యుక్తవయస్సులో ఉన్న గోపికలు నీకోసం
వేచిచూస్తూ ఉండేవారని అన్నమయ్య చెప్తున్నాడు. ‘గోవాళులు అంటే యవ్వనంలో ఉన్న
గోపికలు, ‘కోవరమున్నారు’ అంటే వేచి ఉన్నారు అని అర్ధాలు.
నీవు వుట్లను కొట్టేవేళ గోపబాలురంతా ఓ గలాటాగా నీ చుట్టూ చేరి గోల
చేసేవారు. అదే నిన్ను ఈనాడు వెంకటాద్రిపై భక్తితో పూజిస్తూ తరిస్తున్నారు. భక్టి
శబ్ధానికి వికృతరూపం బత్తి.
వ్యాఖ్యానం.. శ్రీమతి బి. కృష్ణకుమారి. సేకరణ పొన్నాడ లక్ష్మి..
No comments:
Post a Comment