Monday, 16 April 2018
ఎదురా రఘుపతికి నీ విటు రావణా! - అన్నమయ్య కీర్తన
ఈ వారం అన్నమయ్య కీర్తన.
ఎదురా రఘుపతికి నీ విటు రావణా!
నేడిదేమి బుధ్ధి తెలిసి తిట్లాయె బ్రతుకు. !!
హరుని పూజలు నమ్మిహరితో మార్కొనగ
విరసమై కూలితివి వెర్రి రావణా!
వరుసతోడ బ్రహ్మ వరము నమ్మి
రాముని శరణనకుండానే సమసెగా కులము. !!
జపతపములు నమ్మి సర్వేశు విడువగా
విపరీతమాయెగా వెర్రి రావణా!
వుపమలన కడు తానున్న జలనిధి నమ్మి
కపుల పాలైతివిగా కదనరంగమున.. !!
బంటతనము నమ్మి పైకొన్న రాఘవు
వింట బొలసితివిగా వెర్రి రావణా!
యింటనే శ్రీ వేంకటేశ్వరుని గొలిచి
వెంటనే సుఖియాయె విభీషణుడు. !!
వినాశకాలే విపరీత బుధ్ధి అస్న నానుడికి రావణబ్రహ్మే తార్కాణం. అదే ఈ కీర్తనలో అన్నమయ్య వివరించాడు.
"రఘుపతికి నీవు సరిసాటివాడివా రావణా! ఆయనని ఎదిరించగల వీరుడివా? అన్నీ తెలిసిన నీ బుధ్ధి నేడు ఈ విధంగా పెడదారి పట్టి అవమానాల పాలాయె కదా నీ బ్రతుకు రావణా!" అని లంకాధిపై అన్నమయ్య జాలిపడుతున్నాడు.
ఆ పరమేశ్వరుని పూజలు చేసి, ప్రియ భక్తుడవని కీర్తిని కాంచి, హరుడు, హరి వేరు కాదన్న నిజము తెలిసికోలేక శ్రీ హరినే ఎదుర్కొన్నావు. నీ పూజలన్ని బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. అహంకారంతో ఆ దేవదేవుడిని ధిక్కరించి దిక్కులేని చావు తెచ్చుకున్నావు. బ్రహ్మచే వరాలు పొంది రావణబ్రహ్మగా పేరు గాంచి, ఆ బ్రహ్మ పుట్టుకకే కారణమయిన శ్రీ మహావిష్ణుని రూపమైన శ్రీరాముని శరణు వేడుకోలేకపోయావు. నీ స్వయంకృతం వల్ల నీ కులమునే సమసిపోయేలా చేసుకున్నావు.
జపతపములు చేసేనన్న అహంతో ఆ సర్వేశ్వరుడిని విస్మరించి విపరీత పరిస్థితులని కొని తెచ్చుకున్నావు వెర్రి రావణా! జలనిధి మధ్యనున్నానన్న నమ్మకంతో ఉన్నావు. ఆ జలనిధి మీదే వారధి కట్టి వచ్చిన కపులు నిన్ను గడగడలాడించారు కదా!
నీ పరాక్రమమును నమ్ముకొని పంతానికి పోయి రాముని వింటికి గురి అయి ప్రాణాలు కోల్పోయేవు కదా వెర్రి రావణా!ధర్మాన్ని నమ్ముకుని రాముని ప్రతిరూపమైన శ్రీ వేంకటేశ్వరుని శరణు కోరి, ఆయన అపారకృపకు పాత్రుడైనాడు విభీషణుడు.
Subscribe to:
Post Comments (Atom)
ధన్యవాదాలు, చాలా బాగా విపుళీకరించారు
ReplyDelete