Tuesday 6 March 2018

మిక్కిలి నేర్పరి యలమేలుమంగ - అన్నమయ్య కీర్తన

మిక్కిలి నేర్పరి యలమేలుమంగ
అక్కర దీరిచి పతినల మేలుమంగ !!
కన్నులనె నవ్వునవ్వి కాంతునిదప్పక చూచి
మిన్నక మాటాడీనలమేలుమంగ
సన్నలనె యాస రేచి జంకెన బొమ్మలు వంచి
అన్నువతో గొసరీని యలమేలుమంగ. !!
సారెకు జెక్కులు నొక్కి  సరుసనె కూచుండి
మేరలు మీరీ నలమేలుమంగ
గారవించి విభునికి గప్పురవిడెమిచ్చి
యారతులెత్తీనిదె యలమేలుమంగ !!
ఇచ్చకాలు సేసి సేసి యిక్కువలంటి  యంటి
మెచ్చీనతని నలమేలుమంగ
చెచ్చెర కౌగిట గూడి శ్రీ వేంకటేశ్వరుని
అచ్చముగా నురమెక్కీ నలమేలుమంగ. !!

భావం..
మా అలమేలుమంగ భర్తగారి అవసరాన్ని కనుక్కొని చక్కగా దాన్ని నెరవేర్చింది. ఆమె మహా జాణ.
మా అలమేలుమంగ స్వామి వారిని అదేపనిగా చూస్తూ కళ్ళతో నవ్వింది. కాసేపు మౌనంగా ఉండి తర్వాత ఏది మాట్లాడాలో అది మాట్లాడింది. కొన్ని సంజ్ఞలతో అయ్యవారికి ఆశలు రేపింది. దగ్గరగా ఉన్న కదలే కనుబొమ్మలను ఎలా వంచాలో అలా వంచింది. ఇంతటితో ఊరుకుందా? కొన్ని ప్రత్యేకమైన కూతలు చేసి, కొన్ని కోరుకొంది.
అయ్యవారి దగ్గరకు చేరి తన చెక్కిలిని వారి చెక్కిలితో నొక్కింది. దగ్గరగా తాకుతూ కూర్చుంది. ఇంక ఆ తర్వాత  చెప్పవలసిన పనేముంది? కాస్త హద్దులు దాటింది. స్వామి వారికి కర్పూర తాంబూలమిచ్చింది. ఆ తరువాత ప్రేమతో హారతులిచ్చింది.
ఎప్పుడూ చేతలేనా, కాసిన్ని ప్రియమైన మాటలు చెప్పుకొందామని, ముందుగా తాను ప్రియముగా మాట్లాడింది. తదుపరి ఇరువురి శరీరాల తాకిడికి మైమరచిపోయింది. స్వామివారి చేతలను మనసారా మెచ్చుకొంది. ఇక ఆగలేక  ఎక్కువ బెట్టు చేయకుండానే వేంకటేశ్వర స్వామివారి కౌగిట్లోకి చేరింది. ప్రసన్నంగా తానే అతని వక్షస్థలం మీదికి చేరుకొంది.
శృంగారానికి పరమార్ధం ఒకరిలో ఒకరు లీనం కావడం. మోక్షానికి కూడా పరమార్ధం జీవాత్మ పరమాత్మలో లీనం కావడం. తన్ను తాను మరిచిపోయిన సాన్నిహిత్యం ఉంటేనే స్వామి అనుగ్రహం  మనకు లభించగలదనే అన్నమయ్య సందేశం  ఈ కీర్తనలో ఉంది.
సంకలనం, వ్యాఖ్యానం..డా॥ తాడేపల్లి పతంజలి.
సేకరణ..పొన్నాడ లక్ష్మి.

No comments:

Post a Comment