Sunday, 10 September 2017

నిన్ను కొలిచితే చాలు నీఅంతవాని చేతువు! - అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.
నిన్ను కొలిచితే చాలు నీఅంతవాని చేతువు!
పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు !!
భూపతి జేరితే కొంత భూమియ్య నోపుగాని
యేపున ఉన్నతపద మియ్యలేడు
తీపుల నింద్రుని నారాధించితే స్వర్గమే కాని
యే పొద్దు చెడని భోగమియ్యలేడు !!
గరళకంఠు కొలిచితే కైలాస మీనోపుగాని
గరిమ ధృవపట్టము గట్టలేడు!
సరి విరించి కొలిచితే సత్యలోకమేగాని
విరజానది దాటగ వెళ్ళవేయలేడు!!
అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను
నిన్ను ఆశ్రయించక కాన్పించనీదు
కన్నులెదుట శ్రీవేంకటేశ నీ శరణంటే,
యెన్నగా నీవిచ్చే యీవి యెవ్వరూ నీలేరు !!
భావం.. స్వామీ! నిన్ను కొలిచితే చాలు నీ అంతటి వాడిని చేస్తావు. నిశ్చయంగా నీవే బ్రహ్మాది దేవతలకు దిక్కు.
ఈ భూమిని పాలించే రాజుల పంచన చేరితే ఏదో కొంత భూమినిస్తారు కానీ ఉన్నతపదమియ్యలేరు. ఇక ఎంతో ప్రీతితో ఇంద్రుడిని ఆరాధిస్తే స్వర్గభోగాలు ఇస్తాడు, కానీ అవన్నీ ఎంతకాలముంటాయి?
ఆ కైలాసనాథుని కొలిస్తే కాస్త కైలాసంలో చోటిస్తాడేమో, కానీ నీవు ధ్రువుడికి పట్టం కట్టినట్లు శాశ్వత పట్టం కట్ట లేడు కదా! ఇక బ్రహ్మదేవుడిని కొలిస్తే సత్యలోకంలో స్థానాన్ని కల్పిస్తాడేమో కాని, వైకుంఠానికి సమీపంలోని విరజానదిని దాటించలేడు కదా! ఆ నదిని దాటితే ఇక మరుజన్మ లేని శాశ్వతస్థానానికి చేరుకుంటాముకదా!
అన్నింటా నీ మాయాశక్తిని ఆశ్రయించి చూచితేను నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు. కన్నులెదురుగా ఉన్న నిన్ను శరణు వేడితే యెన్నగా నీవిచ్చేవి వేరెవ్వరూ ఇవ్వలేరు. స్వామీ నేవే శరణు అని అన్నమయ్య ఈ కీర్తనలో సుస్పష్టం చేస్తున్నాడు.
ఎవ్వరు ఎన్ని ఇచ్చినా, ఆ శ్రీనివాసుడు ఇచ్చే వాటి ముందు సాటిరావు. అలా ఈలోకంలో కానీ, పైలోకంలో కానీ ఎంతటివారైనా పరిమిత వరాలనే ప్రసాదించగలరనీ, ఉన్నత స్థానాలివ్వాలన్నా, చెడని భోగాలివ్వాలన్నా ఆ భక్తవత్సలుడికే చెల్లునని అన్నమయ్య తీర్మానిస్తున్నాడు.
వ్యాఖ్యానం. శ్రీమతి బి. కృష్ణకుమారి. సేకరణ..పొన్నాడ లక్ష్మి.

No comments:

Post a Comment