Tuesday 16 May 2017

రాగరంజితం

రాగరంజితం

తూర్పున బాలభానుడు ఉదయించే వేళ
భూపాలరాగంతో మేలుకొలిపావు.
మోహనరాగాన్ని ఆలపిస్తూ నా మదినిండా
మోహాన్ని రగిలించి పులకరింప చేశావు.
తోడిరాగ గమకాలతో నాకు
తోడునీడగా నిలిచావు
కదనకుతూహలంతో అప్పుడప్పుడు
ప్రేమయుధ్ధాలు చేసావు.
హిందోళ మధుర స్వరాలతొ నాకు
మధురిమలను చవిచూపావు.
వసంత రాగంతో నా జీవితమంతా
వసంతాన్ని నింపావు.
ఆనందభైరవి ఆలాపనతొ నా
అంతరంగాన్ని ఆనందభరితం చేసావు.
వేదనాభరితమైన నా హృదయానికి
శివరంజనితో సేద తీర్చావు.
మలయమారుతంలా నన్ను
చుట్టు ముట్టి ఉక్కిరిబిక్కిరి చేసావు.
రాగమాలికలతో మన సంసారాన్ని
అనురాగరంజితం చేసావు.

- పొన్నాడ లక్ష్మి

No comments:

Post a Comment