Friday, 28 October 2016

అన్నిటికి నొడయఁడ వైన శ్రీపతివి నీవు, - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. అన్నిటికి నొడయఁడ వైన శ్రీపతివి నీవు,
యెన్నరాదు మా బలగ మెంచుకో మాపౌజు
.
౧. జ్ఞానేంద్రియము లైదు శరీరిలోపల
ఆనక కర్మేంద్రియములైదు
తానకపు కామక్రోధాల వర్గములారు
ఈ నెలవు పంచభూతాలెంచు మాపౌజు.
౨. తప్పని గుణాలు మూడు తను వికారములారు
అప్పటి మనోబుధ్యహంకారాలు,
ఉప్పతిల్లు విషయము లుడివోని ఒక అయిదు
ఇప్పటి మించే కోపము యెంచుకో మాపౌజు.
౩. ఆఁకలి దప్పియును మానావమానములును
సోకిన శీతొష్ణాలు సుఖదుఃఖాలు
మూక గమికాడ నేను మొక్కెద శ్రీ వేంకతేశ !
యేకటార గడపేవా నెంచుకో మాపౌజు.
భావం .. దేవా! అన్నీ నీలొనే నిక్షిప్తమై ఉన్న శ్రీపతివి నీవు. సమస్తమునకు అధిపతివి. కానీ మా సైనిక బలగమేమీ తక్కువగా లేదు సుమా! ఇది లెక్కకు మించి యున్నది. మరి మా బలగాన్ని చూచి కాచుకో మరి.
శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అను జ్ఞానేంద్రియము లైదు మాలో నున్నవి. వాక్కు, వాణి, పాదము, పాయువు, ఉపస్థము అను అయిదు కర్మేంద్రియములు శరీరమునకు సంబంధించి యున్నవి. అట్లే మోహరించి నిలిచిన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అను అరిషడ్వర్గములు ఉన్నవి. మరియు పృథివ్యప్తేజో వాయవాకాశములను పంచభూతాలును కలవు. మా సేన ఎట్లున్నదో పరీక్షించుకో..
అట్లే సత్త్వము, రజస్సు, తమస్సు అను గుణములు మూడు; ఉండుట. పుట్టుట, పెరుగుట, పరిణమించుట, క్షీణించుట. నశించుట అను శారీరకమైన వికారములు ఆరు. మనస్సు, బుధ్ధి, అహంకారము అనునవి మూడు, ఎప్పటికప్పుడు ఉత్పత్తి యగు శబ్ధము, స్పర్శము, రూపము, రసము, గంధము అను విషయములైదు మా సేనలో నున్నవి. అన్నిటికి మించిన కోపము కూడా ఉన్నది. ఇంత విశాలమైన దండుని అలక్ష్యము చేయకు.
ఇంతేకాదు, అకలిదప్పులు, మానావమానములు, శరీరమునంటిన శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలైన ద్వందములు కూడా కలవు. కాన నేను సామాన్యుడిని కాను. ఇంత గొప్ప సేనకు అధిపతిని. నా వెనుక ఇంత పెద్ద మూక ఉన్నది. శ్రీ వేంకటేశ్వరా! ఇదిగో నీకు మొక్కుచున్నాను. నాలో ఉన్న ఈ శతృ సైన్యాన్ని ఓడించి ఆపేక్షతొ నన్ను నడిపించు.
సద్గుణముల కంటె దుర్గుణములు ఎప్పుదూ బలమైనవే. ఈ దుర్గుణములను, బలహీనతలు అను శతృ సంహారము చేసి రక్షింపుమని ఆ వేంకటేశ్వరుని అన్నమయ్య ఈ కీర్తనలో వేడుకుంటున్నాడు.


No comments:

Post a Comment