Saturday, 22 March 2014

అన్నమయ్య కీర్తన :

వెనకేదో ముందరేదో – వెర్రి నేను నా
మనసు మరులు దేర – మందేదొకో....!!
చేరి మీదటి జన్మము – సిరులకు నోమే గాని
యే రూపై పుట్టుదునో – యెరుగ నేను.
కోరి నిద్రించ బరచు – కొన నుద్యోగింతు గాని
సారె లేతునో లేవనో – జాడ తెలియ నేను. !!
తెల్లవారి నప్పుడెల్లా – తెలిసితిననే గాని
కల్లయేదో నిజమేదో – కాన నేను.
వల్లజూచి కామినుల – వలపించే గాని
మొల్లమై నా మేను – ముదిసిన దెరగా. !!
పాపాలు సేసి మరచి – బ్రతుకుచున్నాడ గాని
వైపుగ చిత్రగుప్తుడు – వ్రాయుటెరగ ,
యేపున శ్రీవెంకటేశు – నెక్కడో వెతకే గాని
నాపాలి దైవమని – నన్ను గాచుటెరగా !!

భావం :

వెనుక ఏమి జరిగిందో ముందు ఏమి జరుగనున్నదో, ఏమీ ఎరుగని వెర్రివాడను. నా మనస్సు వివిధమైన కోరికలతో పరిభ్రమించుచున్నది. ఈ ఆశల నుండి నాచిత్తము విడుదల నొందుటకు తగిన మందేదోకదా !
రాబోవు జన్మలో సకల సంపదలు కలగాలని ఆశించి ఇప్పుడెన్నో నోములు నోచుచున్నాను. కాని మరుజన్మలో యే రూపు దాల్చనున్నానో ఎరుగను కదా!
బాగుగా నిద్రించవలెనని మెత్తటి పక్కపరచుకొందును. కాని ఆనిద్రనుండి అసలు లేతునో లేవనో తెలియదు గదా!
ప్రతిదినము తెల్లవారి నిద్రలేచి ప్రపంచమునంతటిని చూచుకొని నాకంతయు తెలియు ననుకొను చుందును. కాని నిద్రలేచాక సుషుప్తిలో శూన్యమైన స్థితియే నిజమో, లేక మేల్కాన్చినప్పుడు శాశ్వతమైన స్థితియే నిజమో తెలియని పిచ్చివాడను కదా! అవకాశము, అదను చూసుకొని కాముకురాండ్రు నాపై వలపుగొనునట్లు చేయుచున్నాను. కాని నా శరీరము మిక్కిలిగా ముదిసియుండుట గుర్తింపజాలకుంటిని కదా !
నిత్యము పాపాలు చేసి మరచి బతుకుచున్నాను కాని, ఈ పాపాలన్నింటిని చిత్రగుప్తుడు లెక్క తప్పకుండా వ్రాయుచున్నాడని తెలియజాలను కదా! శ్రీవేంకటేశ్వరుడు ఎక్కడో ఉన్నాడని మూర్ఖుడనై వెదకుచున్నాను. ఆయన నాపాలి దైవమని, సదా నన్నంటి పెట్టుకొని కాపాడుచున్నాడని ఎరుగనైతిని కదా!
నా మాట :

జీవితము క్షణభంగురము. భూతభవిష్యత్తులను ఎరగము. అయినా పిచ్చి ఆశలతో, వ్యామోహలతో కొట్టుమిట్టాడుతున్నాము. అని అన్నమయ్య ఈ కీర్తనలో చక్కగా వివరించారు.

No comments:

Post a Comment