Sunday, 27 September 2020

బాలు - కవిత



 


మా మరిది గారు చి.
Umamaheswar Rao Ponnada
అమర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పై రాసిన కవిత యధాతధంగా :
బాలు
---------
అయిదున్నర దశాబ్దాలు అలరించిన
ఓ గొంతు మూగబోయింది!
అఖండంగా కురుస్తున్న ఓ అమృతధార
హఠాత్తుగా ఆగిపోయింది!
వెన్నెల కరిగి సన్నగా అతని
గొంతులోంచి జారినట్లు ఉండేది.
సన్నజాజి అతని పెదవుల మీదనే
విరిసి పాటతో పరిమళించినట్లుండేది.
ఎవరైనా అనుకున్నామా?
నిశ్శబ్దంగా మొలిచిన ఓ లేత స్వరం
తేనెల జల్లులు కురిపిస్తుందని,
కోట్లాది మనసులని మురిపిస్తుందని,
భాషా హద్దులని చెరిపేస్తుందని!
ఎవరైనా ఊహించామా!
పాట అతని గొంతులో మరో గుండెగా వెలుస్తుందని,
పాటే అతనికి ఊపిరిగా నిలుస్తుందని!
మన ప్రతి ఉదయం అతని పాటతో పలకరిస్తుందని,
ప్రతి తెలుగు గుండె అతని పాటతో పులకరిస్తుందని!
ఏమైందో, ఏమో?
పై నుంచి ఎవరైనా చేతులు చాచి పిలిచారో?
ఈ బాలు ఇక మీకు చాలు అని తలచాడో?
హడావుడిగా తన పాటల మూటల్ని
భుజాన వేసుకొని మరొక కొత్త వేదికను
వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు!
ఇకపై
అక్కడ గంధర్వలోకంలో రోజూ
అతని గానకచేరీ కొనసాగుతూనే ఉంటుంది!
ఇక్కడ గాలి ఉన్నంత వరకు మనకోసం
అతని పాటను మోసుకొస్తూనే ఉంటుంది!
.........
రాతలు పొన్నాడ ఉమామహేశ్వర రావు
గీతలు: శ్రీ పొన్నాడ వెంకటరమణమూర్తి

Saturday, 29 August 2020

తెలుగు బిడ్డ - కవిత

 తెలుగుదేశమందు పుట్టి తెలుగుబిడ్డనని చెప్పి

తెలుగును విస్మరించెదవేల తెలుగుబిడ్డా!
మధురమైన తెలుగుభాష దొరలు మెచ్చ్చిన భాష
పొట్టకూటికై ఆంగ్లభాష నేర్చి అమ్మభాషను మరచెదవేల తెలుగుబిడ్డా!
హరికథలు చెప్పి పామరులను సైతం రంజింపచేసిన భాష
బుర్రకథలతో వీరుల చరిత్రలతో   వినోదాన్ని అందరికీ పంచిన భాష
అవధాన ప్రక్రియతో ఔరా! అనిపించినా అమృత భాష
పండిత ప్రవచనాలతో విజ్ఞానం పంచిన భాష నీకు చేదయిందా తెలుగు బిడ్డా!
తెలుగు భాషకు మాత్రమే సొంతమయిన ఛందస్సు, గణవిభజన గల పద్యాల సొగసు
తేటతెలుగు భాష గొప్పదనం నీకేల  కానరాదు తెలుగు బిడ్డా!
ఆనాటి కవుల సాహీతీ సంపదని, అన్నమయ్య పదకవితల్లోని భావజాలాన్నీ
వాగ్గేయకారకుల కీర్తనల్లోని మధురిమనీ నీవేల ఆస్వాదించలేకపోతున్నావు తెలుగుబిడ్డా!
స్వచ్ఛమైన తెలుగుభాషలో ఆంగ్లపదాలు మేళవించి,
అమృతతుల్యమైన తెలుగుభాషని ఎంగిలిభాష చేయకు తెలుగుబిడ్డా!
అవసరార్ధం పరభాషను నేర్చినా అమ్మ భాషకు తెగులు పట్టించకు తెలుగు బిడ్డా!

(2018, ఆగస్టు నెలలొ 'తెలుగు తల్లి కెనడా' లో ప్రచిరితమై బహుమతి పొందిన నా కవిత)

Saturday, 15 August 2020

సంసారమే మేలు సకల జనులకు... అన్నమయ్య కీర్తన.

 ఈ వారం అన్నమయ్య కీర్తన.

సంసారమే మేలు సకల జనులకు
కంసాంతకుని భక్తి కలిగితే మేలు.

వినయవు మాటల విద్య సాధించితే మేలు
తనిసి యప్పులలోన దాగకుంటే మేలు,
మునుపనే భూమి దన్ను మోచి దించకుంటే మేలు
వెనుకొన్న కోపము విడిచితే మేలు. !!

కోరి నొకరి నడిగి కొంచపడకుంటే మేలు
సారె సారె జీవులను చంపకుంటే మేలు,
భారపుటిడుమలను పడకుండితే చాలు
కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు !!

పరకాంతల భంగపరచకుంటే మేలు
దొరకొని కెళవులు దొక్కకుంటే మేలు
అరుదైన శ్రీ వేంకటాద్రి విభుని గొల్చి
యిరవై నిశ్చింతుడైతే నిన్నిటాను మేలు.

భావం… సకల జనులకూ సంసారము మేలే.. సంసారం ఈదుతున్నా భవబంధాలన్నిటిని మోస్తున్నా కంసాంతుకుడైన ఆ హరిని స్మరించడమే మేలు.

వినయంతో కూడిన విద్యను సాధిస్తే మేలు. ఆడంబరాలకు పోయి అప్పుల పాలవకుండా ఉంటే మేలు. లోభం వల్ల అక్రమాలూ, అప్పులూ చేసి భూమికి భారం కాకుండా ఉంటే మేలు. వెన్నంటి ఉన్న కోపాన్ని విడిచితే మేలు.

కోరి ఎవరినీ ఏమీ యాచించి అవమాన పడకుండా ఉంటే మేలు. జీవులను హింసించకుండా ఇతరులను కష్టపెట్టి అనేక కష్టాలను తెచ్చుకోకుండా ఉంటే మేలు. మన చేత బాధింపబడ్డ వారిచే నిందింపబడకుండుటే మేలు.

పరకాంతల నాశించి భంగపడకుండుటే మేలు. దొరకొని ముళ్ళదారులను తొక్కకుంటే మేలు. శ్రీ వేంకటేశ్వరుని నిష్టతో కొలిచి నిశ్చింతుడైతే అన్ని విధాలా మేలు.

గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించడంలో తప్పు లేదు కానీ, పరమాత్మునిపై మనస్సు నిలిపి నిష్కామ బుధ్ధితో నీ భాధ్యతలను నిర్వర్తించు అని ఈ కీర్తనలో అన్నమయ్య మనకి వ్యక్తీకరించాడు.

భావోద్వేగం.

 ఒక ఆత్మీయురాలి ఆర్తికి నా భావొద్వేగం..

ఆత్మీయతానురాగాలు అంగడిలో సరుకులు కావు
మూల్యం చెల్లించి సొంతం చేసుకోవడానికి,
ఆదరాభిమానాలు తాతముత్తాతల ఆస్తులు కావు
అధికారంతో కబళించి అనుభవించి తృప్తి చెందడానికి,
హృదయాంతరాళలో నుంచి పొంగి పొరలేదే నిజమైన అనురాగం,
అవరోధాలు లేని ప్రేమ విశ్వమంతా వ్యాపించి
తర తమ భేధం లేక అందరికీ పంచబడుతుంది.
ఈ సత్యం తెలుసుకోలేక ఈర్ష్యా అసూయలతో కలసి
అగ్నిగుండంలా మారిన మానసం.
ఒక్కరికే సొంతమవ్వాలనే సంకుచిత భావం.
అంతర్మథనంలో అంతరాత్మ ఘోషిస్తూంది.
అధీనంలో లేని మనసు అపరాధమని తెలిసీ
అంగీకరించడానికి మొరాయిస్తోంది.
సుగుణాలతో బాటు బలహీనతలని కూడా స్వీకరించి
చేరదియ్యాలని ఆత్యాశ!
అత్యాశతో కొట్టుమిట్టాడే మనసుకు
మిగిలేవి కన్నీళ్ళు, కలతలే!

ఒక చిన్న భావ వీచిక.

 ఒక చిన్న భావవీచిక.

అద్దాలమేడలు అందమైన కారులు లేవని చింతించా నొకనాడు.
ప్రశాంతమైన చిన్న పొదరిల్లే అంతులేని ఆనందాన్ని ఇస్తోంది ఈ నాడు.
కాలు కింద పెట్టనివ్వక, పువ్వులతో పూజించే భర్త కావాలని
ఊహలలో తేలిపోయానొకనాడు.
మానవత్వంతో అనురాగం పంచుతూ ఆప్యాయంగా చూసుకొనే భాగస్వామి లభించినందుకు సంతృప్తి పొందుతున్నా నీనాడు.
నానాలంకారభూషితనై నలుగురిలో మెప్పు పొందాలని అనుకున్ననొకనాడు
కాసంత బొట్టుతో, నల్లపూసల సౌభాగ్యంతో అత్యంత గౌరవం
పొందుతున్నానీనాడు.
ఉన్నతవిద్యలనభ్యసించి అందరిలా ఖండాంతరాలకు పిల్లలు పోలేదని
నిరాశ చెందానొకనాడు.
చెంతనే ఉండి అనవరతం నా బాగోగులు విచారిస్తూ బాధ్యతగా మసులుకొనే
సంతతిని చూసి గర్విస్తున్నాను ఈనాడు.

Monday, 27 July 2020

అన్నమయ్య కీర్తనలలో స్త్రీ పురుష సమానత్వం.


అన్నమయ్య కీర్తనలలో స్త్రీ పురుష సమానత్వం.
పురుషాధిక్య సమాజంలో సాధారణంగా లోకులు పురుషునిలో ఎన్ని లోపాలున్నా పట్టించుకోరు. నీతిబోధలు చెయ్యరు. ఏ దోషాలు లేకపోయినా స్త్రీలకి అందరూ నీతులు చెప్పేవారే. సద్దుకుపోవాలని, సహించాలని ఉచిత సలహాలు ఇస్తుంటారు. కానీ న్యాయవేత్త, సత్యవాది, మానవతావాది అయిన అన్నమయ్య 15వ శతాబ్ధం లోనే స్త్రీకి పురుషునితో పాటు సమానత్వం, స్వేచ్చాస్వాతంత్ర్యాలు కాంక్షించాడు. ఉదాహరణ
పొలుతులు జీవులే  పురుషులు జీవులే  -  తలప భావభేదమే కాని,
బలిమి స్వతంత్రము  పరతంతంత్ర మొకరికి  -  ఎలిమి చెల్లే నిందులో హినాధికములే..
అనే కీర్తనలో స్రీలు కూడా జీవులేనని, పురుషులకు స్వాతంత్ర్యమిచ్చి, స్త్రీలను పరతంత్రులుగా చేయడం హీనాతిహీనమని, స్త్రీలకూ వ్యక్తిత్వం, అభిరుచులు ఉంటాయని ఎలుగెత్తి చాటాడు. అన్నమయ్య వనితాభ్యుదయాభిలాషి. వనితలకూ విద్య, వేదాధ్యయనం అవసరమని, జ్ఞానదేవతలయిన గాయిత్రి, సరస్వతి స్త్రీమూర్తులేనని నొక్కి వక్కాణించాడు. అతని భార్య తాళ్ళపాక  తిమ్మక్క తొలి తెలుగు కవయిత్రి. ఆ విదుషీమణి  చేసిన ఈ కావ్యరచనలో అన్నమయ్య సహకార ప్రోత్సాహాలు ఎంతున్నాయో మనకి అర్ధమౌతుంది.
అభిమానవతి అయిన ఏ స్త్రీ అయినా తన భర్త పరస్త్రీ సాంగత్యం చేస్తే ఓర్చుకోలేదు. అతనిలోని అవగుణాలని నిలదీసి ఖండిస్తుంది. ఈ అంశాన్ని  అన్నమయ్య అనేక కీర్తనలలో వ్యక్తపరిచాడు. ఒక నాయిక తన నాయకునకు ఎన్నోసార్లు నీతి బోధించి  ఫలితం లేకపోయేసరికి విసుగు చెంది జాజిపువ్వు జాజిపువ్వే అవుతుంది కానె దిరిశన పువ్వు అవుతుందా? నీ తత్వాని నీవు ఎంతైనా మానుతావా? కొంతమందికి అనురాగాలు, కొంతమందికి ద్వేషాలు చూపుతున్నావు. పొగడపుష్పాలని ఎంత ఇష్టంగా వాసన చూసినా అందులోని వాసనే ఉంటుంది కానీ దాని మదం పోతుందా? ఆ విధంగానే మితిమీరిన నీ చేష్టలు నీలాంటివారికి గాక తిరిగి నీ బుడ్ఢులు మంచివి అవుతాయా? ధీరుడవైన  శ్రీ  వేంకటేశా! వీడనిబంధాల వసంతంలో మా కోరికల ఆశ మానుతుందా! అని కొన్ని సామెతల ద్వారా అతనికి నీతి గరపడం తన ప్రేమను వ్యక్తం చెయ్యడం కనిపిస్తుంది.
అన్నమయ్య శృంగార కీర్తనలలో నాయికా నాయకుల విరహం, అలుక మొదలైనవి వర్ణించబడిన చివరలో వారి సమైక్యత గోచరిస్తుంది. అందులో వివాహబంధం పటిష్టత, దాంపత్య జీవితంలో సద్దుబాటు కనిపిస్తాయి. దీనివలన జీవాత్మ పరమాత్మతో కలసి ఉన్నప్పుడే చిత్తశాంతి కలుగుతుందని అన్నమయ్య అంతర్గత భావన.
తన ఇష్టసఖునిపై అనేక కారణాలవల్ల కోపోద్రిక్త అయిన ఒక అభిమానవతి విజృంభించి అతనితో ‘నీ పొందు నాకు వద్దు పోరా!” ఓరి నీ పంతాలన్నీ వెలికి తీస్తాను, ఓరి బెదిరింపు చూపులతో వైరాన్ని దాటవద్దురా!, ఓరి ఎంతైనా ఇంక నిన్ను పోనివ్వను, ఇతరుల సంబంధాలు తలచవద్దురా!” ఇటువంటి ప్రయోగాలు అన్నమయ్య కీర్తనల్లో గమనిస్తే దారితప్పిన పురుషుని  నిలదీసి అడగడానికి, నీతిబోధ చెయ్యడానికి అన్నమయ్య స్త్రీకి ఒసగిన అధికారం, చనువు, స్వాతంత్ర్యం వ్యక్తమవుతున్నాయి. అంత పాతకాలంలో, స్త్రీని బానిసగా చూసే రోజుల్లో అన్నమయ్య స్త్రీల పట్ల చూపిన ఔదార్యం, విశాల భావం, సంస్కారం అన్నీ కనిపిస్తాయి.
కొన్ని కీర్తనల్లో అన్నమయ్య తానె చెలికత్తె రూపం ధరించి, నాయిక చేసిన ఆక్షేపణలకు అలిగిన నాయకునికి సద్బుద్ధులు చెప్పి, ఆనక స్వామిని పొగిడి, నాయికపై అనురక్తి కలిగించడం గోచరిస్తుంది. “నీ పై విరహంతో ఆమె నిద్రపోదు, భుజించదు అన్నిటా నీకు అనువైన సఖిపై నీకు అలుకెందుకయ్యా. ఇప్పుడే వెళ్ళి ఆమెని ఆదరించకపోతే నీ పాదాలపై ఒట్టు. ఆపైన నీచిత్తం ఆమె భాగ్యం” అంటూ అధికారంతో మందలించిన వైనం కనిపిస్తుంది. స్వల్పకారణాలకే ఆమెపై కోపించి అలిగి ఉన్న స్వామికి ధర్మబోధ చేస్తుంది.
నేటి ఆధునిక కాలంలో సంఘసంస్కర్తలు గావించిన సాంఘిక విప్లవాలవల్ల , పరిణితి చెందిన స్త్రీల మనోభావాల వల్ల స్త్రీలు పురుషులతో సమానంగా చదువుకొని, అన్ని రంగాలలోనూ ఉద్యోగాలు చేస్తూ అభ్యుదయాన్ని  సాధిస్తున్నారు. ఈ చైతన్యం అందరు స్త్రీలలోనూ రావలసి ఉంది. నేటికీ తమకు జరుగుతున్న అన్యాయాన్ని, నయవంచనలని మనసు విప్పి చెప్పుకోలేని వనితలెందరో ఉన్నారు. ‘స్త్రీకి ఇంటా బయటా అధికారం మాట అలా ఉంచి, తన మీద తన శరీరం మీద, తన జీవితం మీద, తన మనసు మీద  ముందుగా సంపూర్ణ అధికారం రావాలి’ అని ఎవరో రచయిత చెప్పినట్లు అన్నమయ్య కీర్తనల్లో ఇటువంటి దృక్పధం కూడా కనిపిస్తుంది.
అన్నమయ్య శృంగార కీర్తనలలో ఈనాటి ఆధునిక స్త్రీకి లోకం మెచ్చే చైతన్యం, తెలివితేటలు, ప్రత్యేక వ్యక్తిత్వం ఆనాడే స్త్రీ పాత్రలకు అన్వయించడం, పురుషునికి ధర్మ ప్రబోధం చేయించడం గమనిస్తే, ఈనాటి పరిస్థితులను అన్నమయ్య ఆనాడే ఊహించిన కాలజ్ఞానిగా తోస్తుంది. అన్నమయ్య సంకీర్తనలను మనసు పెట్టి చదివితే స్త్రీవాదులే కాక మానవతావాదులందరూ కూడా ఆశ్చర్యానందాలు పొంది అన్నమయ్యకు చెయ్యెత్తి జే కొట్టకుండా ఉండలేరు. శిరస్సువంచి నమస్కరించకుండా ఉండలేరు.
--- పొన్నాడ లక్ష్మి

Sunday, 5 July 2020

తానే తానే ఇందరి గురుడు - అన్నమయ్య కీర్తన



ఈ వారం అన్నమయ్య కీర్తన (గురుపూర్ణిమ సందర్భంగా ఈ కీర్తన)

వ్యాఖ్యానం శ్రీ మేడసాని మోహన్ గారి సౌజన్యంతో :

గురు శిష్య సంబంధం:

భారతదేశంలో అనాదిగా వేద వాఙ్మయం, ఉపనిషత్తులు, వివిధ సంప్రదాయాలకు చెందిన ఆగమ శాస్త్రాలు ‘ముఖే ముఖే సరస్వతి’ సంప్రదాయంలోనే అధ్యయనం చేయబడుతున్నాయి. గురువుగారు వల్లె వేస్తూ ఉండగా శిష్యులు యథాతథంగా ఉచ్ఛరిస్తూ, ధారణ చేస్తూ సమస్త విద్యలను అభ్యసించేవారు. అంటే గురు శిష్యుల మధ్య పవిత్రమైన అనుబంధం, సత్సంబంధాలు భారతీయ సంతతికి పునాదులు. ఈ పరమ సత్యాన్ని గుర్తించిన అన్నమయ్య దేవదేవుడైన శ్రీనివాసుడే సమస్త జీవులకు గురుదేవుడని, ఆ స్వామికి గురుస్థానాన్ని ఆపాదిస్తూ ఈ క్రింది సంకీర్తన రచించినాడు.

"తానె తానె ఇందరి గురుడు
సాన బట్టిన భోగి జ్ఞాన యోగి

అపరిమితములైన యజ్ఞాలు వడిజేయు
ప్రసన్నులకు బుద్ధి పరగించి
తపముగా ఫలపరిత్యాగము గావించు
కపురుల గరిమల కర్మయోగి || తానె ||

అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి జేయ
మన్నించు బుద్ధులకు మరుగజెప్పి
ఉన్నత పదముల కానరగ కరుణించు
పన్నగ శయనుడే బ్రహ్మయోగి || తానె||

తనరగ కపిలుడై దత్తాత్రేయుడై
ఘనమైన మహిమ శ్రీ వేంకట రాయుడై
ఒనరగ సంసార యోగము కృపసేయు
అనిమిషగతులకు అభ్యాసయోగి || తానె||"

సారాంశం :
దేవదేవుడైన శ్రీ వేంకటేశుడే ఈ సమస్త సృష్టిలోని జీవరాశులకు గురుడు. జీవులందరూ అనుసరింపవలసిన జ్ఞానయోగాన్ని ప్రసాదించే గురుదేవుడే ఆ స్వామి. పూర్వావతారాలలో కపిలాచార్యుడిగా, దత్తాత్రేయుడుగా జీవులకు జ్ఞానప్రబోధం చేసిన భగవంతుడే ఈ వేంకటరాయుడు. సమస్త యోగబలానికి అవసరమైన సాధనా సామాగ్రిని సమకూర్చే అభ్యాస యోగాన్ని అనుగ్రహించి జీవులను దైవీ సంసారం వైపు పయనింపచేసే యోగీశ్వరేశ్వరుడే ఈ వేంకటేశ్వరుడు.