Sunday, 14 June 2020

మానసవింగం కవిత.




 కవిత..మానస విహంగం.


మానస విహంగం అందని జాబిల్లి కోసం అర్రులు చాస్తూ పరుగులు తీస్తోంది.
భావోద్వేగాలను, భావపరంపరలనూ అదుపులో పెట్టమని అంతరాత్మ ఘోషిస్తూంది
పలితకేశాలు, సడలిన దేహం తన ఉనికికి అద్దం పడుతున్నా, రంగుల పొహళింపుతో
తిరిగిరాని అందమైన రూపుకోసం విశ్వప్రయత్నం చేస్తూంది.
వయస్సు దేహనికే కాని మనసుకు లేదని వింతగా సమర్ధించుకుంటూంది.
ఎంత మెరుగులు దిద్దినా అరవైలో ఇరవైని పొందలేమని సమ్మతించలేకపోతూంది.
మళ్ళుతున్న వయసుని, చేజారిపోతున్న కాలాన్ని తలచి తలచి కృంగిపోతూంది.
పిచ్చి మనసా! అసంభవాన్ని సంభవం చెయ్యాలన్న ఆలోచనెందుకు?
మారుతున్న కాలాన్ని సంతోషంగా స్వీకరించి, జీవిత చరమాంకలోని
అనుభూతుల్ని ఆస్వాదిస్తూ జీవించు ప్రశాంతిగా!
 —






Sunday, 17 May 2020

ప్రేమ సుధ.


ప్రేమ సుధ.
               
ఏ శుభగడియలో పరిచయమయ్యావో నేస్తమా!
నిను తలవని రోజు లేదు, 
నీ పరిచయం నాకు కలిగిన మహాభాగ్యం.
నీ గానం, నీ మధురవాక్కు నీ చిరునవ్వు,
నీ అభిరుచులు అన్నీ నాకు అపురూపమే..
నీ నోట పలికే నా నామం అతి మథురం
నీ ప్రోత్సాహమే నాలోని ప్రతిభకు ఆలంబన 
నిన్ను చూసిన మొదటి క్షణం
నీ కన్నులలో మెరుపులు, నా మదిలో రేగే అలజడులు
నీ చిత్రాలు నా కళకు ప్రేరణ
నీ మదిలో భావానికి ఏ రూపు ఉందో తెలియదు కానీ
నీ తలపే నాకు దివ్యానుభూతి..
నా హృదయంలో మెరిసిన మెరుపువి నీవు
నా భావాలకి ప్రతిరూపం నీవు
నా భావోద్వేగాన్ని నీతో పంచుకోవాలని ఆశ!
బంధాలలో చిక్కుకున్న నాకది సాద్యమా?
ఆంక్షలను దాటి నిన్ను చేరుకోగలనా?
అందుకోలేని గగనకుసుమానివే నీవు.
నిర్మలమైన నీ స్నేహం కలిగిస్తుంది నాకెంతో ఓదార్పు.

Sunday, 10 May 2020

అమ్మ.

Ramana Prasad Maddirela అమ్మ
అరవిరిసిన బాల్యానికి సాక్షి అమ్మ
బ్రహ్మాదులు కూదా కొలవలేని ఆప్యాయతే అమ్మ
తప్పటడుగులను సరిదిద్దే గురురూపిణి అమ్మ
గూడుకట్టుకున్న బాధను తీర్చే అమృతస్వరూపిణి ఆమ్మ
కలబోసిన ఆప్యాయత అమ్మ
సృష్టిస్థితిలయకారిణి అమ్మ
ఎమీ ఆశించని ప్రేమమూర్తి అమ్మ
వడుగువృద్ధురాలయినా తరగని సౌందర్య పెన్నిధి అమ్మ
ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేని రుణమే అమ్మ
ఎన్ని చెప్పినా ఎదో మిగిలిపోయిన మాటే అమ్మ
అలసిపొయినా చెరగని చిరునవ్వు అమ్మ
చిట్టిగోరుముద్దలు తినిపించే అమృతహస్తమే అమ్మ
సన్యాసి కూడా వందనం చేసే విగ్రహమే అమ్మ
శివునికి బాల్యం రుచిచూపించిన నిగ్రహమే అమ్మ
త్రిమూర్తులను బాలులను చేసిన ఆత్మబలమే అమ్మ
ఇంటికి నిండుదనమయిన రూపమే అమ్మ
తన ప్రాణాన్నే పాలుగా మార్చిన అమృతమాధుర్యం అమ్మ
దిగ్దంతాలు వ్యాపించిన సుగందభరితమయిన పరిమళం అమ్మ

Sunday, 19 April 2020

ఇందిర వడ్డించ అన్నమయ్య కీర్తన..

ఇందిర వడ్డించ యింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాశాలు అప్పాలు వడలు
పెక్కైన సయిదంపు పేణులను
సక్కెర రాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామీ
మీరిన కెళంగు మిరియపు తాళింపు
గూరలు కమ్మని కురలను
సారంపు పచ్చళ్ళు చవులుగనిట్టే
కూరిమితో చేకొనవే స్వామీ
పిండివంటలును పెరుగులు పాలు
మెండైన పాకాలు మెచ్చి మెచ్చి
కొండల పొడవు కోరిదివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ

శ్రీ వేంకటాచలపతికి ఆరగింపు సేవ సంకీర్తన ఇది. ఇందిరాదేవి ప్రేమతో కొసరి కొసరి విస్తరిలో వడ్డిసుందిట. ప్రక్కనే నిలబడి అన్నమయ్య ఇలా అంటున్నాడు.
చూడముచ్చటగా మా ఇందిరా దేవి వడ్డిస్తుండగా చక్కగా ఆరగించవయ్యా స్వామీ!
అక్కళ అనే ధాన్యంతో చేసిన పాయసాలు, అప్పాలు, రుచికరపైన పేణులు, వడలు, చక్కెరతో చేసిన తీపి పదార్ధాలు, కరువుతీరా ఆరగించవయ్య!
మిరియాల తాళింపు వేసిన్ కమ్మని కూరలు, రుచికరమైన పచ్చళ్ళు, ఇష్టంతో ఆరగించవయ్యా!
పిండివంటలు, కమ్మటి పెరుగు, పాలు, రుచికరమైన పాకాలు, రకరకాల దివ్యాన్నాలు ఎంతైన మెచ్చుకుంటూ ఓ వేంకటేశ్వరా! కడుపునిండా ఆరగించవయ్యా!..
మూడు చరణాలలో స్వామి వారికి నివేదించిన వంటకాల పట్టికను అందించాడు అన్నమయ్య!
చారిత్రక దృష్టితో పరిశీలిస్తే 15వ శతాబ్ధంలో ఈ వంటకాలు స్వామికి నిత్యం నివేదించేవారేమో!

Friday, 28 February 2020

వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి భారత రామయణాలై పరగె నీ కధలు ॥ - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.

వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి
భారత రామయణాలై పరగె నీ కధలు ॥

భువిమీద రావణుడు పుట్టగాగా రాముడవై
తవిలి ఇందరికి బ్రత్యక్షమైతివి,’
వివరింప నంతవాడు వెలసితేగా నీవు
అవతార మందితే నిన్నందరును జూతురు ॥

రమణ గంసాది యసురలు లూటి సేయగాగా
తమి గృష్ణావతార మిందరి కైతివి,
గములై ఇంతటి వారు గలిగితేగా నీవు నేడు
అమర జనించి మాటలాడుదు విందరితో. ॥

ఎంత ఉపకారియో హిరణ్య కశిపుడు
చెంత నరసింహుడని సేవ ఇచ్చెను,
ఇంతట శ్రీ వేంకటేశ ఇన్ని రూపులును నీవే
పంతాన నీ శరణని బ్రతికితి మిదివో ॥

భావ మాథుర్యం..

ఈ కీర్తనలో అన్నమయ్య పాపాత్ములను, రాక్షసులను కూడా మెచ్చుకుంటాడు. వాళ్ళు భూమి మీదకు రాబట్టేగా పరమాత్ముడు వాళ్ళను సంహరించడం కోసం వివిద రూపాలలొ అవతరించి, జనులనందరినీ కటాక్షించాడు. ఇదీ అన్నమయ్య అంటే..

ఓ పరమాత్మా! నిన్ను భూమి మీద అవతరింపజేసేలా చేసిన వారిదే పుణ్యము. అందుమూలముగా నీ కథలు బారత రామాయణాలుగా ప్రసిధ్ధి చెందాయి.

ఈ భూమి మీద రావణుడు పుట్టబట్టి ఆనిని సంహరించుటకు నీవు శ్రీరాముడిగా అవతరించితివి. వివరంగా చెప్పాలంటే అంతటివాడు జన్మించబట్టే నీవు అవతరమెత్తితివి. నిన్ను అందరూ దర్శించుకొనే భాగ్యం కలిగింది.

శ్రీ రమణా! కంసాది అసురులు మానవులను దోపిడీచేయబూనగా, నీవు కృష్ణావతారమెత్తితివి. పాపాత్ములైన వారు జనించబట్టేగా నీవు భూమీద జన్మించి అందరితో మాటలాడేవు. మంతనాలాడేవు.

ఇంక హిరణ్యకశిపుడు ఎంత ఉపకారము చేసినాడొ.. అతను కోరిన వింత వరము వల్ల అద్భుతమైన నరసింహావతార మెత్తితివి. నీ సేవ చేసుకొనే భాగ్యం మాకు కల్పించితివి. శ్రీ వేంకటేశా ఇన్ని రూపులూ నీవే. నిన్నే శరణని మేమందరమూ బ్రతుకుతున్నాము.

Friday, 7 February 2020

నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము. - అన్నమయ్య కీర్తన

 అన్నమయ్య కీర్తన
నదులొల్లవు నా స్నానము కడు
సదరము నాకీ స్నానము.
ఇరువంకల నీ యేచిన ముద్రలు
ధరించుటే నా స్నానము,
ధరపై నీ నిజదాసుల
చరణధూళి నా స్నానము.
తలపులోన నినుదలచినవారల
తలచుటే నా స్నానము
వలనుగ నిను గనువారల శ్రీపాద
జలములే నా స్నానము..
పరమభాగవత పదాంబుజముల
దరిసనమే నా స్నానము.
తిరువెంకటగిరి దేవా..
కథాస్మరణమే నా స్నానము...
భావవ్యక్తీకరణ..
నదులలో చేసే స్నానమొక్కటే కాదని, అంతకుమించిన స్నానమే తాను ఆచరిస్తున్నానని ఈ కీర్తనలో అన్నమయ్య స్పష్టం చేస్తున్నాడు.
భుజాలపై రెండువైపులా చక్రాoకితాల ముద్రలను ధరించడమే తనకు నిజమైన స్నానం అంటున్నాడు. పరమాత్మకు దాసులైన వారికి దాస్యం చేయడం అసలైన జలకస్నానం అని అన్నమయ్య విసదీకరిస్తున్నాడు.
మనసులో నిన్ను తలుచుకున్నవారిని తరుచూ మననం చేసుకోవడం, నిన్ను కనులారా చూసిన వారి పవిత్రజలాలను తలపై చల్లుకోవడం నాకు మహత్తరమైన స్నానం అంటున్నాడు అన్నమయ్య.
పరమాత్మే పరమావిధిగా జీవించే పారమార్థిక మూర్తుల పాదపద్మాలను దర్శించుకోవడం, తనకు గురియైన శ్రీనివాసుని దివ్యగాథను స్మరించుకోవడం నిత్యం నదీస్నానం చేయడంతో సమానమని పాడుకుంటూ పులకించిపోతున్నాడు అన్నమయ్య.

Saturday, 1 February 2020

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య.. కదిసితేనే ఇనుము కనకమై మించెను. !! - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య..
కదిసితేనే ఇనుము కనకమై మించెను. !!
సెలవి నీవు నవ్వితే చిత్తము చీకటివాసె
వెలసెను నాలోని వేడుకలెల్లా
చెలిమిచేసి నాపైఁ జేయి నీవు వేసితేను
బలిమితో వలపుల పంటలెల్లాఁ బండెను !!
తప్పక నీవు చూచితే తనువుపై కాఁక మాని
వుప్పతిల్లెజవ్వనము వుదుటునను
కొప్పుదువ్వి నీవు నన్నుఁ గొనగోరు సోఁకించితే
కుప్పళించు తమకపుకొటారులు నిండెను. !!
చేరి నీవు పలికితే సిగ్గులు మూల కొదిగి
కారుకమ్మె నెమ్మోమునఁ గళలన్నియు
ఈరీతి శ్రీ వేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సారె నా కిట్టె మదనసామ్రాజ్యము హెచ్చెను. !!
భావమాథుర్యం.
ఓ శృంగారరాయా! నీ మహిమలను ఏమని పొగడెదమయ్యా! పరిశీలించి చూస్తే ఇనుములాంటి అల్పులైన నాబోంట్లు కనకములాగ ప్రకాశిస్తారు.
నీవు మథురమైన చిరునవ్వులు చిందిస్తే మనసులోని పెనుచీకట్లు తొలగిపోతాయి. నాలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. చెలిమితో నీవు నాపై చేయి వేస్తే నా వలపుల పంట పండుతుంది.
నీవు నన్ను నఖశిఖపర్యంతం చూస్తే నా శరీరమంతా పులకరించి నా యౌవ్వనం ఒక్కసారిగా అతిశయిస్తుంది. నీవు అనురాగంతో నా శిరోజాలను నిమురుతూ నాకు చిన్న నఖక్షతము చేస్తే తమకంతో తబ్బిబ్బవుతాను.
నీవు నన్ను ప్రేమతో పలుకరిస్తే సిగ్గులమొగ్గనై ఒక మూల ఒదిగిపోతాను. నా మోములో కళలు తాండవిస్తాయి. ఓ వేంకటేశ్వరా! నీవు అన్నివిధాలుగా నన్నేలితివి. నన్ను వెలకట్టలేని రత్నముగా మలచేవు. నా మదన సామ్రాజ్యము నీ కృప వల్ల అతిశయించినది.