సంకీర్తనాచార్యులు అన్నమయ్య
ఫాల్గుణ బహుళ ద్వాదశి - శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి
కారణజన్ముడైన అన్నమయ్య బాలప్రాయంలోనే తిరుమలేశుని మీద వచ్చీ రాని పదాలు
పాడుకుంటూ తిరుపతి కొండ ఎక్కుతూ మూర్ఛ పోయాడు .అప్పుడు అలమేలుమంగమ్మ ఆ
బాలుణ్ణి సేదతీర్చి స్వామివారి ప్రసాదం పరమానాన్ని ప్రేమతో తినిపించింది
అమ్మచేతి ప్రసాదాన్ని గోరుముద్దలుగా తిన్న మహత్మ్యంతో ఆ బాలుడు
అప్పటికప్పుడు అశువుగా ‘వేంకటేశ్వరా’ అన్న మకుటంతో అమ్మపై ఒక శతకాన్ని
చెప్పాడు. ఇది అన్నమయ్య మొదటి రచనని చెప్పవచ్చు. ఆ తల్లి కృప వల్లనే
అన్నమయ్య “ఆడిన మాటలెల్లా అమృత కావ్యమై పాడిన పాటెల్ల పరమ పావనమై”
అలరారింది.
శృంగార భావాలతో కొన్ని, యోగమార్గంలో కొన్ని, భక్తి, వైరాగ్య వాసనలతో కొన్ని
పరమమంత్రములుగా 32,000 కీర్తనలను, సంస్కృతంలో వేంకటేశ్వర మహత్మ్యం,
తెలుగులో శృంగారమంజరి అనే లఘుకావ్యం, పన్నెండు శతకాలు ఆనాటి
వాడుకభాషలన్నింటిలో సాటిలేని ప్రబంధాలు రాసాడట. అయితే 32,000 సంకీర్తనల్లో
14,000 కీర్తనలు, శృంగారమంజరి, అలమేలు మంగమ్మపై శతకం మాత్రమే లభ్యమయినాయి.
వారు రచించిన రామాయణం దొరకకపోవడం మన తెలుగువారి దురదృష్టం.
అన్నమయ్య కీర్తనలలో ప్రత్యేకంగా చెప్పుకో దగినవి’సంవాద గీతాలు అంటే
యుగళగీతాలు. వీటిని వాకోవాక్య గీతాలు అంటారుట. గోపికాకృష్ణుల సంవాదం,
యశోదాకృష్ణుల సంవాదం, భావామరదళ్ళ సరస సంవాదం, అత్తాకోడళ్ళ ఎత్తిపొడుపు
సంవాదం, స్వామివారితో అమ్మవారు అలకతో వాదీంచే సంవాదం ఇలా ఎన్నో ఆయన
రచనల్లో గోచరిస్తాయి.
అన్నమయ్య అభ్యుదయవాది. అసలు స్త్రీవిద్యని ప్రోత్సహించి , స్త్రీల చేత
కూడా కవితలల్లించిన ఉత్తమ సంస్కారి అన్నమాచార్యులు. ఈతని భార్య తిమ్మక్క
“సుభద్రా కల్యాణం” అనే కావ్యాన్ని రచించి తొలి తెలుగు కవియిత్రి అయింది. ఆంధ్ర
లోకానికి తొలి కవయిత్రిని పరిచయం చేసిన్ ఘనత కూడా అన్నమయ్యకే దక్కింది..
స్త్రీల యెడల, వారి ప్రతిభాపాటవాల పట్ల ప్రత్యేక దృష్టి కలిగి, వారు
పాడుకోవడానికి ప్రత్యేకంగా ఎన్నో రకాల పాటలను కూర్చిపెట్టాడు.
పెండ్లి పాటలు, శోభనపు పాటలు, మంగళహారతులు, దంపుళ్ళ పాటలు,, కోలాటపు పాటలు,
సువ్వి పాటలు, గొబ్బి పాటలు, జోల ఆటలు, జాజరలు, చల్లలమ్మే పాటలు ఇలా ఎన్నో
స్త్రీలు పాడుకొనే పాటలు రచించాడు. ఇంతే కాక తొలి పలుకులు నేర్చిన తన బిడ్డడికి
ఆ తరం ప్రతి తెలుగుతల్లి నేర్పే తొలి పద్యాల్లో ఒకటయిన చేత వెన్న ముద్ద అనే
పద్యం కూడా అన్నమయ్య చిన్నికృష్ణ శతకం లోనిది. ఆ శతకం సీసపద్య శతకం.
చేతిలో వెన్నముద్ద – చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు – పట్టుదట్టి
కొండెపు సిగముడి – కొలికి నెమలిపురి
ముంగురుల్ మూగిన – ముత్తియాలు
కస్తూరికింబట్టు (?) – కన్నులన్ కాటుక
చక్కట్ల దండలు ముక్కుపోగు
సందెతతాయ్వ్తులన్ – సి(స)రి మువ్వ గజ్జెలు
అక్కునమెచ్చుల – పచ్చకుచ్చు
డాబు డంబరమీర –డాచేతిపై నిల్చి
కాళ్ళ సందె ఘల్లు ఘల్లుమనగ
దోగి దోగి యాడ తాళ్ళపాకన్నన్న
చిన్నికృష్ణ! నిన్ను చేరి కొల్తు .
కాలక్రమమున రూపాంతరము చెంది
చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు పట్టుదట్టి
సందె తాయెతులు సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరి కొలుతు.
అనే రూపంగా ఈ పద్యం తెలుగు తల్లుల నోళ్ళలొ నాట్యం చేస్తూ ఉంది.
స్త్రీలు ఆయా సందర్భాలలో, వేడుకల్లో పాడుకొనే పెక్కు విధాలయిన
పాటలపద్ధతిని తాను స్వీకరించి, కీర్తనలు గా రచించి, ఆ పాటలకు ఉన్నతస్థితినీ,
ఉత్తమగతినీ కల్పించాడు అన్నమయ్య.
స్త్రీ జాతిని ఇంతగా గౌరవించి, వారికోసం ఇంత సాహిత్యం సమకూర్చిన
వాగ్గేయకారుడు కూడా అన్నమయ్యే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఇంకా ఎన్నో అపురూప భావాలతో అనన్య సామాన్యంగా పదరచన చేసి “న భూతో న
భవిష్యతి “ అన్నట్లుగా తన పదకవితా సంపదను అత్యంత మనోజ్ణంగా మనముందుంచాడు.
అన్నమయ్య భావనా బలానికి, ప్రతిభా సంపన్నతకు ఆయన పదాలన్నీ ఉదాహరణలే.
అన్నమయ్యకు పదకవితా పితామహుడనీ, సంకీర్తనాచార్యుడనీ బిరుదులున్నాయి. ఇతడు
1408 లో వైశాఖ పౌర్ణమి నాడుజన్మించి, 1503 ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు
దివ్యధామం చేరినట్లు తెలుస్తూంది.
- పొన్నాడ లక్ష్మి