Saturday, 21 December 2019

నారాయణుడ! నీ నామము మంత్రించి వేసి పారేటి ఈ జీవుల భ్రమ విడిపించవే - అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.
కీర్తన:
పల్లవి: నారాయణుడ! నీ నామము మంత్రించి వేసి
పారేటి ఈ జీవుల భ్రమ విడిపించవే ॥పల్లవి॥
చ.1 మదనభూతము సోకి మగువలు బురుషులు
అదన విరిదలలై యంగమొలలై
పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళ జించుకొంటా
కొదలు కుత్తికలను గూసేరు జీవులు ॥ పారేటి ॥
చ.2 పంచభూతములు సోకి భ్రమసి యజ్ఞానులై
పొంచి హేయములు మన్నుబూసు కొంటాను
అంచెల వీడెపురస మందునిందు గిరియుచు
యెంచి ధనము పిశాచాలిట్లైరి జీవులు ॥ పారేటి ॥
చ. 3 తమితోడ మాయాభూతము సోకి బహుజాతి
యెముకలు దోలు నరాలిరవు చేసి
నెమకి శ్రీవేంకటేశ నిన్ను జేర కెక్కడైన
తాము దా మెరగరింతటా జూడు జీవులు
(రాగం: సామంతం; ఆ.సం. సం.3; 286 వ రేకు; కీ.సం.494)
విశ్లేషణ:
ఓ శ్రీవేంకటేశ్వరా! ఒక్కసారి నీ నారాయణ మంత్రాన్ని మంత్రించి జీవులపై వదలినట్లైతే జీవన వ్యాపారాలలో, అనేక మోహాలలో, అనేక అనవసర వ్యాసంగాలతో ఉండే మనుష్యులు తమ తమ భ్రమలను వీడి నీశరణు వేడి కైవల్యం పొందరా! కానివ్వండి…. నారాయణమంత్రరాజాన్ని వదలండి అని జీవులజీవితోద్ధరణకై అన్నమయ్య స్వామిని శరణువేడి ప్రార్ధిస్తున్నాడు
.
ఓ శ్రీనివాసుడా! ఈ జీవులకు మదనభూతం సోకింది. తత్కారణంగా పురుషులు, స్త్రీలు వివశులై విచక్షణ నశించి దిగంబరులై, పెదవులలో రక్తము చిమ్మే దాకా, గోళ్ళతో శరీరంపై గోట్లు పడేదాకా రక్కుకుంటూ, అతిశయించిన మదనోత్సాహంతో అవతలి వారి కుత్తుకలు తెగే వరకూ తెగిస్తున్నారు. దంతక్షతాలు నఖక్షతాలు అనే శృంగార క్రీడ బరితెగించినదని, బజారున పడిందని..వాపోతూ… నిరశిస్తున్నాడు అన్నమయ్య. ఎంత ఘోరం! ఎంత దారుణం! ఎంత దౌర్భాగ్య స్థితి.
ఓ పరంధామా! ఈ సృష్టిలోని పంచభూతములు వీరిని పూర్తిగా వశపరచుకొన్నవి. బయటపడలేని భ్రమలలో మునిగి కన్నుమిన్ను గానక కొట్టుమిట్టాడుతున్నారు. ఎంత హేయమో చూసారా! ఒడలికి మట్టిని పూసుకుని వెర్రి ఆనందంపొందేవాడు ఒకడు. తాంబూల సేవనమే ముఖ్యం అని తలుస్తూ ఆ రసాస్వాదనే జీవిత పరమార్ధం అనుకునేవారు మరికొందరు. జీవులందరికీ ధనపిశాచము పట్టింది. ఉఛ్చనీచాలు పుడమిలో నశించాయి. ధనసంపాదనకు ఏపనికైనా సిద్ధపడుతున్నారు. ఇక మీరు నారాయణ మంత్రం వదలవలసినదే!
ఓ పరాత్పరా! పరంధామా! విపరీతమైన ధనదాహం, కామదాహం కారణంగా జీవులకు మాయా భూతం సోకింది. తద్వారా “తానెవరో!” తెలిసికోలేని స్థితికి దిగజారాడు. నేను అంటే ఎముకలు…తోలు… ఇదే… ఇదే నాజాతి…ఇదే నేనంటే అనే భ్రమ సోకింది. ప్రతిజీవి పరమాత్మ స్వరూపమనే విషయం విస్మరణకు గురి అయినది. అందువల్ల అరిషడ్వర్గాల వలలో చిక్కాడు. జననమరణ చక్రంలో పడి తిరుగుతున్నాడు. వేల సంవత్సరాలు ఇదే తంతు కొనసాగుతోంది. దీని నుంచి “నారాయణ మంత్రం” ప్రసాదించి జీవులను బయటపడవేయ వలసినదిగా ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.
భావం..శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు.

No comments:

Post a Comment