Friday 28 February 2020

వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి భారత రామయణాలై పరగె నీ కధలు ॥ - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.

వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి
భారత రామయణాలై పరగె నీ కధలు ॥

భువిమీద రావణుడు పుట్టగాగా రాముడవై
తవిలి ఇందరికి బ్రత్యక్షమైతివి,’
వివరింప నంతవాడు వెలసితేగా నీవు
అవతార మందితే నిన్నందరును జూతురు ॥

రమణ గంసాది యసురలు లూటి సేయగాగా
తమి గృష్ణావతార మిందరి కైతివి,
గములై ఇంతటి వారు గలిగితేగా నీవు నేడు
అమర జనించి మాటలాడుదు విందరితో. ॥

ఎంత ఉపకారియో హిరణ్య కశిపుడు
చెంత నరసింహుడని సేవ ఇచ్చెను,
ఇంతట శ్రీ వేంకటేశ ఇన్ని రూపులును నీవే
పంతాన నీ శరణని బ్రతికితి మిదివో ॥

భావ మాథుర్యం..

ఈ కీర్తనలో అన్నమయ్య పాపాత్ములను, రాక్షసులను కూడా మెచ్చుకుంటాడు. వాళ్ళు భూమి మీదకు రాబట్టేగా పరమాత్ముడు వాళ్ళను సంహరించడం కోసం వివిద రూపాలలొ అవతరించి, జనులనందరినీ కటాక్షించాడు. ఇదీ అన్నమయ్య అంటే..

ఓ పరమాత్మా! నిన్ను భూమి మీద అవతరింపజేసేలా చేసిన వారిదే పుణ్యము. అందుమూలముగా నీ కథలు బారత రామాయణాలుగా ప్రసిధ్ధి చెందాయి.

ఈ భూమి మీద రావణుడు పుట్టబట్టి ఆనిని సంహరించుటకు నీవు శ్రీరాముడిగా అవతరించితివి. వివరంగా చెప్పాలంటే అంతటివాడు జన్మించబట్టే నీవు అవతరమెత్తితివి. నిన్ను అందరూ దర్శించుకొనే భాగ్యం కలిగింది.

శ్రీ రమణా! కంసాది అసురులు మానవులను దోపిడీచేయబూనగా, నీవు కృష్ణావతారమెత్తితివి. పాపాత్ములైన వారు జనించబట్టేగా నీవు భూమీద జన్మించి అందరితో మాటలాడేవు. మంతనాలాడేవు.

ఇంక హిరణ్యకశిపుడు ఎంత ఉపకారము చేసినాడొ.. అతను కోరిన వింత వరము వల్ల అద్భుతమైన నరసింహావతార మెత్తితివి. నీ సేవ చేసుకొనే భాగ్యం మాకు కల్పించితివి. శ్రీ వేంకటేశా ఇన్ని రూపులూ నీవే. నిన్నే శరణని మేమందరమూ బ్రతుకుతున్నాము.

Friday 7 February 2020

నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము. - అన్నమయ్య కీర్తన

 అన్నమయ్య కీర్తన
నదులొల్లవు నా స్నానము కడు
సదరము నాకీ స్నానము.
ఇరువంకల నీ యేచిన ముద్రలు
ధరించుటే నా స్నానము,
ధరపై నీ నిజదాసుల
చరణధూళి నా స్నానము.
తలపులోన నినుదలచినవారల
తలచుటే నా స్నానము
వలనుగ నిను గనువారల శ్రీపాద
జలములే నా స్నానము..
పరమభాగవత పదాంబుజముల
దరిసనమే నా స్నానము.
తిరువెంకటగిరి దేవా..
కథాస్మరణమే నా స్నానము...
భావవ్యక్తీకరణ..
నదులలో చేసే స్నానమొక్కటే కాదని, అంతకుమించిన స్నానమే తాను ఆచరిస్తున్నానని ఈ కీర్తనలో అన్నమయ్య స్పష్టం చేస్తున్నాడు.
భుజాలపై రెండువైపులా చక్రాoకితాల ముద్రలను ధరించడమే తనకు నిజమైన స్నానం అంటున్నాడు. పరమాత్మకు దాసులైన వారికి దాస్యం చేయడం అసలైన జలకస్నానం అని అన్నమయ్య విసదీకరిస్తున్నాడు.
మనసులో నిన్ను తలుచుకున్నవారిని తరుచూ మననం చేసుకోవడం, నిన్ను కనులారా చూసిన వారి పవిత్రజలాలను తలపై చల్లుకోవడం నాకు మహత్తరమైన స్నానం అంటున్నాడు అన్నమయ్య.
పరమాత్మే పరమావిధిగా జీవించే పారమార్థిక మూర్తుల పాదపద్మాలను దర్శించుకోవడం, తనకు గురియైన శ్రీనివాసుని దివ్యగాథను స్మరించుకోవడం నిత్యం నదీస్నానం చేయడంతో సమానమని పాడుకుంటూ పులకించిపోతున్నాడు అన్నమయ్య.

Saturday 1 February 2020

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య.. కదిసితేనే ఇనుము కనకమై మించెను. !! - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య..
కదిసితేనే ఇనుము కనకమై మించెను. !!
సెలవి నీవు నవ్వితే చిత్తము చీకటివాసె
వెలసెను నాలోని వేడుకలెల్లా
చెలిమిచేసి నాపైఁ జేయి నీవు వేసితేను
బలిమితో వలపుల పంటలెల్లాఁ బండెను !!
తప్పక నీవు చూచితే తనువుపై కాఁక మాని
వుప్పతిల్లెజవ్వనము వుదుటునను
కొప్పుదువ్వి నీవు నన్నుఁ గొనగోరు సోఁకించితే
కుప్పళించు తమకపుకొటారులు నిండెను. !!
చేరి నీవు పలికితే సిగ్గులు మూల కొదిగి
కారుకమ్మె నెమ్మోమునఁ గళలన్నియు
ఈరీతి శ్రీ వేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సారె నా కిట్టె మదనసామ్రాజ్యము హెచ్చెను. !!
భావమాథుర్యం.
ఓ శృంగారరాయా! నీ మహిమలను ఏమని పొగడెదమయ్యా! పరిశీలించి చూస్తే ఇనుములాంటి అల్పులైన నాబోంట్లు కనకములాగ ప్రకాశిస్తారు.
నీవు మథురమైన చిరునవ్వులు చిందిస్తే మనసులోని పెనుచీకట్లు తొలగిపోతాయి. నాలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. చెలిమితో నీవు నాపై చేయి వేస్తే నా వలపుల పంట పండుతుంది.
నీవు నన్ను నఖశిఖపర్యంతం చూస్తే నా శరీరమంతా పులకరించి నా యౌవ్వనం ఒక్కసారిగా అతిశయిస్తుంది. నీవు అనురాగంతో నా శిరోజాలను నిమురుతూ నాకు చిన్న నఖక్షతము చేస్తే తమకంతో తబ్బిబ్బవుతాను.
నీవు నన్ను ప్రేమతో పలుకరిస్తే సిగ్గులమొగ్గనై ఒక మూల ఒదిగిపోతాను. నా మోములో కళలు తాండవిస్తాయి. ఓ వేంకటేశ్వరా! నీవు అన్నివిధాలుగా నన్నేలితివి. నన్ను వెలకట్టలేని రత్నముగా మలచేవు. నా మదన సామ్రాజ్యము నీ కృప వల్ల అతిశయించినది.

అణుమాత్రపుదేహి నంతే నేను మొణిగెద లేచెద ముందర గానను - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన
పల్లవి: అణుమాత్రపుదేహి నంతే నేను
మొణిగెద లేచెద ముందర గానను
చ.1. తగు సంసారపు తరగలు నీ మాయ
నిగమముల యడవి నీ మాయ
పగలునిద్రలువుచ్చే భవములు నీ మాయ
గగనపు నీమాయ గడపగ వశమా! ॥అణుమాత్రపు॥
చ.2. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ
నియమపు పెనుగాలి నీ మాయ
క్రియనిసుకపాతర కెల్లొత్తు నీ మాయ
జయమంది వెడలగ జనులకు వశమా?॥ అణుమాత్రపు॥
చ.3. కులధనములతో జిగురుగండె నీ మాయ
నిలువు నివురగాయ నీ మాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుట గాక యిది గెలువగ వశమా? ॥ అణుమాత్రపు॥
విశ్లేషణ:
మొణిగెద శ్రీనివాసా! అణుమాత్రపు కణంతో జన్మించాను నేను. అణువుతో సమానమైనవాడను. ఈ సంసార చక్రంలో పడి ముణుగుతున్నాను లేస్తున్నాను. అనగా పుడుతూ ఉన్నాను. మరలా జన్మిస్తూ ఉన్నాను. ఏది కొస ఏది మొదలు అనే అంతరం తెలియక కొట్టుమిట్టాడుతున్న వాడను. ముందు ఏమి జరుగుతుందో తెలీదు. తర్వాత ఏమి అవుతుందో తెలీదు. ఇదీ నా పరిస్థితి స్వామీ!
ఈ సంసారమనే మహాసముద్రంలో వువ్వెత్తున లేచే తరంగాలు నీ మాయ. ఈ మహారణ్యంలో పెనువృక్షాలలాగా వేదవేదాంగాలు అర్ధంకాని పరిస్థ్తిలో ఉన్నవి ఇదీ నీ మాయే! రాత్రి పగళ్ళు, నశించేటువంటి ఈ పుట్టుక నీ మాయ. ఆకాశం ఎంత అగమ్యగోచరమో నీ మాయ అంతే ! ఏమీ అర్ధం కాదు. దీన్ని దాటడం సామాన్యులమైన మా వశమా?
స్వామీ! మేము చేతగాని అనేక అవక తవక పనులు చేస్తూ మళ్ళీ మళ్ళీ ఈ కర్మ బంధాలలో తగులుకుంటూనే ఉన్నాము. నీ నియమానుసారం సంచరించే గాలి ఒక్కోసారి ప్రళయకాల సదృశమై పెనుగాలిగా మారడం నీ మాయ కాదా? సర్వస్వం పెళ్లగించి ఇసుక పాతరలో పూడ్చి పెట్టేయడం నీ మాయ కాదా? నిన్ను ఎదిరించి జయించడం ఎవరికి తరము? మాలాంటి వారికి ఈ ఆటుపోట్లను తట్టుకొని నిలబడే శక్తి ఉంటుందా చెప్పండి అని ప్రార్ధిస్తున్నాడు.
స్వామీ మేము గొప్ప కులంలో జన్మించామని కొందరు, గొప్ప కోటీశ్వరులుగా జన్మించామని కొందరు విర్రవీగుతుంటారు. కానీ ఇదంతా నీవు పన్నిన వుచ్చని తెలుసుకోలేని విధంగా మాయలో చిక్కిపోయాము. తెలుసుకోలేకపోతున్నాము. ఇలాంటి మాయా ప్రపంచంలో నివురుగప్పిన మాయతో జీవిస్తున్నాము. శ్రీ వేంకటేశ్వరా! నీవు మమ్మలను ప్రేమతో చేరదీస్తే ఈ మాయను గెలువగలము కానీ మామూలుగా జయింపవశముగాని మాయ ఇది. కనుక మమ్మలను ఈ మాయలో పడకుండా కాపాడి ముక్తిని ప్రసాదించండి అని అన్నమయ్య ప్రార్ధిస్తున్నాడు.
(భావార్ధం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి సౌజన్యంతో)