Saturday 7 November 2020

తల్లి బాధ్యత.

 ఆకలి తెలిసీ అన్నం పెట్టేది, అదనెరిగి ఆగ్రహించేదీ, అనువుగా మందలించేదీ, ఆదర్శంతో తీర్చి దిద్దేదీ తల్లి. అని మహాభారతంలో ఒక విశ్లేషణ,

అయితే ఈతరం తల్లులు మొదటి మాటను మాత్రమే ఆచరిస్తున్నారు. వారు అడిగినవన్నీ కొనిపెట్టడం, అల్లారుముద్దుగా, కష్టం తెలియకుండా పెంచడం చాలా మంది ఇళ్ళల్లో చూస్తున్నాము. నిజానికి అమ్మ ఆదిగురువు అంటారు, మంచి చెడ్డలు, మర్యాదలు, మన సంస్కృతి అన్నీ చెప్పవలసింది అమ్మే. పెద్దలు కనిపిస్తే నమస్కరించడం ఇంటికి వచ్చినవారిని ఆత్మీయంగా పలకరించడం, సమయపాలన ఇలాంటి విషయాలు అతి మామూలుగా పిల్లలికి మాటల మధ్యలో చెప్పొచ్చు. అన్నీ పెద్దయితే వాళ్ళే తెలుసుకుంటారు అని అంటూఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం?. కొంతవరకు తల్లితండ్రుల భాద్యత లేదా? జన్మతః కొందరికి ఎవరూ ఏమీ చెప్పకుండానే మ్ంచి అలవాట్లు అలవడతాయి. కొంతమంది పిల్లలు తల్లితండ్రులు, గురువులు చెప్పగా నేర్చుకుంటారు.
పిల్లలకి మంచి నడవడి రావాలంటె తల్లితండ్రులదే బాధ్యత అని నాకనిపిస్తూంది. వారికి కావలసినవన్నీ, వారు నొచ్చుకుంటారని అమర్చి పెట్టేస్తుంటారు. చిన్నప్పుడు మాకు ఎలాంటి సరదాలు తీరలేదు, అంచేత మా పిల్లలకి ఏలోటూ ఉండకూడదని అని నేటి తరం భావిస్తున్నారు. అదీ కొంతవరకు నిజమే. కోరికలు తీర్చడంతో పాటు మంచినడవడిగల పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత కూడా తల్లిదే.

Sunday 1 November 2020

విశాఖ ప్రయాణం.

 

విశాఖ ప్రయాణం.

 

“అమ్మా! నేను బయల్దేరి వైజాగ్ వస్తున్నాను” చిన్నకూతురు మధు గొంతు ఫోంలో విన్న భారతికి ఏమీ అంతుపట్టలేదు. అమ్మా! మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. ఈ  విపత్కర పరిస్థితులలో ఈవిడెందుకు ఇప్పుడు బల్దేరుతూంది అని ఒక్క క్షణం ఆలోచనలో పడింది. అయిదారు నెలల నుంచి భుజం నొప్పితో భారతి చాలా బాధపడుతూంది. ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కి చూపించుకుని ఎక్ష్రేలు, స్కాన్ తీయించుకొంది. భుజం దగ్గిర ఎముక పూర్తిగా అరిగిపోయిందని, లూస్ బాడీస్ ఉన్నాయి అవి తీసెయ్యాలని, డాక్టర్స్ చెప్పారు.  చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరి, పైగా ఈ వయస్సులో తట్టుకోగలనా అని భయం, అన్నీ కలిసి ఆపరేషన్ కి మొగ్గు చూపట్లేదు. కొడుకు విజయ్, కూతురు మధు హైదెరబాద్లో ఉంటున్నారు. పెద్ద కూతురు విశాఖపట్నంలో ఉంటూంది.  సంగతంతా తెలిసి కొడుకు, కూతుళ్ళు ఎలాగైనా ఆపరేషన్ చెయించుకోవాలని పట్టుబడుతున్నారు. నిన్న కొడుకు విజయ్ ఫోన్ లో మాట్లాడి అమ్మా మేము నీకు సర్జరీ  చేయించేస్తాము. నువ్వు అంత బాధ పడుతుంటే మాకెలా తోస్తుంది. డబ్బుగురించి నువ్వేం అలోచించకు, నువ్వు ఏం చెప్పినా మేము వినం అని ఖరాఖండిగా అన్నాడు. దాని పరిణామమే మధు రాక అయ్యుంటుంది అనుకుంటుందగా మళ్ళీ మధు ఫోన్ చేసింది.

అదేమిటే! హఠాత్తుగా ఈ ప్రయాణం? అని ప్రశ్నించింది. “అమ్మా! నువ్వు చెయ్యి నొప్పితో చాలా బాధ పడుతున్నావని, సర్జరీ అవసరమని అక్క చెప్పింది. అక్కకి నడుం నొప్పి ఎక్కువగా ఉందట, ఆఫీస్ లో  కూడా సెలవు దొరకట్లేదని, నన్ను రమ్మని చెప్పింది. ఆసుపత్రికి నిన్ను తెసుకెళ్ళడానికి, పరీక్షలు అవీ చేయించడానికి అవసరాన్ని బట్టి సర్జరి చేయించడానికి రమ్మంటూంది. అందుకే గోదావరిలో బయల్దేరాను”. అంది.  “అది చెప్పడం నువ్వు బయలుదేరిపోవడం చాలా బాగుందమ్మా! పరిస్థితులెలా ఉన్నాయి రోజు రోజుకీ కరోనా విజృంభిస్తూంది.  ఈ సమయంలో ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం శ్రేయస్కరం. తోందరపడి బయల్దేరి  ఇబ్బందులపాలవుతావేమో. అయినా నాదేం ప్రాణం తీసే జబ్బుకాదు. కాస్త పరిస్థితులు చక్కబడ్డాక అలోచించుకోవచ్చు. అందాకా ఏవో మందులు వాడుతున్నాను కదా!” అని భారతి అంటుంటే అవతలినుంచి నవ్వులు వినిపించాయి. అప్పుడు మధు “ఇబ్బందుల పాలవ్వటమేమిటమ్మా? అనేక ప్రమాద పరిస్థితులను దాటుకొని తమ్ముడింటికి ఇప్పుడే చేరాను. నేను వైజాగ్ దాకా రాలేదు  అని చావు కబురు చల్లగా చెప్పింది. భారతికి ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించింది ఏమిటే నీ మాటలు సరిగ్గా చెప్పి ఏడు. అంది గాభరా పడుతూ ..  అమ్మా! నువ్వు ఒట్టి గాభర మనిషివి అందుకే నీకు సగం విషయాలు చెప్పం. ఇబ్బందులన్నీ తప్పించుకుని క్షేమంగా ఇల్లు చేరాను కనుక ఇప్పుడు నీకు ఫోన్ చేసాను అంది. అసలేం జరిగింది? సరిగ్గా చెప్పు.అంది భారతి.

అక్క దగ్గర్నుంచి ఫోన్ వచ్చాక నేను, తమ్ముడు  నీ సమస్య గురించి మాట్లాడుకున్నాము. తమ్ముడు ఈమధ్యే కొత్త కంపెనీ లో చేరాడు. తనకి సెలవు దొరకడం కష్టమని, నన్ను వెళ్ళమని అన్నాడు. డబ్బు సంగతి తను చూసుకుంటానని గోదావరి లో టికెట్ బుక్ చేశాడు.  మధ్యాహ్నం వచ్చి నన్ను తీసుకుని స్టేషన్ కి వచ్చాడు. నేను పకడ్బందిగా మాస్క్, గ్లొవ్స్ అన్నీ వేసుకుని తయారయి వచ్చాను, అక్కడి సిబ్బంది స్టేషన్ లోకి తమ్ముడిని రానివ్వలేదు.నేను సామాను తీసుకుని లోపలికి వెళ్ళాను. ప్లాట్ ఫామ్ రద్దీగానే ఉంది.  స్టేషన్ కి రెండు గంటలు ముందు రావాలని, అందరిని నిశితంగా పరీక్ష చేసి బండి ఎక్కనిస్తామని రైల్వే వారి ఆదేశం. అలాగే వచ్చాను అక్కడ ఏవిధమైన పరీక్షలూ లేవు.  ట్రైన్ వచ్చేసరికి జనాలు గుమ్మం దగ్గిర మూగేసారు. కాస్త రద్ది తగ్గాక పెట్టెలోకి ఎక్కాను. అక్కడి పరిస్థితి చూస్తే తల తిరిగిపోయింది.

అడ్డదిడ్డంగా సామానులు, మనుష్యులు నించుందికి కూడా జాగా లేదు. ఒక్కళ్ళకీ మాస్క్స్ లేవు. కనీస జాగ్రత్తకూడా పాటించటం లేదు. మీద బెర్త్ నాది. అందాక కింద కూచుందామంటే కింద బెర్త్స్ రెండింటిలోనూ అనారోగ్యంతో పడుకుని ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు. చేసేది లేక లగేజ్ కింద సర్ది మీదకి కష్టపడి ఎక్కాను. ఏదో స్పెషల్ బండిట. మీదని కూడా కూర్చుందికి వీలుగా లేదు. ఈలోపున తమ్ముడి ఫోన్. బండి ఎక్కవా? జాగ్రత్తగా కూచున్నావా అని ఏం జాగ్రత్తరా బాబూ అని పరిస్థితి వివరించాను. వాడు వెంటనే గాభరాపడి అక్కా! నువ్వు బండి దిగిపో ఇంటికి వచ్చేద్దువుగాని. నేను వచ్చి తీసుకెల్తాను. ఆ బండిలో వెళ్ళావంటే కరోనా కచ్చితంగా వచ్చేస్తుంది. నీ ద్వారా అమ్మ వాళ్ళకి సంక్రమిస్తే బాబోయ్! తలుచుకుంటేనే భయంగా ఉంది. బండి దిగిపో అన్నాడు. కొంపదీసి దిగిపోయావేమిటే అంది భారతి. చెప్పేది పూర్తిగా వినమ్మా. తమ్ముడు చెప్పిందే నాకూ నయమనిపించింది. అసలే అనారోగ్యంగా ఉన్న నేను 14 గంటలు ఆ కూపేలో ప్రయాణిస్తే ఏమైనా జరుగుతుంది. అనుకుని కష్టపడి మీదనుంచి దిగాను. ఈలోపున బండి కదిలిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసాను. వచ్చే స్టేషన్ మౌలాలిలో దిగిపో నేను వస్తాను అన్నాడు. సామానులు సర్దుకుని జనాల్ని తప్పించుకుని ద్వారం దగ్గరికి వచ్చేసరికి మౌలాలి కూడా దాటిపోయింది. బండి ఆగలేదు కూడా.. అప్పుడు మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసాను. ఆ తరువాత స్టేషన్ ఘట్కేసర్ దిగిపో అన్నాడు. తరువాత్ స్టేషన్ లో బండి ఆగలేదు. ఇంక లాభం లేదని చైన్ లాగాను. బండి స్టేషన్ కి కాస్తదూరంలో ఆగింది. గబ గబా సామాను పట్టుకుని దిగేసాను. చిన్నగా వాన పడుతూంది. ఈలోపున రైల్వే సిబ్బంది నలుగురు దిగి నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతసేపు పడ్డ టెంషన్ కి నాకు కాళ్ళు వణకడం మొదలు పెట్టాయి. అయినా వాళ్ళు అడిగిన అన్నింటికీ జవాబు చెప్పాను. నేను పడ్డ అవస్థంతా చెప్పేను. మీ ఎవరి సలహా అయినా తీసుకుందామంటే  మీరెవ్వరూ కనిపించలేదు అన్నాను. మీకు ఇబ్బంది వస్తుందని మీ పక్కనే కూచుంటామా? అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. నా శారీరిక పరిస్థితి కూడా వాళ్ళు ఆలోచించ లేదు. నాకు వళ్ళుమండి నేనూ తిక్కగానే సమాధానం చెప్పి ఏం చేసుకుంటారొ చేసుకోండి నా ఆరోగ్యం బాగులేదు. ఇక్కణ్ణుంచి ఎలాగోలా ఇల్లు చేరాలి అనుకుని దిగాను. అని గట్టిగా చెప్పేసరికి వాళ్ళు ఏవో రాసుకుని బండెక్కిపోయారు. బండి కదిలింది.

బ్రతుకుజీవుడా అనుకొని సామాను పట్టుకుని ట్రాక్ పక్కనుంచి వానలో తడుస్తూ ఒక ఇరవై నిమిషాలు నడిచి స్టేషన్ చేరాను. తీరా చూస్తే అది చర్లపల్లి స్టేషన్. నిర్మానుష్యంగా ఉంది. అప్పుడు కొంచెం ఆయాసం తీర్చుకుని తమ్ముడికి ఫోన్ చేసాను. వాడు వెంటనే అక్కా నేను అక్కడికే వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు చాలా వాన పడుతూంది అని జవాబిచ్చాడు. కంగారు పడకు మెల్లిగా రా! వాన పడితే హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అని జవాబిచ్చి బెంచి మీద కూర్చున్నాను. ఈలోపున స్టేషన్ కానిస్టెబుల్ వచ్చి నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టాడు. మీరు ఇక్కడ ఎందుకు దిగారు అంటూ.. వాడికి జవాబు చెప్పాను. ఆఫీస్ రూం కి వచ్చి నే చెప్పినదంతా రాసి సంతకం పెట్టమన్నాడు. అలాగే చేసాను. వాడు ఒక్కడే స్టేషంలో నేనూ ఒక్కాదాన్నే చీకటి పడుతూంది, వానకూడా ఎక్కువయింది. మనసుకి ధైర్యం చెప్పుకుని కూర్చున్నాను అరగంట పొయాక తమ్ముడు వచ్చాడు.  అక్కా! ఉన్నావా తల్లీ నిన్ను చూసిందాకా నా ప్రాణం నిలబడలేదు. పద వెళ్దాం కారులో మాట్లాడుకుందాం అని చెప్పి సామాను తీసుకుని బయల్దేరాడు. వాణ్ణి చూసాక నాకూ కొంత ఉపశమనం కలిగింది.  ఇద్దరం కారులో కూర్చుని హోరుమని వానలో ఇంటివైపు బయల్దేరాం. దారిలో అంతా వివరంగా చెప్పాను. ఇంటికి చేరేసరికి తమ్ముడి పిల్లలు, భార్యా అందోళనగా ఎదురు  చూస్తూ కనిపించారు. అందర్నీ పలకరించి లోపలికివచ్చి కాస్త తేరుకుని నీకు ఫోన్ చేసాను. అంది మధు.

కూతురు చెప్పినదంతా వినేసరికి ఒక్కసారి ఒంట్లో వణుకు వచ్చింది భారతికి. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి తప్పించుకుంది ఎంత దారుణంగా ఉన్నాయి రోజులు?  చీకటివేళ నిర్మానుష్యమైన ప్రదేశంలో రైల్వే పట్టాల పక్కనుంచి ఒక్కర్తీ నడుచుకు రావడం, ఎవరైన కనిపెట్టి ఏదైనా అఘాయిత్యం చేస్తే ఏదీ గతి? ఎంత దారుణం జరిగేది? ఆ వానలో టెంషన్ తో కారు నడిపిన కోడుకు పరిస్థితి అలోచించినకొద్దీ మనసు వికలమై పోతూంది. కళ్ళ నీళ్ళ పర్యంతమైంది.  తను నమ్ముకున్నా ఆంజనేయ స్వామే తన పిల్లల్ని కాపాడాడు అనకుని, స్వామికి పదే పదే నమస్కరిస్తూ నిట్టూరుస్తూ కూర్చుంది. భారతి భర్త వచ్చి, నాకు ఇందాకలే విజయ్ ఫోన్ చేసి చెప్పాడు పరిస్థితి. మధుని తీసుకు రావడానికి వెళ్తూ నాతో మాట్లాడాడు. అమ్మకి చెప్పకండి కంగారు పడుతుంది, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు అని చెప్పాడు.. అయితే అంతా మీకు తెలుసన్నమాట! ఇంతసేపూ మీరు అన్యమనస్కంగా ఉంటే ఏమో అనుకున్నాను. మీ గుండె నిబ్బరం మెచ్చుకో వచ్చు అని నిష్టూరమాడింది. పోన్లే పిల్లలికి ఏం కాలేదుగా ఇంకా ఎందుకు బెంగ? పద  పడుకో  ఇంక. అని అనునయించాడు.