Sunday 31 January 2021

అణుమాత్రపుదేహి నంతే నేను ముణిగెద లేచెద ముందర గానను

 ఈ వారం అన్నమయ్య కీర్తన

పల్లవి: అణుమాత్రపుదేహి నంతే నేను
మునిగెద లేచెద ముందర గానను
చ.1. తగు సంసారపు తరగలు నీ మాయ
నిగమముల యడవి నీ మాయ
పగలునిద్రలువుచ్చే భవములు నీ మాయ
గగనపు నీమాయ గడపగ వశమా! ॥అణుమాత్రపు॥
చ.2. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ
నియమపు పెనుగాలి నీ మాయ
క్రియనిసుకపాతర కెల్లొత్తు నీ మాయ
జయమంది వెడలగ జనులకు వశమా?॥ అణుమాత్రపు॥
చ.3. కులధనములతో జిగురుగండె నీ మాయ
నిలువు నివురగాయ నీ మాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుట గాక యిది గెలువగ వశమా? ॥ అణుమాత్రపు॥
విశ్లేషణ:
శ్రీనివాసా! అణుమాత్రపు కణంతో జన్మించాను నేను. అణువుతో సమానమైనవాడను. ఈ సంసార చక్రంలో పడి ముణుగుతున్నాను లేస్తున్నాను. అనగా పుడుతూ ఉన్నాను. మరలా జన్మిస్తూ ఉన్నాను. ఏది కొస ఏది మొదలు అనే అంతరం తెలియక కొట్టుమిట్టాడుతున్న వాడను. ముందు ఏమి జరుగుతుందో తెలీదు. తర్వాత ఏమి అవుతుందో తెలీదు. ఇదీ నా పరిస్థితి స్వామీ!
ఈ సంసారమనే మహాసముద్రంలో వువ్వెత్తున లేచే తరంగాలు నీ మాయ. ఈ మహారణ్యంలో పెనువృక్షాలలాగా వేదవేదాంగాలు అర్ధంకాని పరిస్థ్తిలో ఉన్నవి ఇదీ నీ మాయే! రాత్రి పగళ్ళు, నశించేటువంటి ఈ పుట్టుక నీ మాయ. ఆకాశం ఎంత అగమ్యగోచరమో నీ మాయ అంతే ! ఏమీ అర్ధం కాదు. దీన్ని దాటడం సామాన్యులమైన మా వశమా?
స్వామీ! మేము చేతగాని అనేక అవక తవక పనులు చేస్తూ మళ్ళీ మళ్ళీ ఈ కర్మ బంధాలలో తగులుకుంటూనే ఉన్నాము. నీ నియమానుసారం సంచరించే గాలి ఒక్కోసారి ప్రళయకాల సదృశమై పెనుగాలిగా మారడం నీ మాయ కాదా? సర్వస్వం పెళ్లగించి ఇసుక పాతరలో పూడ్చి పెట్టేయడం నీ మాయ కాదా? నిన్ను ఎదిరించి జయించడం ఎవరికి తరము? మాలాంటి వారికి ఈ ఆటుపోట్లను తట్టుకొని నిలబడే శక్తి ఉంటుందా చెప్పండి అని ప్రార్ధిస్తున్నాడు.
స్వామీ మేము గొప్ప కులంలో జన్మించామని కొందరు, గొప్ప కోటీశ్వరులుగా జన్మించామని కొందరు విర్రవీగుతుంటారు. కానీ ఇదంతా నీవు పన్నిన వుచ్చని తెలుసుకోలేని విధంగా మాయలో చిక్కిపోయాము. తెలుసుకోలేకపోతున్నాము. ఇలాంటి మాయా ప్రపంచంలో నివురుగప్పిన మాయతో జీవిస్తున్నాము. శ్రీ వేంకటేశ్వరా! నీవు మమ్మలను ప్రేమతో చేరదీస్తే ఈ మాయను గెలువగలము కానీ మామూలుగా జయింపవశముగాని మాయ ఇది. కనుక మమ్మలను ఈ మాయలో పడకుండా కాపాడి ముక్తిని ప్రసాదించండి అని అన్నమయ్య ప్రార్ధిస్తున్నాడు.
(భావార్ధం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి సౌజన్యంతో)

Tuesday 12 January 2021

వచ్చిందమ్మా వచ్చిందమ్మా సంక్రాంతి

వచ్చిందమ్మా వచ్చిందమ్మా సంక్రాంతి

పల్లెలలో, పట్టణాలలో అంబారన్నంటే సంబరాలతో
ఆడుతూ పాడుతూ వచ్చిందమ్మా సంక్రాంతి
పల్లె గృహాల ముంగిట్లో తీర్చిదిద్దిన రంగవల్లులతో
బంతిపూల మధ్య గొబ్బెమ్మలతో వచ్చిందమ్మా సంక్రాంతి.
అందమైన గడపలు పసుపు, బొట్టుని అలంకరించుకుని
మామిడి తోరణాల సువాసనతో పులకరిస్తూ వచ్చింది సంక్రాంతి.
హరిదాసుల మేలుకొలుపులతో, డూడూ బసవన్నల విన్యాసాలతో
నింగికెగసే భోగిమంటలతో వచ్చిందమ్మా సంక్రాంతి.
అరిసెల ఘుమఘుమలతో, పూతరేకుల నేతి వాసనలను
అస్వాదిస్తూ అరుదెంచింది సంక్రాంతి.
కొత్త పంట చేతికంది సంతోషంతో రైతన్నలో కలిగిన
ఆనందానుభూతితో కలిసి వచ్చింది సంక్రాంతి.
కోడి పందాలు, కర్ర సాములు గారడీ విద్యలతో
పల్లె ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ వచ్చింది సంక్రాంతి.
పట్టణాలలో అంతస్తుల భవన సంస్కృతిలో ఉన్నా,
అక్కడికీ వచ్చింది సంక్రాంతి సంబరం.
ఇల్లిల్లు శుభ్రపడి, చెత్తా చెదారం భోగిమంటకి ఆహుతి చేసి,
నాగరికత పలకరింపులతో, శుభాకాంక్షలతో వచ్చింది సంక్రాంతి.
గుమ్మాలకి బంతిపూల తోరణాలతో, కళాత్మకంగా అలంకరించుకున్
శొభాయమానంగా ఇంటింటికీ వచ్చింది సంక్రాంతి.
కొత్త కొత్త పిండివంటలు చేసుకుని ఇరుగుపొరుగులకు
పంపకాలతో వచ్చింది సంక్రాంతి.
పేకాట, హౌసీ, అంతాక్షరి వంటి ఆటలతో
అందరికీ అహ్లాదం కలిగిస్తూ వచ్చింది సంక్రాంతి.
.. పొన్నాడ లక్ష్మి

మధుర జ్ఞాపకం

 మధుర జ్ఞాపకం

అవి భువనేశ్వర్ లో మేమున్న రోజులు. తెలుగు సినిమాలు ఉండేవి కావు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి ఒక షో తెలుగు సినిమా వేసేవారు. దానికోసం తాపత్రయంపడి ఎండలో వెళ్ళేవాళ్ళం. అక్కడ అందరు తెలుగువారందరూ కలుస్తారాని ఓ సరదా. ఓసారి అలాగే ఓ ఆదివారం నాడు తెలుగు సినిమాకి వెళ్ళాం. సినిమా అయ్యాక తెలుగు మిత్రులందరితో మాట్లాడి బైక్ మీద ఇంటికి చేరాం. ఇంటికొచ్చి చూసుకుంటే నా చేతి వాచీ లేదు. హాల్లోనో పడిపోయిందో, బైక్ మీద వస్తుంటే దార్లోనే పడిపోయిందో తెలియలేదు. నాకు రిస్టు వాచీ అంటే చాలా ఇష్టం. పాత వాచీ పాడైపోతే మా శ్రీవారు కొత్త వాచీ బహుకరించారు. ఆ వాచీ పోగొట్టుకున్నందుకు చాలా బాధనిపించింది. ఆ రోజు సాయంత్రం ఎదురింట్లో ఉన్న ప్రకాశరావు గారింటికి (ప్రకాశరావు గారు AG office లో Accounts Officer గా పనిచేసేవారు) వెళ్ళి మాటల్లో వాళ్ల అమ్మాయిలతో ఈ విషయం చెప్పాను. మర్నాడు ప్రకాశరావు గారు అఫీసునుండి వస్తూ ‘లక్ష్మీ నీ వాచీ ఎక్కడుందో తెలిసిపోయింది’ అని సంతోషంగా చెప్పారు. మాకేమీ అర్ధం కాలేదు. 12 గం.ల తెలుగు సినిమా షో అయిన తర్వాత, matinee show హిందీ సినిమాకి వచ్చిన ఒక ఒడియా విద్యార్ధి కి తన సీట్లో నా వాచీ కనిపించిందిట. ముందు షో తెలుగు సినిమా అయింది కాబట్టి ఆ వాచీ ఎవరో తెలుగువారిదే అయ్యుంటుందని గ్రహించి అధిక తెలుగువారు పని చేస్తున్న AG office notice board లో వాచీ తనకు దొరికినట్లు, పోగొట్టుకున్నవారు వచ్చి తీసుకోవలసిందిగా తన చిరునామా ఇచ్చి తెలియజేసాడు. ప్రకాశరావు గారు ఆ చిరునామా నాకిచ్చారు. మర్నాడు మా శ్రీవారు అతని ఇంటికి వెళ్ళి విషయం చెప్పారు. ఆ అబ్బాయి ఎన్నొ వివరాలు అడిగి, వాచీ మాదేనని నిర్ధారించుకుని మాకు ఆ వాచీ అందజేశాడు.
అతని సమయస్ఫూర్తి, నిజాయితీ మమ్మల్ని అబ్బురపరచింది. ఆ తర్వాత అతను మంచి స్నేహితుడయ్యాడు. ఈ సంఘటన నేనెప్పటికీ మరచిపోలేని మధుర జ్ఞాపకం !!
- పొన్నాడ లక్ష్మిమధుర జ్ఞాపకం

- పొన్నాడ లక్ష్మి