Wednesday 27 September 2017

దశరా ముచ్చట్లు.




దేవీ నవరాత్రులను దసరా పండగలుగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు,మా చిన్న తనంలో మేమూ ఇంటింటికీ వెళ్ళి పాటలు పాడి గృహస్తులను ఆనందింపజేసేవాళ్ళం. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వాళ్ళం. రంగురంగుల బాణాలు దుకాణాలలో అమ్మేవారు. ఆ బాణాలు పోటీపడి కొనుక్కునేవాళ్ళం.
వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. మచ్చుకు ఈ పద్యం చూడండి
ఏ దయా మీ దయా మా మీద లేదు,
ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,
దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,
ముప్పావలా అయితే ముట్టేది లేదు,
హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవా...దిగ్విజయీభవా
దసరాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అది బొమ్మల కొలువు. మంచి మంచి బొమ్మలను సేకరించి మెట్లమీద అమర్చి, ఇంకా ఎన్నోరకాలుగా అలంకరించి పిల్లల్ని పిలిచి సందడి చేసుకునేవాళ్ళం. ఆ రోజులే వేరు. ఆ ఆనందాలే వేరు.

Friday 15 September 2017

శ్రీవారి ముచ్చట్లు.


స్రీమతి నిర్మలారాణి కవిత.
శ్రీవారి ముచ్చట్లు..!
కొంగుకు కట్టేసుకున్నానని ఆడిపోసుకుంటుంటే అలా మౌనంగా చూస్తావేం..?
పచ్చని పందిట్లో కొంగు ముడి వేసింది మీరేగా..అని నిలదీయరాదా..!
* * *
పెళ్ళాం బెల్లమైందని మూతి విరుస్తుంటే ..బిగుసుకుపోతావేం ?
ఇరవయేళ్ళు నువ్వు 'పెంచితే' .. అరవై ఏళ్ళు అది 'పంచాలని' చెప్పలేవా..!
* * *
సిగరెట్టు పాడు పొగ వద్దని చెవినిల్లు కట్టుకుంటే చిందులేస్తావేం..?
పుట్టింటి ఊసెత్తొద్దదని కట్టడి చేయడం గుర్తుచేసుకోలేవా..!
* * *
మధ్యలో వచ్చిన మందు మానమంటే రాక్షసిని చేసి గింజుకుంటావేం..?
పుట్టుకతో వచ్చిన ఇష్టాలన్నీ నీకోసం తుంగలో తొక్కానని తెలుసుకోలేవా ?
* * *
అలవాట్లు మార్చుకోమని బతిమాలుతుంటే అగచాట్లు పెట్టానని అపనిందలేస్తావేం ?
ఇంటి పేరుతో సహా మార్చుకుంది నీ కష్టాలు పంచుకోవాలనేనని అర్ధం చేసుకోలేవా..!
* * *
ఏడడుగులు నీవెంట నీడలా నడిచి వస్తే ఎగతాళిగ చూస్తావేం?
ఏడేడు జన్మల తోడై గుండెల్లో పెట్టుకొని గుట్టుగా చూసుకోలేవా..!

Sunday 10 September 2017

నిన్ను కొలిచితే చాలు నీఅంతవాని చేతువు! - అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.
నిన్ను కొలిచితే చాలు నీఅంతవాని చేతువు!
పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు !!
భూపతి జేరితే కొంత భూమియ్య నోపుగాని
యేపున ఉన్నతపద మియ్యలేడు
తీపుల నింద్రుని నారాధించితే స్వర్గమే కాని
యే పొద్దు చెడని భోగమియ్యలేడు !!
గరళకంఠు కొలిచితే కైలాస మీనోపుగాని
గరిమ ధృవపట్టము గట్టలేడు!
సరి విరించి కొలిచితే సత్యలోకమేగాని
విరజానది దాటగ వెళ్ళవేయలేడు!!
అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను
నిన్ను ఆశ్రయించక కాన్పించనీదు
కన్నులెదుట శ్రీవేంకటేశ నీ శరణంటే,
యెన్నగా నీవిచ్చే యీవి యెవ్వరూ నీలేరు !!
భావం.. స్వామీ! నిన్ను కొలిచితే చాలు నీ అంతటి వాడిని చేస్తావు. నిశ్చయంగా నీవే బ్రహ్మాది దేవతలకు దిక్కు.
ఈ భూమిని పాలించే రాజుల పంచన చేరితే ఏదో కొంత భూమినిస్తారు కానీ ఉన్నతపదమియ్యలేరు. ఇక ఎంతో ప్రీతితో ఇంద్రుడిని ఆరాధిస్తే స్వర్గభోగాలు ఇస్తాడు, కానీ అవన్నీ ఎంతకాలముంటాయి?
ఆ కైలాసనాథుని కొలిస్తే కాస్త కైలాసంలో చోటిస్తాడేమో, కానీ నీవు ధ్రువుడికి పట్టం కట్టినట్లు శాశ్వత పట్టం కట్ట లేడు కదా! ఇక బ్రహ్మదేవుడిని కొలిస్తే సత్యలోకంలో స్థానాన్ని కల్పిస్తాడేమో కాని, వైకుంఠానికి సమీపంలోని విరజానదిని దాటించలేడు కదా! ఆ నదిని దాటితే ఇక మరుజన్మ లేని శాశ్వతస్థానానికి చేరుకుంటాముకదా!
అన్నింటా నీ మాయాశక్తిని ఆశ్రయించి చూచితేను నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు. కన్నులెదురుగా ఉన్న నిన్ను శరణు వేడితే యెన్నగా నీవిచ్చేవి వేరెవ్వరూ ఇవ్వలేరు. స్వామీ నేవే శరణు అని అన్నమయ్య ఈ కీర్తనలో సుస్పష్టం చేస్తున్నాడు.
ఎవ్వరు ఎన్ని ఇచ్చినా, ఆ శ్రీనివాసుడు ఇచ్చే వాటి ముందు సాటిరావు. అలా ఈలోకంలో కానీ, పైలోకంలో కానీ ఎంతటివారైనా పరిమిత వరాలనే ప్రసాదించగలరనీ, ఉన్నత స్థానాలివ్వాలన్నా, చెడని భోగాలివ్వాలన్నా ఆ భక్తవత్సలుడికే చెల్లునని అన్నమయ్య తీర్మానిస్తున్నాడు.
వ్యాఖ్యానం. శ్రీమతి బి. కృష్ణకుమారి. సేకరణ..పొన్నాడ లక్ష్మి.

Friday 1 September 2017

పుట్టినమొదలు నేను పుణ్యమేమి గాననైతి యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన :
పల్లవి
పుట్టినమొదలు నేను పుణ్యమేమి గాననైతి
యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా
చరణం 1
కామినుల జూచి చూచి కన్నుల గొంతపాపము
వేమరు నిందలు విని వీనుల గొంతపాపము
నామువార గల్లలాడి నాలిక గొంతపాపము
గోమున పాపము మేన గుప్పలాయ నివిగో
చరణం 2
కానిచోట్లకు నేగి కాగిళ్ళ గొంతపాపము
సేవ దానాలందుకొని చేతుల గొంతపాపము
మాననికోపమే పెంచి మతి గొంతపాపము
పూని పాపములే నాలో బోగులాయ నివిగో
చరణం 3
చేసినట్టి వాడగాన చెప్ప నీకు జోటులేదు
దాసుడ నేనైతి గొన దయతలచితివయ్య
యీసరవులెల్ల జూచి యేమని నుతింతు నిన్ను
ఆసల శ్రీవేంకటేశ ఆయబోయ బనులు
తాత్పర్యం :
మానవుడిగా ఈ భూమిమీద పుట్టిన రోజునుండి ఇంతవరకు నేను చేసిన మంచిపనులేమైనా ఉన్నాయా? ఏ మంచిపనులూ చేసెరగని నన్ను ఎలా కాడతేరుస్తావో?
వలపుతో సంబంధంలేకుండ కనబడినవారినెల్ల కామముతో చూసి కన్నులతో కొంత పాపము చేశాను. లోలోపలున్న చెడ్డవాణ్ణి(pervert) తృప్తి పరిచేందుకు చేరకూడని వారితో చేరి వినకూడని మాటలు విని చెవ్వులతో కొంత పాపము చేశాను. నోటిలో ఆవిరెండిపోయేంతవరకు అబద్ధమూ, దుర్భాషణమూ ఆడి నాలుకతో కొంతపాపము చేశాను. ఉన్నదెల్లా లెక్కలేని పాపములతో నింపుకున్న కాయము తప్ప మరోకటి లేదు!
వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి చేరకూడనివారిని కూడి భుజాంతరాల్లో కొంతపాపమంటించుకున్నాను. ఒళ్ళు వంచి పని చేయకపోవడమే కాదు నా పనులనుకూడా నౌకర్లతో చేయించుకుని చేతులకు మట్టంటకుండ చూసుకొని పాపమంటించాను. ఎల్లవేళలా అంతులేని కోపంతో రగిలే మతితో విహరించి మనసుకి పాపమంటించాను. ఇలా పాపుములు నాలో పూని మేనంతా పోగులైయున్నది.
ఎంతవాడైనాగానీ తాను చేసిన అన్ని తప్పులూ తానంతట తాను చెప్పుకోలేడు; దాచేస్తాడు. నేనూ అంతే! ఇన్ని పాపములు చేసినవాడిని నేనే; అన్నీ చెప్పలేకున్నాను. నీకు తెలుసు నేను పాపిని అని. నిన్ను శరణని దాస్యం వేడి వచ్చినరోజు నన్ను క్షమించ దయతలచుకున్నావు! ఇంతటి దయాళుత్వముగల నిన్ను నేను ఏమని నుతించగలనో? నా ప్రియాతి ప్రియమైన శ్రీవెంకటేశా, ప్రపంచంలోని అన్ని క్రియలూ నివలన జరుగునవే!
భావం : Courtesy శ్రీ అవినేని భాస్కర్