Thursday 18 December 2014

పెండ్లి: బృందారకానంద మందార మకరంద



పెండ్లి:
బృందారకానంద మందార మకరంద
          బిందునిష్యందాల విందు పెండ్లి :
రంగారు ముంగారు సరసాంత
          రంగాల సత్యనర్తనము పెండ్లి :
సోగాకన్నులరాణి రాగరంజితపాణి
          రాణించు మాణిక్యవీణ పెండ్లి :
చిన్నారి పొన్నారి చిగురు చెక్కిళ్ళలో
          నవ్వులొల్కు గులాబిపువ్వు పెండ్లి:
ప్రేమతో దేవతలు పెట్టు బిక్ష పెండ్లి :
అక్షయంబైన శ్రీరమరాక్ష పెండ్లి :
వధువు వరుడును “ద్వంద్వ” మై మధువు గ్రోలు
ప్రేమ బృందావనారామసీమ పెండ్లి ::
 ఎంతో మనోహరంగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వివాహ వేడుకను, దాని పరమార్ధాన్ని అభివర్ణించారు.

          ఇంక నేటి వివాహ వ్యవస్త చూద్దాము. పెళ్లికి ముందు  నిశ్చయ తాంబూలాల పేరిట (engagement) ఇంచుమించు పెళ్ళంత హదావుడి, ఖర్చు, అట్టహాసంతో చేస్తున్నారు. అదయ్యాక పెళ్లి అయ్యేలోపల  అమ్మాయి, అబ్బాయి పార్కులు, సినిమాలు, అర్ధరాత్రిదాకా పార్టీలు, పబ్బులూ ఒకటేమిటి అన్ని ఆనందాలూ ముందే !!   పెళ్లికి కళ్యాణమండపాలు, అలంకరణలు, వీడియోలు, ఫోటోలు, మేకప్పులు, అష్టోత్తర (108 రకాల పదార్ధాలు) విందుల తో అట్టహాసంగా, ఆర్భాటంగా, అత్యంత వ్యయంతో జరుగుతున్నాయి. కానీ ఆ వివాహబంధం  ఎన్నాళ్ళు నిలుస్తుందో నిలకడ లేదు. అమ్మాయిల ఆభిజాత్యాలు, అబ్బాయిల ఈగోలు అన్నీకలసి అతి త్వరలోనే తగువులు, న్యాయస్థానాలు, విడాకులు జరిగి కన్నవారికి మనస్తాపాలు కలిగిస్తున్నాయి.
ఓ సినీ కవి వ్రాసిన ఈ పాట (చిత్రం : త్రిశూలం) వినండి. మళ్ళీ ఆ రోజులు వచ్చేనా..?
https://www.youtube.com/watch?v=w7vlqnfH2us
          “పెళ్ళంటే  పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూ
            మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు”


Sunday 14 December 2014

ఇన్నిచదువనేల ఇంత వెదకనేల కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి



సంగీత ప్రపంచంలో ఒక ధ్రువతార వేంకటేశ్వరుని పాదాల చెంతకు చేరింది. అన్నమయ్య కీర్తనలను రచించిన వాడయితే నేదునూరి కృష్ణమూర్తి గారు ఆ కీర్తనలకు స్వరకర్తయై అజరామరమయినాడు. ఆ తిరుమలేశుని భక్తులు ఉన్నంతవరకూ అన్నమయ్య పదాలు, నేదునూరి స్వరాలూ, అవి ఆలపించినవారి గళాలు తెలుగువారిని పులకరిమ్పజేస్తుంటాయి. ఆయనకు దక్కని పద్మాలు తమకు లభించని గౌరవానికి చిన్నబుచ్చుకున్నాయి. ఆ నాదబ్రహ్మ కి  ఇదే నా అశ్రునివాళి. 

ఇన్నిచదువనేల ఇంత వెదకనేల
కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ||

వలెననేదొకమాట వలదనేదొక మాట
సిలుగులీ రెంటికిని చిత్తమే గురియౌను
వలెనంటె బంధము వలదంటె మోక్షము
తెలిసి విజ్ఞానులకు తెరువిది యొకటే ||

పుట్టెడిదొకటే పోయెడిదొకటే
తిట్టమై రెంటికిని దేహమే గురియౌను
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||

పరమనేదొకటే ప్రపంచమొకటే
సిరుల నీరెంటికిని జీవుడే గురియౌను
ఇరవు వేంకటేశుడిహ పరములకర్త
శరణాగతులకెల్ల సతమీతడొకడే ||
భావం:
          ఇన్ని శాస్త్రాలు చదువుకోవడం ఎందుకు? ఇంతగా అన్వేషించడం ఎందుకు?ఒక జీవి కన్ను తెరిస్తే మరొక జీవి కన్ను మూస్తుంది.ఇది అందరికీ తెలిసిన నిజం.
          అవును అనేది ఒక మాట. కాదు అనేది ఒక మాట. ఈ రెంటి మాటలకి మనసే బాధకి గురి అవుతుంది. కావాలి అనుకుంటే బంధాలు ఏర్పడతాయి. ఏదీ వద్దనుకుని పరమాతుడు ఒక్కడే చాలు అనుకుంటే మోక్షం కలుగుతుంది. తెలిసిన విజ్ఞానులకు దారి ఇది ఒకటే.
          పుట్టేది ఒకరయితే పోయేది మరొకరు. రెంటికీ స్థూలాకారం ఒకటే! పుట్టుక సంశయం కాని మరణం నిశ్చయం. వొట్టి విజ్ఞానులకు ఇది ఉపాయం.
          పరమ అనేది ఒకటే. ప్రపంచమూ ఒకటే. ఈ రెండింటికీ జీవుడే గురి అవును. ఇహపరాలు అన్నింటికీ శ్రీ వేంకటేశ్వరుడు ఒక్కడే కర్త. శరణాగతులకు ఈతడే దిక్కు.

Thursday 11 December 2014

సంగీతకళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి నా అశ్రునివాళి.



సంగీతకళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి నా అశ్రునివాళి.
          సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు దివంగతులయ్యారన్న వార్త చాలాబాధ కలిగించింది. వారు కర్నాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన మహా గాయకులు. ఆయన వద్ద  ఎందరో మహానుభావులు శిష్యరికము చేసారు.  మేము విశాఖ వాస్తవ్యులము కావడం మూలాన, ఆయన దర్శనభాగ్యం, వారి కచేరి వినే భాగ్యం మాకు కలిగాయి. మొట్టమొదట్లో రాళ్ళపల్లివారు, నేదినూరి వారు అన్నమయ్య కీర్తనలను స్వరపరచి మనకి అందజేశారు. తిరుపతి దేవస్థానం వారి సహకారంతో అనేక  అన్నమయ్య కీర్తనలను స్వరపరచి, పుస్తకాలను కూడా ముద్రణ చేయించారు. ఆ పుస్తకాలు ఎంతమందికో మార్గదర్శకం  అయ్యాయి. వారు స్వరపరిచిన కీర్తనలలో ముఖ్యమైనది ‘ముద్దుగారే యశోద’ అన్న కీర్తన. ఇది ‘పడమటి సంధ్యారాగం’ అనే సినీమాలోకూడా చిత్రీకరించారు. ఇంకొక కీర్తన ‘పలుకు తేనెల తల్లి’ శ్రీమతి శోభానాయుడు గారు కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించారు. ఇంకా ఎన్నో అన్నమయ్య కీర్తనలు వారు స్వరపరచినవి ఎందరో కళాకారులు గానంచేశారు.
          తెలుగు వారు  మరో మంచి కళాకారుణ్ణి కోల్పోయారు. ఈ మహాగాయకునికి ప్రపంచంలో అన్ని చోట్లా సన్మానాలు, సత్కారాలు జరిగాయి. ఇటువంటి మహోన్నత కళాకారునికి ఎటువంటి కేంద్ర ‘పద్మ’ పురస్కారాలు లభించకపోవడం శోచనీయం. ఇది మన ఆంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అని అనుకోవాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. (పొన్నాడ లక్ష్మి – 8.12.14)

Monday 24 November 2014

అందరి వశమా హరి నెరుగ – కందువగ నొకడు గాని యెరుగడు. - అన్నమయ్య కీర్తన



ప.         అందరి వశమా హరి నెరుగ – కందువగ నొకడు గాని యెరుగడు.
౧.         లలితపు పది గొట్ల నొకడు గాని – కలుగడు శ్రీహరి గని మనగ.
            ఒలిసి తెలియు పుణ్యుల కొట్లలో ఇల నొకడు గాని యెరుగడు హరిని.
౨.         శృతి చదివిన భూసురకోట్లలో – గతియను  హరినే యోకానొకడు,
            అతిఘను లట్టిమహాత్మ కోటిలో – తతి నొకడు గాని తలచడు హరిని.
౩.          తుద కెక్కిన నిత్యుల కొట్లలో – పొదుగు నొకడు తలపున హరిని,
            గుదిగొను హరి భక్తుల కొట్లలో – వెదకు నొకడు శ్రీ వేంకటపతిని.
భావము:
            శ్రీహరిని తెలిసికొనుట అందరికీ వశమా? ఒకానొక విజ్ఞానికి తప్ప పరమాత్ముని తెలుసుకోవడం సాధ్యం కాదు.
            పదికోట్ల మందిలో ఏ ఒక్కడో తప్ప మరెవ్వడూ శ్రీహరిని గుర్తించలేడు. అట్లు గుర్తించిన పుణ్యాత్ములలో ఒక్కడు మాత్రమే హరితత్వమును పూర్తిగా తెలిసినవాడగును.
            వేదములు చదివిన కోట్లకొలది విప్రులలో ‘హరియే గతి’  అని చెప్పువాడు ఒకానొకడు మాత్రమే. అట్లు చెప్పు మహా ఘనులలో ఏ ఒక్కడో తప్ప హరిని  నిక్కముగా మదిలో భావింపడు.
            విద్యావివేకాదులచే ప్రతిష్ఠ గాంచిన నిత్యస్వరూపులైన అనేక జీవులలో తలపున శ్రీ హరిని నిలుపు వాడొక్కడే. అన్నివిధముల అతిశయించిన హరిభక్తుల సమూహములలో శ్రీ వేంకటేశ్వరుని నిజముగా అన్వేషించి కనుగొను వాడెవడో ఒకడే అగును.