Friday 24 March 2017

అన్నమయ్య - Annamayya



నేడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి.
అన్నమయ్య కారణజన్ముడు. 'అన్నం బ్రహ్మేతి వ్యజానాత్'అని శృతి. అన్నమును బ్రహ్మముగా చెప్పుటచే నామమునందే వేదాంతార్ధము కనిపిస్తున్నందున అన్నమయ్య సార్ధకనామధేయుడు. దీనిని బట్టి వేదములు, ఉపనిషత్తులు, పురాణేతిహాసముల యొక్క సారమును భక్తి సంకీర్తనలలో మేళవించి, గానము చేసి సామాన్య ప్రజానీకమునకు వారి భాషలో బ్రహ్మజ్ఞానమును సులభతరముగా సూచించిన మార్గదర్శి అన్నమయ్య.
అన్నమాచార్యులు సంకీర్తనాచార్యుడై వేంకటపతిమీద ముప్పదిరెండు వేల కీర్తనలను రచించి పాడినారు. తిరుమల మొదలుకొని ఊరూరా, వాడ వాడలా 'దేవుడు మెచ్చును లోకము మెచ్చును' అన్నట్లుగ త్రికరణశుధ్ధిగా ఆ తిరుమలేశునిపై పదాలు అల్లి పాడి ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో ఆయా ఊళ్ళలోని దేవుళ్ళను వేనోళ్ళ కీర్తించి, ఆ దేవుళ్ళందరిలోనూ వేనామాలవానిని దర్శించిన ధన్యజీవి అన్నమయ్య.
అన్నమయ్య ఆంధ్రసాహిత్యంలో అపూర్వమైన, అనితరసాధ్యమైన కొత్త పోకడలు ప్రవేశ పెట్టాడు. పద్యసంపదతో మాత్రమే పరిఢవిల్లే ఆంధ్రభారతికి పదసంపద కూడా సమకూర్చి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసాడు. తొలి తెలుగు వాగ్గేయకారుడుగా ఆంధ్రసాహిత్య చరిత్రలో అద్వితీయస్థానమలంకరించాడు. జానపదుల వాడుక భాషకు సాహిత్య గౌరవం కలిగించాడు. సామెతలు, జాతీయాలు, నానుడులు, నూతన పదబంధాలు మొదలయిన వాటిని తన సంకీర్తనల్లో వాడుకున్నాడు. జోల పాటలు, మెల్కొలుపు పాటలు, పెళ్ళీ పాటలు, శోభనపు పాటలు మొదలైనవి తన కీర్తనల్లోప్రవేశ పెట్టాడు.
వాగ్గేయకారులలో దీర్ఘాయుష్మంతుడు, సంచారశీలి, పద్యపదకవితల్ని అభిమానించిన వారలలో అన్నమయ్యకు సాటి మరెవ్వరూ లేరు. ప్రజలమధ్య తిరుగుతూ, ప్రజలకోసం పదాలు పాడినవాడు. అతని రచనల్లో రైతులు, వైద్యులు, కమ్మరి, కుమ్మరి, సాలివాడు, చాకలి, గొల్ల, బొమ్మలాటలాడెవారు ఇతర నిమ్న జాతుల వారెందరో కనిపిస్తారు. వారి జీవనశైలి కళ్ళకు గట్టినట్లు కనిపిస్తుంది. వారి వారి స్వభావాన్ని భక్తికి అనుబంధంగా తీర్చడం అన్నమయ్య గొప్పతనం.
గ్రాంధికభాష తప్పవ్యావహారిక భాషను కవిత్వంలో ఏమాత్రమూ వాడని ఆ రోజుల్లో కూడా పలుచని నవ్వు, పోలయలుకలు, అమ్ముడుబోవు, బచ్చెన మాటలు, మూసిన ముత్యము మొదలైన వాడుక పదాలు గ్రంధస్తం చేసాడు. ప్రజల జీవన విధానం, పలుకుబడులు నిశితంగా గమనిస్తూ, ఎన్నో సంకీర్తనలు రాసిన అన్నమయ్య అమరుడు. అన్నమయ్య కీర్తనలు అజరామరాలు.

Wednesday 22 March 2017

అమ్మకౌగిట పంజరంపు చిలకలా

చేదు జ్ఞాపకంగా మిగిలిన బాల్యం.
అమ్మకౌగిట పంజరంపు చిలకలా నిశ్చింతగా గడిపేది బాల్యం.
నాన్నదగ్గిర గారాలు పోతూ కావలసినవి సమకూర్చుకొనేది బాల్యం

కారణాంతరాలవల్ల తాతగారింట గడపవలసివచ్చిన బాల్యం.
మాతామహుల ఇంట్లో అన్నింటికీ మొహమాటపడుతూ తిరిగే బాల్యం
సహజసిధ్ధమైన అల్లరి చెసి దెబ్బలు తిని అమ్మకోసం ఆక్రోశించిన బాల్యం.
చదువులో వెనకబడి మరిన్ని చివాట్లు తిన్న బాల్యం.
చిరుతిండి యెదయినా ఇంకాస్త తినాలనిపించినా అడగలేని దౌర్భాగ్యపు బాల్యం
రాత్రి అమ్మ చెంగుచాటున ఆదమరచి నిద్రపొవాలని ఆశపడే బాల్యం
ఒంటరిగా నిద్రపోతూ మధ్యలో 'అమ్మా!' అని కలవరిస్తూ ఉలిక్కిపడి లేచే బాల్యం
సెలవుల్లొ అమ్మదగ్గిరకి వెళ్ళాలని ఆత్రపడే బాల్యం.
నాన్నగారి రాకకోసం ఎదురుచూస్తూ క్షణమొక యుగంగా గడిపిన బాల్యం.
ఇంటికెళ్ళి అమ్మ ఒడిలో తలదాల్చుకుని స్వాంతన పొందిన బాల్యం.
బాల్యం అందరికీ మధురస్మృతి అయితే కొందరికి మాత్రం చేదు జ్ఞాపకమే.
నాకు తెలిసిన కొంతమంది బాల్యం జ్ఞప్తికి వచ్చి మనసు కలతపడి,
Mahesh A గారి బంగారు బాల్యం కవిత చదివాక నాలో కలిగిన భావాలు.

భాగ్యశాలి

భాగ్యశాలి.
పూరిగుడిసెలో కాలుష్యవాతావరణంలో
బతుకు బండి లాగుతున్న బడుగుజీవులకన్న,
కన్నెవయసులొ మోసగింపబడి
పడుపువృత్తిలొ కూరుకుపోయిన పతితుల కన్న,
అందమయిన లొకాన్ని చూడలేక
కటిక చీకటిలో అలమటిస్తున్న పుట్టు అంధుల కన్న,
పలుకురాక, మదిలోని భావాలను
తెలుపుకోలేని మూగజీవుల కన్న,
కాలు చేయి లోపంతో పరాన్నభుక్కులుగా
జీవించే అవిటివారి కన్న,
అభిరుచులు పంచుకొని, అండగా నిలిచే
భాగస్వామి లభించని నిర్భాగ్యుల కన్న,
మళ్ళిన వయస్సులో ఆలన పాలన చూసే
కన్నబిడ్డలు లేని అభాగ్యుల కన్న
నేనెంత భాగ్యశాలినో! నాదెంత అదృష్ట జన్మమో!
పొన్నాడ లక్ష్మి.

గతకాల వైభవాలు.

గతకాల వైభవాలు.
వాలుజడలోని మల్లెల సౌరభాలు,
గాజుల గలగలలు, మంజీరాల సవ్వడులు,
మట్టెల మెరుపులు, మాంగళ్యాల తళుకులు,
నుదుటిని కాంతులీను కుంకుమరేఖ,
కలువకనులకు మెరుగుదిద్దు కాటుకరేఖ,
చీరకుచ్చెళ్ళ సోయగాలు, పమిటచెంగు రెపరెపలు,
కళకళలాడే ముఖారవిందాలు.. ఏవితల్లీ..
ఇవన్నీ గతకాల వైభవాలేనా?
విదేశీ సంస్కృతి మోజులో ఫాషన్ పేరుతో
స్వదేశీ సంస్కృతిని అవమాన పరుస్తున్న ఆధునిక మహిళా!
కాలంతొ పాటు మారాలనే నీ ఆలోచన ఆత్మవంచనే కాదా !

- పొన్నాడ లక్ష్మి

ప్రియతమా!

ఒక అత్మీయురాలి ఆవేదనకు స్పందించి రాసిన నా మొదటి కవిత.

ప్రియతమా!
ఒక్కోసారి వెల్లువలా వచ్చి నన్నల్లుకుని అంతులేని అనురాగంలో ముంచెత్తుతావు. 
ఒక్కోసారి అంతులేని దూరానికి నన్ను నెట్టేసి నిర్లిప్తంగా మారిపోతావు.
అప్పుడే నాకు కలుగుతుందో చిన్న సందేహం!
నీమదిలో ‘నేను’ నేను మాత్రమె ఉన్నానుకొంటే అదొక మదురమైన మరపురాని అనుభూతి
వేరొకరు నీ ఆలోచనల్లోనైనా చోటుచేసుకున్నారనిపిస్తే అంతులేని ఆవేదన నాకు.
నిన్ను నిలదీస్తే నాదంతా ఒట్టిభ్రమ అంటావు.
భ్రమే అనుకో! దరిచేర్చుకుని నీ ప్రేమపాశంతో బంధించి లాలించ వచ్చుగా!
కానీ నీలో కనిపించే నిర్లక్ష్యబావన నన్ను నిలువునా దహించివేస్తూంది.
నా సేవలు నిన్ను తృప్తి పరచటం లేదా? నా అనురాగంలో వెలితి కనిపిస్తూందా?
ఏమిటి నా నేరం? ఎందుకు నాకీ శిక్ష!


- పొన్నాడ లక్ష్మి

ముచ్చట్లకి మా ఇంటికి భోజనాలకి మీ ఇంటికి - సామెత

ఒక సామెత.
ముచ్చట్లకి మా ఇంటికి
భోజనాలకి మీ ఇంటికి
వినడానికి హాస్యంగా ఉన్నా ఇందులో కొండంత సత్యం దాగుంది. మాటలకి పరిమితి ఉండదు కదా..ఎంతైనా, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ భోజనాల వ్యవహారం అలా కాదాయే.అక్కడ కొంత శ్రమ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, నవ్వులాటకు చెప్పుకున్నా కొంత వాస్తవం ఉంది. సాధారణంగా పిసినితనం ఉన్నవాళ్ళను ఉద్దేశించి మిగతావారు ఇలాంటి సామెతలను ఉపయోగిస్తుంటారు. ముచ్చట్లకే ముందుంటారు. పని, ఖర్చు అనేసరికి వెనుకడుగు వేస్తారు.

బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే - అన్నమయ్య కీర్తన

బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే
సింగారాలు మీద మీద సేయరే చెలులు.. !!
తట్టుపుణుగుల నూనె తగనిండా నంటుకొని
గట్టిగాఁ కస్తూరి యట కలివెట్టి
మట్టులేని పన్నీట మజ్జనమాడె నిదే
వెట్టదీర నిందరును విసరరె చెలులు.. !!
కప్పురపు గంధవొడి కడు నిట్టె మెత్తుఁకొని
కొప్పుదువ్వి ముడిచెనె గొజ్జెంగలెల్లా
తెప్పలుగా నించుకొనె తిరుమేన సొమ్ములెల్లా
దప్పిదేర విడెమీరే తలకొని చెలులు.. !!
అలమేలుమంగను ఉరమందు నిట్టె నించుకొని
తులసిదండలు మోచె నిలువునను,
చెలరేఁగి యారగించె శ్రీ వేంకటేశ్వరుఁడు
కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు.. !!
బంగారు మేడలలో ఉండే పరమాత్ముడు వాడే. ఓ చెలులారా! స్వామి స్నానానంతరము ఒకదానిమించి ఒకటిగా అతనికి సింగారాలు చేసి అలంకరించండి అంటున్నాడు అన్నమయ్య.
తట్టుపుణుగు నూనెతో కలియబెట్టిన కస్తూరిని దట్టించి, మేని నిండా పట్టించి, నిర్మాల్యమైన పన్నీటితొ మజ్జనమాడేడు.{స్నానం చేసాడు}. ఓ చెలులారా! వెట్టదీర (తాపం ఉపసమించేటట్లు) విసరండమ్మా!
మజ్జనానంతరం కర్పూరగంధముయొక్క పొడిని స్వామి ఒంటిపై మెత్తండి. ఆయన కొప్పు చక్కగా దువ్వి చామంతిపూలతో అలంకరించండి. స్వామి ఒంటిపై తెప్పలుగానున్న ఆభరణాలను అందంగా అలంకరించండి. ఇవన్నీ అయేసరికి దప్పికతో స్వామి నోరెండిపోతుందేమో మరి! పరిమళభరితమైన తాంబూలం అందించండి.
దేవి అలమేల్మంగను తన ఉరముపై ఉంచుకున్న ఆ దేవదేవుడు నిలువెత్తు తులసిదండలు తనపైన ధరించాడు. తరువాత స్వామి కమ్మని ఆరగింపు చేసాడు. ఓ చెలులారా! శ్రీ వేంకటేశ్వరుడు కొలువుతీరి కార్య నిమగ్నుడై ఉన్నాడు. ఆ స్వామిని మధ్య మధ్య మీరు మోహపరవశుని చేసి సేద తీర్చండి.
అన్నమయ్య తన జీవితకాలంలో ఈ సేవలన్ని స్వామికి స్వయంగా చేసి తరించాడు. అదే ఈ కీర్తనలో మనకి విశదీకరించాడు.
- పొన్నాడ లక్ష్మి

నమస్సుమాంజలి - కవిత

నమస్సుమాంజలి.

యౌవ్వన ప్రాంగణంలొ అడుగుపెడుతూ
ఆకాశపు టంచులలో ఆనందంతో ఊగిసలాడాలని ఊహ!
అంధకారపు లోతులలోకి నిస్సహాయంగా జారిపోయిన వాస్తవం.
పచ్చని కాపురం, ప్రియసఖుని అనురాగంలో మునిగితేలాలని కల!
వేధింపులతో సాధింపులతొ తారుమారైన జీవితంలో మిగిలిన పగటి కల.
మాతృమూర్తియై పసిపిల్లల లాలనలో మునిగితేలాలని ఆశ!
నిస్సంతుయై అపనిందలతో తీరని మాతృ వాంఛతో అంతులేని నిరాశ.
సేవాదృక్పథంతో దీనులను తన సేవలతో ఆదుకోవాలని ఆశయం!
అనారోగ్యంతో తనకు తనే భారమై ఇతరుల సహకారంతో వెళ్ళదీసే బ్రతుకు.
అయినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో, ఆశావాదంతో అడుగు ముందుకు వేస్తూ
ఎందరికో స్ఫూర్తినిస్తూ, మరెందరికో వీలయినంత సహాయం చేస్తున్న మహిళలకి
నా హృదయపూర్వక నమస్సుమాంజలి.


- పొన్నాడ లక్ష్మి

Wednesday 15 March 2017

ఉయ్యాలమంచము మీఁదనూఁచి వేసారితిమి - అన్నమయ్య కీర్తన

ఉయ్యాలమంచము మీఁదనూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును !!
చందమాన పాదమాన సతికి వేఁగినదాఁక
ఎందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును !!
పంచసాయకుని పుష్పబాణమాన యిందాక
మంచముపైఁ బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దరంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు !!
వెన్నెలల వేంకటాద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయెను
ఇన్నితాను సంతసిల్లి యీ దేవదేవుని కూడి
మన్ననల యింత(నింత?) లోని మలసీనీ జెలియ. !!
భావము - అన్నమయ్య చెప్పిన ఈ శృంగార కీర్తనలో దేవి చెలికత్తెలు ఏమని వాపోతున్నారో వినండి.
ఈమె ఉయ్యాల మంచము మీద పరుండినా ఈమెకు నిద్ర కరువైనది. ఉయ్యాల ఊచి ఊచి మా చేతులునొచ్చుతున్నవి కాని ఈమె రెప్పలు మూతబడుట లేదు. మూతబడినా అంతలోనే మరల తెరుచును.
చందమామ నింగి లో తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. ఎంతసేపైన ఈమెకు నిదుర రాదు. ఏమి సేతుమే? కర్పూరము మెత్తిన ఇంటిలో గంధము దట్టించిన చంద్రశాలలో ఈ ఇందుముఖి పవళించినా అంతలోనే మేల్కొనుచున్నది.
పంచబాణుడైన మన్మథుని విరిశరములు తాకి ఇప్పటిదాక మంచముపై పవ్వళించి ఏమియు మాట్లాడదు. విప్పారిన వాలుకన్నులు మూతలు పడునని ఆశీంచితే ఆ కన్నులు నీరు గార్చుచున్నవి.
ఓ చెలులారా! ఈ దేవిని చూచి మేమెంత చిరునవ్వులు నవ్వినను చెలి నవ్వదేమి? ఆఖరికి ఆ దేవదేవుడు వెన్నెలలావచ్చి చెలిని కూడినాడు. తనకు లభించిన ఈ మన్ననతో తన స్వామితో పెనగి నవ్వినది.
మౌనంగా, విచారంగా ఉన్న అలమేలుమంగను ఆమె చెలులు ఎన్నివిధాల ఆమెకు సేవ చేసి ఆమెకు సంతొషం కలిగించాలని తాపత్రయ పడుతున్నారో చూడండి. చేతులు నొప్పిపుట్టేలా ఉయ్యాల ఊచుతున్నారు. విరహతాపంతో చెలి వేగిపోతున్నదని తలచి కప్పురపు ఇంటిలో గంధము పూసి ఆమెకు తాపము తగ్గించాలని చూస్తున్నారు. ఎన్ని చేసినా ఆమె ముఖములో నవ్వు లేదు. ఆఖరికి స్వామి రాకతో, అతని కలయికతో ఆమెకు ఎనలేని సంతొషము కలిగిందని అన్నమయ్య అపురూప భావన.

నక్షత్రమాలిక పొడుపు కథ.

నక్షత్రమాలిక పొడుపు కథ.
నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేతబూని నక్షత్ర ప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైన వేసి నాథుని పిల్చెన్
వివరణ.. నక్షత్రము గల చిన్నది 'ఉత్తర' , నక్షత్రము చేతబూని 'భరణి'
నక్షత్ర ప్రభున్ 'చంద్రవంశపు రాజైన అభిమన్యుని' నక్షత్రము పైన వేసి 'హస్త', నక్షత్రమునకు రమ్మని (ఒక పక్కకు) 'మూల' రమ్మని నాధుని పిల్చెన్.
ఉత్తర కుంకుమ భరణి చేతబూని,
కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధమైన తన భర్త చంద్రవంశపు రాజైన అభిమన్యునికి వీర తిలకం దిద్దడానికి
(మూల) ఒక పక్కగా రమ్మని (హస్త)
చేయివేసి భర్తను పిలిచింది.
ఎంత అద్భుతమైన పద్యమో గమనించారా?
సేకరణ..నమిలికొండ సునీత
కామారెడ్డి.

Friday 3 March 2017

ఇంతటనుఁ గరుణించు ఇదె విన్నపము నీకు - అన్నమయ్య కీర్తన

ఇంతటనుఁ గరుణించు ఇదె విన్నపము నీకు
ఇంతి యలమేల్మంగ ఇరవై నీ౩కున్నది.
చేతుల నీరూపు వ్రాసి చెలరేఁగివుండే యాస
గాతల నీ సతి పొద్దుగడపీ నదె
నీతితోడ వీనులను నీ కతలు వినే యాస
రాతిరిఁబగలును బీరము సేసుకున్నది..
తలపోఁతలను నిన్ను దగ్గరి వుండేటి యాస
పెలుచైన దేహము పెంచీ నదె
కలలోనైన నిన్నుఁ గాఁగలించుకొనే యాస
బలువుగాఁ బ్రాణము పట్టుకున్నదదివొ..
యిట్టె నీవు వచ్చేవని యెదురుచూచే యాస
నెట్టుకొని వేడుకతో నిలుచున్నది.
గట్టిగా శ్రీవేంకటేశ కైకొని కూడితి విదె
వొట్టుక నిన్నుఁ బాయక వొద్దికై తానున్నది.
అన్నమయ్య ఈ కీర్తనలో నూతన వధువైన అలమేల్మంగకున్న యెన్నో ఆశలను స్వామికి విన్నవిస్తున్నాడు. అన్నమయ్య అమ్మవారిని తన కూతురిగా భావించి స్వామికి తన విన్నపములను విన్నవించుకుంటున్నాడు. ఆమెను కరుణించ
మంటున్నాడు.
ఈ ఇంతి అలమేల్మంగను ఇంతటితో కరుణించు. ఇదే నా విన్నపము. నీకు అనుకూలవతియై ఆమె ఉన్నదయ్యా!
అరచేతులలొ నీ రూపు వ్రాసుకుని చెలరేగే ఆశలతో నీ గాధలతో పొద్దు గడుపుచున్నది. నియమం తప్పకుండా వీనులవిందుగా నీ కతలను వినాలనే ఆశతో రేయింబవళ్ళు ఆమె శక్తి కూడగట్టుకొని వింటున్నది.
నీ యొక్క తలపులలోనైనా నీకు దగ్గరయ్యే ఆశతో బలహీనపడ్డ దేహముతో నున్నది. నిన్ను కలలోనైనా కౌగలించుకోవాలనే ఆశతో బలవంతాన తన ప్రాణములను నిలుపుకొని, నీకోసం వేచి యున్నది.
ఇదిగో నీవు వచ్చేస్తున్నావనే ఆశతో వేడుకగా నీకోసం నిలుచున్నది. ఓ శ్రీ వేంకటేశ్వరా! నీ చేతులతో ఆమెను స్వీకరించి ఏలిన, ఆమె నిన్ను వీడక ఒద్దికగా నీతోనే ఉండును.
వివాహమయిన తరువాత ఏ కారణం వల్లనయినా ఆడపిల్ల పుట్టింటిలో వుండవలసి వస్తే ఆ కొత్త పెళ్ళికూతురి మనోభావాలను ఆకళింపు చేసుకుంటూ ఒక తండ్రి పడే ఆవేదన ఈ కీర్తనలో అన్నమయ్య మనకి ప్రస్ఫుటింప చేసాడు.
- పొన్నాడ లక్ష్మి

బాల్యం - కవిత


అమ్మకౌగిట పంజరంపు చిలకలా నిశ్చింతగా గడిపేది బాల్యం.
నాన్నదగ్గిర గారాలు పోతూ కావలసినవి సమకూర్చుకొనేది బాల్యం

కారణాంతరాలవల్ల తాతగారింట గడపవలసివచ్చిన బాల్యం.
మాతామహుల ఇంట్లో అన్నింటికీ మొహమాటపడుతూ తిరిగే బాల్యం
సహజసిధ్ధమైన అల్లరి చెసి దెబ్బలు తిని అమ్మకోసం ఆక్రోశించిన బాల్యం.
చదువులో వెనకబడి మరిన్ని చివాట్లు తిన్న బాల్యం.
చిరుతిండి ఏదయినా ఇంకాస్త తినాలనిపించినా అడగలేని దౌర్భాగ్యపు బాల్యం
రాత్రి అమ్మ చెంగుచాటున ఆదమరచి నిద్రపొవాలని ఆశపడే బాల్యం
ఒంటరిగా నిద్రపోతూ మధ్యలో 'అమ్మా!' అని కలవరిస్తూ ఉలిక్కిపడి లేచే బాల్యం
సెలవుల్లొ అమ్మదగ్గిరకి వెళ్ళాలని ఆత్రపడే బాల్యం.
నాన్నగారి రాకకోసం ఎదురుచూస్తూ క్షణమొక యుగంగా గడిపిన బాల్యం.
ఇంటికెళ్ళి అమ్మ ఒడిలో తలదాల్చుకుని స్వాంతన పొందిన బాల్యం.
బాల్యం అందరికీ మధురస్మృతి అయితే కొందరికి మాత్రం చేదు జ్ఞాపకమే.
నాకు తెలిసిన కొంతమంది బాల్యం జ్ఞప్తికి వచ్చి మనసు కలతపడి,
శ్రీ Mahesh A గారి బంగారు బాల్యం కవిత చదివాక నాలో కలిగిన భావాలు.

- పొన్నాడ లక్ష్మి