Monday 26 June 2017

శిరసు వంచకుమిక శ్రీ నరసింహా! నీ సిరులెన్నైనా గలవు శ్రీ నరసింహా! - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన

శిరసు వంచకుమిక శ్రీ నరసింహా! నీ
సిరులెన్నైనా గలవు శ్రీ నరసింహా!

చెలి నీ తొడపై నెక్కె శ్రీ నరసింహా
చెలరేగె నీ మోము శ్రీ నరసింహా
సెలవులు నవ్వు దేరె శ్రీ నరసింహా నీమై
చెలప చెమటలుబ్బె శ్రీ నరసింహా !!

చేరడేసి కన్నుల శ్రీ నరసింహా
చీరుమూరాడీ వలపు శ్రీ నరసింహా
చీరకొంగంటేవేమీ శ్రీ నరసింహా
చేరె నీకు నా మేలు శ్రీ నరసింహా !!

చేవల్లకు వచ్చితివి శ్రీ నరసింహా నా
సేవలెల్లా మెచ్చితివి శ్రీ నరసింహా
శ్రీ వేంకటాద్రి మీది శ్రీ నరసింహా
చేవమీరె నీ వేడుక శ్రీ నరసింహా  !!

తాత్పర్యం.. ఓ నరసింహస్వామీ! ఇక నీ శిరసును వంచకయ్యా! నువ్వు చూడవలసిన కాంతులు, సంపదలు ఎన్నో ఉన్నాయి.
ఓ నరసింహస్వామీ! నీకు ఇష్తమైన చెలి లక్ష్మీదేవి నీ తొడపైకి ఎక్కింది.  అందుకే గామోసు నీ మొగం కాంతితో విజృంభిస్తోంది. అవును స్వామీ నీ పెదవుల మూలలో(సెలవుల) నవ్వులేమిటి? నీ చెంపలమీద  ఆ చెమటలు ఉబ్బిపోతున్నాయి. ఏమిటి కథ?
శ్రీ నరసింహా! నీ కళ్ళు విశాలంగా ఉంటాయి. ఆ పెద్ద కళ్ళు తెరచి నీ వలపుతో చిందరవందర (చీరుమూరాడు) చేస్తున్నావేమిటి? నా చీరకొంగు పట్టుకుంటావేమిటి? నీకు నా మేలు చేరింది కదా.. ఇంకా ఈ వేషాలేమిటి?
ఓ నరసింహా! నా సమీపానికి చేతికి అందేటట్లు వచ్చావు. తమరికి చేసుకున్న అన్ని రకాల సేవలను మెచ్చు కొన్నావు. శ్రీ వేంకట పర్వతముపై వెలసిన శ్రీ నరసింహా! నీ వేడుక హద్దుమీరి పోతూంది.
అన్నమయ్య వేంకటేశుని తర్వాత నరసింహస్వామిపై ఎక్కువ కీర్తనలు వ్రాసాడు. నరసింహుని రూపాలలొ లక్ష్మీ నరసింహ రూపము  చాలా ప్రసిధ్ధమైనది. ధర్మపురి, అంతర్వేది, యాదగిరి, సింహాచలం, వాడపల్లి, మంగళగిరి - ఇలా తెలుగు రాష్త్రాలలో లక్శ్మీ నరసింహస్వామి దేవాలయాలు ఎన్నో చూసి పట్టలేని ఆనందంతో అన్నమయ్య ఇటువంటి కీర్తనలు ఎన్నో రచించాడు. ఒకో కీర్తనలో ఒకో రకంగా నరసింహస్వామిని వర్ణించాడు.

చారు





‘చారు’ అంటే పూర్తిగా ఆంధ్రులదే అని చెప్పుకోవాలి. కొంచెం చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారు చేసే ఆరోగ్యకరమయిన, రుచికరమయిన వంట ‘చారు’! ఎన్ని వంటాకాలున్న ఆఖరికి మజ్జిగా అన్నం ముందు చారు అన్నం తిననిదే భోజనం పూర్తి అయినట్లు అనిపించదు.

ఓ సారి సినారె గారు అమెరికా వెళ్ళినప్పుడు వారి బంధువుల ఇంట్లో భోజనాల సమయంలో ‘రైస్’, ‘కర్రీ’. ‘కర్డ్’ వంటి ఆంగ్ల పదాలే వినిపించాయిట! ఒక్కటయినా తెలుగు పదం వినిపిస్తుందా అని రెడ్డి గారు ఆలోచిస్తూ వుంటే ఆ ఇంటి వాళ్ళ పాప ‘చారు’ అని అడిగిందట. ‘హమ్మయ్య, చాలు’ అనుకున్నారట. అన్నింటికీ పరభాషా పదాలు ఉన్నాయిగాని మన తెలుగింటి వంటకం ‘చారు’ కి మాత్రం లేదు.

చారుల్లో కూడ పప్పు చారు, టమాటో చారు, ఉలవ చారు, నిమ్మకాయ చారు, మిరియాల చారు, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. జలుబు చేసినప్పుడు మిరియాల చారు ఘాటుగా గొంతు దిగుతూ ఉంటే ఎంతో ఉపశమనంగా వుంటుంది. ఎక్కడయినా రెండు రోజులు విందు భోజనం చేసి ఇంటికి వచ్చాక కమ్మగా కొంచెం చారు అన్నం తింటే ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది. చారుకి పోపు వేస్తె ఇల్లంతా ఆ ఘుమఘుమలే .. !! ఇంక కుంపటిమీద సత్తుగిన్నెలో కాచిన ‘ఆ రుచే వారు’ అంటారు బాపు గారు.. ఆ అనుభూతి ఆస్వాదిస్తేనే తెలుస్తుంది.

చాలామంది తెలుగువారికి చారంటే మహా ఇష్టం .. మా చిన్ని మనవరాలికి కూడానూ. ‘చారే కదా’ అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు కొందరు. అది కూడా కొందరి చేతిలోనే రుచి పడుతుంది సుమండీ!

మాత్రుహీన శిశుజీవనం వృధా, కాంతహీన నవయవ్వనం వృధా,
శాన్తిహీనతపసః ఫలం వృధా, తింత్రిణీరస విహీన భోజనం !!
తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం, శాంతం లేని ఋషి తపస్సు ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం అని పై శ్లోకానికి అర్ధం.

ఇంతటి మహత్తరమయిన చారు అంటే కొందరికి ఎందుకో చులకన?
.. పొన్నాడ లక్ష్మి

Thursday 8 June 2017

మాయగాడు - కవిత

కవిత..

నీలో కలదురా ఏదో మాయ.
నీకు తెలియదురా నువ్వెంత మాయగాడివో
నిన్ను తలచినంతనే ఉప్పొంగును నామది
నీ ధ్యాసే నా శ్వాస ఆయెనురా
మెరుపు కాంతులు కలవురా నీ కనులలో
కన్ను కలిపినంతనె మైకమే కమ్మునురా
నీ చేయి తాకగానే  పులకరించు నా మేను
నీ మధుర స్పర్శతో వింత హాయి కలిగెరా
నీ మాటలలో కలదురా మంత్రశక్తియేదో
పెదవి కదపజాలక ముగ్ధురాలినౌదురా
నీ చిరునవ్వులలో విరిసిన వెన్నెల
నిదుర రానీయక రేయంతా తికమక పరచేనురా
ఇంత ఆకర్షణ నా ఒక్కడి సొత్తీ అని నువ్వంటే
అదంతా నాభాగ్యమేనని నేనంటానురా.
- పొన్నాడ లక్ష్మి

నీవే సేసిన చేత - నీవే చేకొనుటింతే - అన్నమయ్య కీర్తన.

నీవే సేసిన చేత  - నీవే చేకొనుటింతే
ఈవల నీ సొమ్ము నీకే  - యియ్య సిగ్గయ్యీ నయ్యా!

ఆలుబిడ్డలఁగని - యటు దన మగనికి
సీలాన సమర్పణము నేయవలె నటయ్యా,
తాలిమి బుణ్యాలు సేసి - దైవమా నే నీకు
యే లీల సమర్పించే - విందుకే నవ్వు వచ్చీనయ్యా!

అంకెల గన్నకొడు - కటు దమ తండ్రికిని
తెంకి నీ వాడవని - తెలుపఁగవలె నటనయ్యా,
నా లోపల నున్న లక్ష్మీశ నే నీకు
పొంకపు నీ బంటనన్న - బునరు క్తయ్యీ నయ్యా!

తన నీడ యద్దములోఁ - దానె యటు చూచి
పనివడి ఊరకే - భ్రమయువలె నటయ్యా,
అనుగు శ్రీ వేంకటేశ! - ఆతుమలోనున్న నిన్ను
గని మని శరణంటిఁ - గడఁ బూజించనేలయ్యా!

దేవా! నే నొనర్చు పనులన్నియు నీ ప్రేరణచే కలిగినవే. నా స్వరూపముకూడ నీ కల్పనయే. నీ వస్తువులను నీవే చేకొనవలను గాని ఇతరులు నీకీయవలసిన పనిలేదు. కాబట్టి నీ సొమ్మును నీకు సమర్పించవలసి వచ్చినందుకు నేను మిక్కిలి సిగ్గుపడుతున్నానయ్యా!

సతి పతితో కాపురముచేసి బిడ్డలను కన్నది. ఇక ఆ బిడ్డలు ఆయనకు చెందినవారే కదా! ఈ బిడ్డలను నీకు సమర్పించుచున్నాను అని ఆమె వారి నతనికర్పించవలెనా?   దేవా! నేనెన్నొ పుణ్యకార్యములు నీ ప్రేరణచే చేయుచున్నాను.  అవి నీకు చెందినవే గాని నావి కావు. నీ పుణ్యములను మరల నీకే నేనెట్లు సమర్పింపగలను? ఈ వింతపనికే నాకు నవ్వు వచ్చుచున్నదయ్యా!

తండ్రిచెంత నున్న కొడుకు ఆయనతో 'నేను నీ కుమారుడను' అని తెలుపుకొనవలసిన పని ఏమున్నది? నాహృదయములో ప్రభువువై నన్నేలుచున్న లక్ష్మీశ్వరా!నేను నీకు పొందికైన బంటునని వేరే చెప్పుకొనవలెనా? అట్ట్లు చెప్పినచో అది పునరుక్తియే కదా!

తన నీడను తానే అద్దములో చూచుకొని ఎవరో మరొకరు అందున్నారని ఊరక భ్రమపడుట తగునా?  ఓ ప్రియమైన శ్రీ వేంకటేశ్వరా! నా అత్మలో నీవున్నావు.  నిన్నుజూచి ఆనందించి  నీకు నేను శరణాగతుడనైతిని.  మరల ప్రత్ర్యేకముగా నీవెందో ఉన్నావని తలచి అక్కడ నీకు పూజలొనర్చ వలెనా?

జీవులు స్వతంత్రులు  కారు. జీవులొనర్చు సత్కర్మలు దేవుని ప్రేరణాఫలములే.. అందరి హృదయపీఠముల నధిష్ఠించిన ప్రభువు ఆ పరమాత్ముడొక్కడే. కావున సర్వదా భగవత్భావనతో జీవుడు పవిత్రుడు కావలెను. అని అన్నమయ్య భావము.

వ్యాఖ్యానంః సముద్రాల లక్ష్మణయ్య. ఎం.ఏ.      సేకరణః పొన్నాడ లక్ష్మి.

ఉగాది ఆగమనం.


నూత్న శోభలతో ఆశాదీపం వెలిగిస్తూ
మళ్ళీ వచ్చింది ఉగాది
మావిచిగురు తిని కోకిలమ్మ పాడే తియ్యని రాగాలు
ఆమని  రాకతొ పరవశించిన ప్రకృతి కాంత సోయగాలు
అందాలుచిందే పూలబాలల కమ్మని పరిమళాలు
జీవితంలో వివిధ అనుభవాలకు సంకేతంగా ,
కొత్తబెల్లం తీపి, వెపపువ్వు చేదు, పిందెమామిడి వగరు,
కొత్త చింత పులుపు, కాస్త ఉప్పు కారంతో షడ్రుచుల ఉగాదిపచ్చడిని
ఆరగించి ఆనందంగా ఆహ్వానిద్దాం 'హేవళంబి' ని,
ఆశిద్దాం అందరికీ మంచే జరుగుతుందని.

వెర్రి దెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్టు - అన్నమయ్య కీర్తన.


వెర్రి దెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్టు
ఇర్రి దీము భోగముల నెనసేము

మురికిదేహము మోచి మూలల సిగ్గుపడక
పొరి బరిమళములు పూసేము
పరగ పునుకుతల పావనము సేసేమంటా
నిరతితోడ దినము నీట ముంచేము

పుక్కిట పంచేంద్రియపు పుట్టు పుట్టి యందరిలో
మొక్కించుక దొరలమై మురిసేము
అక్కరనజ్ఞానమనే అంధకారమున నుండి
దిక్కుల నెదిరి వారి దెలిపేము.

దినసంసారమే మాకు దేవుడని కొలుచుక
వెనుకొని ఘనముక్తి వెదకేము
యెనలేక శ్రీ వేంకటేశ! మమ్ము గావగాను
 తనిసి తొల్లిటిపాటు దలచేము.

ఒకతనికి వెర్రి(పిచ్చి) బాగా వచ్చింది. నాకు వెర్రి తగ్గిపోయిందని అతగాడు చెపుతూ - రోకలిని తలకు చుట్టమన్నాట్ట. అంటే వాడి వెర్రి ఏ మాత్రం తగ్గలేదని అందరికీ స్పష్టమౌతుంది. వెర్రి తగ్గితే రోకలిని తలకు చుట్టమంటాడా?

ఆ రకంగానే ఓ వేంకటేశా! మేము కూడా ఈ లోకంలో ఎండమావుల్లాంటి భోగాలకోసం తెగ తాపత్రయపడతాం. ఎండమావుల్లో నీరు కనబడుతుంది కానీ అంతా భ్రాంతి. అలాగే మా భోగాల్లో సుఖమనే భ్రాంతి కనబడుతుంది. ప్రతీ భోగం ఈ శరీరానికి కొంతకాలానికి దుఃఖ కారణమే. కనుసైగ చేస్తే చాలు పదులకొద్దీ సేవకులుండే భోగము. కానీ అలాగే కూర్చొని సేవలందుకొంటుంటే ఊబకాయం, రక్తప్రసరణ సమస్యలు .. ఇలా ఎన్నో.. ఈ రకంగా ప్రతీభోగం కూడా రాను రానూ దుఃఖాంతమే కాబట్టి భోగాన్ని ఎండమావితో పోల్చాడు అన్నమయ్య.

వేంకటేశా! ఈ మురికి శరీరాన్ని మోస్తూ, అసహ్యం లేకుండా శరీరపు మూలలలో బాగా సువాసనలు, సుగంధ ద్రవ్యాలు దట్టిస్తాం. ఈ తలపుర్రెను (కపాలాన్ని) బాగా అలంకరిస్తాము. ఎంతో ఆసక్తితో ప్రతిరోజు నీటిలో ముంచుతాము. (ఠపీమని పేలిపోయే ఈ కపాలానికి తలంటి పోసి,  సుగంధపు నూనెల మర్దనలు చేసి చక్కగా అలంకరిస్తామని అన్నమయ్య భావన).

కన్ను, ముక్కు, చెవి మొదలైన అయిదు ఇంద్రియాల శక్తిని వ్యర్ధం చేసుకుంటున్న జన్మ పొందాము. ఇతరులచేత దండాలు పెట్టించుకొని మేము పెద్దదొరలమని మురిసిపోతుంటాము. కోరికలతో అజ్ఞానమనే చీటిలో ఉండి ఇతరులకు పెద్ద తెలిసినవాళ్ళలా నీతులు చెపుతుంటాము. మనకే అంతా తెలుసునని గర్వం అజ్ఞానం

వేంకటేశ్వరా! ప్రతిరోజూ చేసే సంసారంలోనే నువ్వు దేవుడవని కొలిచి ముక్తిని పొందకుండా గొప్ప ముక్తి ఎక్కడో ఉన్నదని వెతుకుతుంటాము. సాటిలేని విధంగా నీవు మమ్మల్ని రక్షిస్తుంటే  పూర్వజన్మ పాపాలను తలుచుకుంటూ కుములిపోతుంటాము. ఏ కష్టం వచ్చినా స్వామీ! నీదే భారమని ఆయనను శరణు పొందాలని అన్నమయ్య భావన.

(అన్నమయ్య మృగతృష్ణ (ఎండమావి) కి తెలుగులో ఇర్రి దీము అని పేరు పెట్టాడు. మృగానికి ఇర్రి అని పేరు ఉంది. కనుక మృగతృష్ణ ని అన్నమయ్య 'ఇర్రి దీము' అన్నాడు).

వ్యాఖ్యానం.. డా. తాడేపల్లి పతంజలి. సేకరణః పొన్నాడ లక్ష్మి.

తొలి వలపు









తొలివలపు.

పదహారేళ్ళ ప్రాయంలో ఊహాతరంగాలలో తేలిపోతున్న తరుణంలో
మలయమారుతంలా నా జీవితంలోకి ప్రవేశించావు.
నీ చిలిపిమాటలతో, అల్లరిచేష్టలతో, నను కవ్వించి
నా అందమైన మనస్సుని దోచేసుకున్నావు.
నీ ప్రేమలేఖలకోసం ఆరాటంతో ఎదురుచూపులు
నీ రాకకోసం  వీధిగుమ్మం దగ్గిర పడిగాపులు.
తీరా నీ దర్శనభాగ్యం కలిగేసరికి,
తమకంతో నోట మాటే రాదు వింతగా..
అనురాగపూరితమైన నీ చూపులతో చూపులు కలిసితే
పరిసరాలను సైతం గుర్తించని మైమరపు.
నీతో పంచుకున్న ఊసులు, చేసుకున్న బాసలు,
నీ భుజంపై తలవాల్చి సేదతీరిన క్షణాలు
ఒళ్ళంతా పులకరింత, మనసంతా గిలిగింత
అన్ని నిత్యనూతనంగా నా మదిలొ నిలిచిపోయిన
మధురానుభూతులు.
నీ ప్రణయ సామ్రాజ్యానికి రాణిని నేను,
నా పరిపూర్ణ జీవనసాఫల్యానివి నీవు.

ఇష్టమున్నచోట కష్టముండదు.



ఇష్టమున్నచోట కష్టముండదు.
కష్టమైనా ఇష్టముంటే అవలీలగా చేయగలం.
చేయ్యాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే చెయ్యలేకపోము.
అసలు కొంతమంది అభ్యర్ధనల మీద అయిష్టత ఎందుకు కలుగుతుందో?
చిన్న చిన్న ఇష్టాలను తీర్చడానికి కూడా మనస్సు అంగీకరించదెందుకో?
ఎక్కడో, ఎప్పుడో పరిచయమైన వారి పట్ల అత్యంత శ్రధ్ధ కనుపరుస్తాము.
 నిత్యం నీ వెన్నంటే ఉండి, నీ అవసరానిలన్నీ తీర్చే నీ వారి పట్ల మాత్రం
                         ఎందుకో నిర్లక్ష్యం.
మనసుకు నచ్చినవారిని ఆనందపరచి సంతృప్తి పొందుతాము కానీ
నిన్ను ఆరాధించి,  ప్రోత్సహించే నీ వారిని మాత్రం విస్మరిస్తాము.

తాపలేక మేడలెక్క దలచేము - అన్నమయ్య కీర్తన.


తాపలేక  మేడలెక్క దలచేము
ఏపులేని చిత్తముతో ఈహీహీ నేము.

ఎరుకమాలినబుధ్ధి యెవ్వరైనా బతులంటా
తెర గెరగక వీధి దిరిగేము
 పర చైన జవరాలు పరులెల్లా మగలంటా
వొరపు నిలిపిన ట్లోహోహో నేము.

యిందరును హితులంటా యెందైనా సుఖమంటా
పొందలేని బాధ బొరలేము
మందమతివారు ఎండమావులు చెరువులంటా
అందునిందు తిరిగిన ట్లాహా హా నేము.

మేటి వెంకటేశుబాసి మీద మీద జవులంటా
నాటకపు తెరువులు నడిచేము.
గూటిలో దవ్వులవాడు కొండలెల్ల నునుపంటా
యేటవెట్టి యేగిన ట్లీ హీ హీ నేము.

ఓ వేంకటేశా! మేము - మెట్లు లేకుండానే మేడలు ఎక్కదలుచుకొనే తెలివి తక్కువవాళ్ళం. ముందు ఏమి జరుగుతుందో అనే బాధ మనస్సులో కొంఛెం కూడా లేకుండా ఇహిహి (నవ్వునందు అనుకరణ ద్వని, వెకిలి నవ్వు) అని నవ్వుతూ ఉంటాము.
తెలివి కొంచెం కూడా లేకుండా, చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎవరికయినా బదులు (మాటకి మాట) చెపుతూ మార్గమేదో తెలియక వీధులలో తిరుగుతుంటాము. ఓ హో హో ! ఇది ఎట్లా ఉందంటే కులట అయిన పడుచు స్త్రీ పరాయిమగవాళ్ళను  తన భర్తలుగా విలాసంతో  నిలిపినట్లు ఉంది.(ఆ ధూర్తురాలికి ఉచ్ఛనీచాలు ఎలా తెలియవో మాకు కూడా ఎవరితో ఎలా మెలగాలో తెలియదని భావం)
వీరందరూ నా మేలుకోరేవారు అనుకుంటూ, ఎక్కడయినా  సుఖము ఉందని భావిస్తూ కలుగకూడని, పొందకూడని బాధలలో పొర్లుతుంటాము. ఆ హా హా! తెలివితక్కువవాడు ఎండమావులను చూచి చెరువులనుకొని భ్రాంతితో అటు నిటు తిరిగినట్లు మేము కూడా సుఖాల భ్రాంతిలో తిరుగుతుంటాము.
గొప్పవాడయిన వేంకటేశ్వరుని విడిచిపెట్టి ఇంకా ఇంకా రాను రాను ఏవో రుచులున్నాయని భావిస్తూ అసత్యపు మార్గాలలో నడుస్తూ ఉంటాము. ఇహిహి!(నవ్వుత యందు అనుకరణ ద్వని) దూరంగా ఉన్న కొండలన్నీ నునుపని తలచుచూ గూట్లో ఉన్న దీపంలో వాటిని చూస్తూ ఆనందిస్తూంటాము. (గూట్లో ఉన్న దీపంతో  దూరంగా ఉన్న కొండలను చూస్తే అవి నునుపుగా కనిపిస్తాయి).
ఈ అసత్యపు మార్గాలకు మన జీవితాలను బలిపెట్టి (ఏటవెట్టి) ఆ మార్గాలలో మనం వెళ్ళిపోతుంటాము. దగ్గరగా ఉన్న  గొప్పవాడయిన వేంకటేశ్వరుని  విడిచిపెట్టామని అన్నమయ్య ఆవేదన.

చాలు చాలు నీ జాజర నన్ను - జాలి బరచె నీ జాజర. - అన్నమయ్య కీర్తన.


చాలు చాలు నీ జాజర నన్ను - జాలి బరచె నీ జాజర. ॥
వలపు వేదనల వాడెను యీ - తలనొప్పులచే దలకేను
పులకల మేనితో బొరలేను కడు - కలిగొని చల్లకు జాజర ॥
ఒల్లని నినుగని వుడికేను నీ - చిల్లర చేతల జిమిడేను
కల్ల గందవొడి గా గేనుపై - జల్లకు చల్లకు జాజర. ॥
తివిరి వేంకటాధిప నేను నీ - కవుగిట కబ్బితిగడు నేను
రవ రవ చెమట గరగినేడు యిదె - చవులాయెను నీ జాజర ॥
వేంకటేశునితో ఆత్మీయత పెంచుకొనే మధురభక్తి అనే రహదారిలో అన్నమయ్య ఒక నాయకిగా మారిపోయాడు.
ఆయనతో మాటలతో ఆడుకొన్నాడు, పాడుకొన్నాడు. చివరలో ఆయనలో తాను కరిగిపోతున్నానని మురిసిపోయాడు. దేవునితో ఆత్మీయంగా మసలగలిగితే ఆయనలో ఐక్యమయిపోవడం ఎంత సులువో నిరూపించాడు.
బాబూ! తిరుపతి సామీ! నీ జాజర చాలు. జాజర అంటే ఏమిటో తెలియనట్టు అడుగుతున్నావా? జాజర అంటే మోసం, వంచన. నీకు అలవాటయిందే కదా స్వామీ! నీ జాజర నన్ను దుఃఖ పెట్టింది, బాధ పెట్టింది. ఇక చాల్లే..
వలపు వేదనలతో వాడిపోతున్నాను. ఇదివరకు ఎంత కాంతిగా ఉండేదాన్నో.. తమరు చేసిన తలనొప్పు పనులతో వణికిపోతున్నాను. ముందు ముందు ఇంకా ఎలాంటి వేషాలు వేస్తావో అని భయపడి పోతున్నాను. నా ఖర్మ! నా మటుకు నేను అంటూనే ఉంటాను. దొంగ వేషాలు వేసి నన్ను కౌగలించుకొని పారిపోతావు. ఆ తరువాత ఆ పులకరింతలు ఆగి చావవు. నీకు దూరమై ఈ పులకల శరీరంతో పక్కమీద అటూ, ఇటూ దొర్లుతున్నాను.
సరిగ్గా ఇప్పుడే సమయం కుదిరిందా నీకు? అతిశయించిన ఉత్సాహంతో జాజర -రంగుల ఉత్సవం - చల్లుతావేమిటీ?
నీ తప్పులు క్షమించి దగ్గరకు నీ పక్కకు వచ్చినా నన్ను ఒల్లవు. ఇష్టపడవు. అలాంటి నిన్ను చూసి ఉడికిపోతున్నాను, ఏమనుకున్నావో? కనపడకుండా ఎన్ని చిన్ని చిన్ని పనులు చేస్తావో నా తండ్రీ! నీ చిల్లర చేతలు ఎవరికీ చెప్పుకోలేక సిగ్గుతో చితికిపోతున్నాను.
గంధపుపొడి చల్లుతావేమిటి? అది నీ అబధ్ధాల సుగంధము కలిపిన గంధపు పొడి. అది మీద పడుతుంటే చల్లదనం కాదు. ఒళ్ళు మండిపోతూంది. ఆ గంధపు పొడి మీద చల్లకు.
ఓ వేంకటాచలపతీ! ఇదుగో! ఈ రోజు నీ కౌగిలిలో చెమటలు మిల మిలా మెరిసిపోతుండగా కరిగిపోయాను. ఆలోచించి ప్రయత్నపూర్వకముగా త్వరపడి, నేను నీ కౌగిలిని దక్కించుకున్నాను. ఇందాకటినుంచి ఏదో అన్నాను కానీ - ఏమనుకోకు. నీ చేతలు, రంగులు చల్లే ఉత్తుత్తి మోసాల కార్యక్రమం బాగానే ఉంది.
మహిళల మనసుని అన్నమయ్య ఎంతబాగా అర్ధం చేసుకున్నాడో చూడండి.
సంకలనం, వ్యాఖ్యానం డా॥ తాడేపల్లి పతంజలి గారు
 సేకరణః పొన్నాడ లక్హ్మి