Friday 30 May 2014



ఈ వారం అన్నమయ్య కీర్తన :
ఇన్ని చేతలకు నిది యొకటే  -  కన్నా మనసిది కానదుగాని .
పాతక కోటులు భవములు  భస్మి  భూతము సేయగ  బొడ ఒకటే    
శ్రీ  తరుణీపతి   చింత  నిజముగా ఏతరి  చిత్తం  బెరుగదు గాని
మరణ  భయంబులు మదములు మలినీ కరణము సేయగా గలదొకటే
హరినామామృత మందు మీదిరతి నిరతము నాకిది నిలువదు గాని.
కుతిలములును దుర్గుణములును  తృణీకృతములు సేయగ గురుతొకటే
పతియగు వేంకటపతి సేవారతి గతియని మతి గని కానదు గాని.
 భావం :
మనం చేయబోయే పనులన్నిటిని నెరవేర్చుటకు భక్తీ యొక్కటే సరి అయిన మార్గము. ఈ సంగతి తెలిసినను తెలియనట్లు మనసు ప్రవర్తించును.
కోట్లకొలది పాపములను దహించుటకు సాధనము లక్ష్మీపతి ధ్యానం ఒకటే కలదు. కానీ ఈ దుష్ట చిత్తము ఈ విషయమును గుర్తింపకున్నది.
మృత్యు భయము, వయస్సు,ధనము, కులము మొదలగు మదములను రూపుమాపుటకు తగిన సాధనం విష్ణు నామామృతం ఒకటే. కాని ఎల్ల వేళల ఆ అమృతమును ఆస్వాదించుటకు ఆసక్తి ఉండుటలేదు.
పలుబాధలను, దుర్గుణములను తృణీకరించుటకు  ఉపాయమోకటే కలదు. అది త్రిలోకాధిపతి అయిన శ్రీ వేంకటేశ్వరుని యెడల సేవారతి ఉండడమే. కానీ ఈ మనసుకు మాత్రము తెలిసియు తెలియనట్లుండును
భగవచ్చింతన వలన పాపములు భయములు భస్మములగును. హరి నామామృత పానముచే  మరణభీతి, మదములు తొలగును. శ్రీ వేంకటేశ్వరుని సేవచే బాధలు, దుర్గుణములు  పరిహరింప బడును. అని అన్నమయ్య ఈ కీర్తనలో విశదీకరించాడు.







Tuesday 20 May 2014

ఆవకాయలు - అభిరుచులు

ఆవకాయలు – అభిరుచులు
.
నిన్నటితో  ఆవకాయల ప్రహసనం ముగిసింది. ఇరవై రోజులనుంచి అదేపని.

మధ్య గిన్నెలో ఉన్న ఆవకాయ తూర్పు ఆంధ్రా వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు. ఎండపెట్టి చేస్తారు. అందుకే ఎండావకాయ అంటారు. ఎన్నాళ్ళయినా నిలవ ఉంటుంది. ఇది నాకు, మా మరిదికి, పిల్లలకి చాల ఇష్టం.

ఓ  చిన్న గిన్నెలో ఉన్నది పచ్చి ఆవకాయ. దీన్నే పుల్లావకాయ అంటారు. పుల్ల మామిడికాయ వాడతామేమో పిండి పుల్లగా ఉండి అన్నంలో కలుపుకుంటే భలే రుచిగా ఉంటుంది. దానికి తోడు మామిడిపండు గాని, కమ్మటి పెరుగు గాని నంజుకుంటే భలే రంజుగా ఉంటుంది. ఇది మా అల్లుళ్ళకి, మాకు కూడా చాలా ఇష్టం.

ఇంకొక గిన్నేలోనిది  బెల్లం ఆవకాయ. తియ్యగా ఉండి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. మా చిన్ని మనవలకోసం ఇది
.
ఇంకొకటి మసాలా ఆవకాయ. కొంచెం మసాలా వాసనవేస్తూ స్నాక్స్ లో, ఉప్మాలో నంజుకుందికి  చాలా  బాగుంటుంది. మా అబ్బాయికి చాలా ఇష్టం.

మరొకటి తొక్కుడు పచ్చడి. ఇదొక రుచి. అన్నంలో కలుపుకుని ఉల్లిపాయ నంజుకు తింటే భలే బాగుంటుంది. మా శ్రీవారికి చాలా  ఇష్టం.


 పైన చెప్పినవన్నీ  మా కోడలికి మా అమ్మాయిలకీ కూడా  చెప్పలేనంత ఇష్టం!! 

Saturday 17 May 2014

భక్తీ నీపై దొకటె – పరమ సుఖము. యుక్తి చూచిన నిజం – బొక్కటే (టీ ?) లేదు. - అన్నమయ్య కీర్తన

17.05.2014.  ఈ వారం అన్నమయ్య కీర్తన :
భక్తీ నీపై దొకటె – పరమ సుఖము.   యుక్తి చూచిన నిజం – బొక్కటే (టీ ?) లేదు.
కులమెంత గలిగె నది - కూడించు గర్వంబు.   చలమెంత గలిగెనది – జగడమే రేచు.
తలపెంత పెంచినా – దగిలించు కోరికలు .  ఎలమి విజ్ఞానంబు యేమిటా లేదు.
ధనమెంత గలిగె నది – దట్టమౌ లోభంబు  -  మొనయ చక్కదనంబు – మొహములు రేచు.
ఘనవిద్య కలిగినను – కప్పు పై పై మదము  -  ఎనయంగ బరమపద – మించుకయు లేదు.
తరుణు లెందరు అయిన – తాపములు సమకూడు  -  సిరు లెన్ని కలిగినను – చింతలే పెరుగు.
ఇరవయిన శ్రీ వేంక – టేశ ! నిను గొలువగా  -  బెళకు లిక లేవు.
భావము :
దేవా ! నీపై గల భక్తీ ఒక్కటే నిజమైన సుఖము కలిగించునది. యెంత తరచి చూచినా అది తప్ప సుఖకరమైనది మరొకటి లేదు.
గొప్ప కులము కలిగితే గర్వము కలుగును. మాత్సర్యము కలిగితే జగడములు వచ్చును.  తలపులు ఎంత పెరిగితే
కోరికలు అంతపెరుగును. కాబట్టి కులము, చలము, తలపు మున్నగు వాటివల్ల నిక్కమైన  విజ్ఞానము దొరకదు.
ధనమెంత కలిగితే లోభమంత కలుగును  చక్కదనము ఎక్కువ కలిగితే మోహములు కూడా ఎక్కువగును.
అధికంగా విద్యార్హతలు  కలిగిన మదము హేచ్చిపోతుంది. కాన ధనము, అందము, చదువు మొదలగు వాని వలన ఉత్తమగతి లభించదు.
ఎందరు స్త్రీలను అనుభవించిననూ కామము మరింత పెరుగును. సిరులెన్ని కలిగితే చింతలు కూడా అంతే పెరుగును.  శ్రీ వేంకటేశ్వరా! నిన్ను భక్తితో కొలిచితే చిత్తచాంచల్యములు తొలగి నిజమైన ఆత్మానందము కలుగును.
 

Thursday 15 May 2014

14.05.2014

నేడు వైశాఖ పున్నమి. తొలి తెలుగు వాగ్గేయకారుడు  అన్నమయ్య జయంతి. అన్నమయ్య ఆరాధ్యులందరికీ  శుభాభినందనలు.
“హరి అవతారమీతడు అన్నమయ్య. అరయ మా గురుడీతడు అన్నమయ్య”. అన్నమాచార్యులు క్రీ.శ. 1408 సం.లో నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. నందకాంశ సంభూతుడు.   వెంకటేశ్వరస్వామి వరప్రసాదిగా జన్మించిన అన్నమయ్య బాల్యంనుంచీ విష్ణుభక్తి పరాయణుడుగా ఎదిగాడు. తన ఎనిమదవ  ఏటనుండీ సంకీర్తనలు రచించేవాడు. అజ్ఞానపు చీకటిలో  అలమటిస్తున్న జనులను తరింపచేయుటకు సంకీర్తనారచన ఒక్కటే శరణ్యమని భావించి ముప్ఫయిరెండు వేల సంకీర్తనలను రచించి తరతరాలవారికీ అందించిన గొప్ప వాగ్గేయకారుడు. తిరుమల తిరుపతి దేవస్థానం కృషివల్ల  పధ్నాలుగువేల కీర్తనలు  వెలుగులోకి వచ్చాయి. అన్నమయ్య కీర్తనలు  కేవలం భక్తితత్వమే కాక ఎన్నో ప్రజాహిత బోధనలు, వైరాగ్య చింతనలు కలిగివుంటాయి.
పద్య సాహిత్యం విద్యావంతులు, పండితులయినవారు మాత్రమె ఆస్వాదించగలిగేవారు.  పదసాహిత్యం సామాన్యప్రజలకోసమే అవతరించిబడింది. అన్నివర్గాల జనులను జాగృతి చేసే శక్తి అన్నమయ్య పదసాహిత్యానికి ఉంది. అందుకే అన్నమయ్య ‘పదకవితా పితామహుడు’ అయ్యాడు.
ఆధ్యాత్మిక, భక్తీ, శృంగార,  వేదాంత కీర్తనలను వెంకటేశ్వర ముద్రాంకితముగా రచించిన ప్రతిభాశాలి!
అన్నమయ్య తన కీర్తనలలో భాగవత పురాణ ఘట్టాలనీ, అవతార విశేషాలనీ, గీతోపదేశాన్ని, శ్రీకృష్ణుని చిలిపి చేష్టలనీ, అలిమేలుమంగ సౌందర్యాన్ని, స్వామివారి శృంగారాన్ని, అలకలనీ, జీవితసారాన్ని ఇలా ఒకటేమిటి అన్ని అంశాలను తన కీర్తనల్లో స్ప్రుశించాడు. సామూహిక గానానికి అనువుగా భజన సంప్రదయ కీర్తనలనీ రచించాడు.
ఆతని కీర్తనలలో ఎంత రసభావ సృష్టి కలదో! మనసులో ఎక్కడో ఉన్న సున్నితమైన భావాల్ని తట్టిలేపే పదప్రయోగం గోచరిస్తుంది. ఆ మహా వాగ్గేయకారుని సాహిత్యాన్ని వర్ణించగలవారము కాకపోయినా, అందులోని రసానుభూతిని ఆస్వాదించగలిగితే ధన్యులం.
అన్నమయ్య కీర్తనలను వెంకటేశ్వరస్వామి ముద్రతో రచించి ఆ స్వామికే అంకితంచేసిన ధన్యజీవి! అందుకే వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే అన్నమయ్యను స్మరించినట్లే. అన్నమయ్యను స్మరిస్తే స్వామిని స్మరించినట్లే!
(ఈ వ్యాసానికి చక్కని బొమ్మవేసి సహకరించిన మా శ్రీవారు పొన్నాడ మూర్తి గారికి ధన్యవాదాలు)


Saturday 10 May 2014

సహజ గమకాల అమర గాయకులు


దక్షిణాది చిత్రసీమలో ఎందరో మహాగాయకులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మాధుర్యం. అందరిలోకి ప్రత్యేకమైన గాత్ర మాధుర్యం స్వర్గీయ శ్రీమతి భానుమతిరామక్రిష్ణ గారిది. ఆమె గాత్రం లో సహజమైన గమకాలూ, సంగతులు పలుకుతాయి.  ఎందరో గాయకులు ఎన్నో సంగతులను, గమకములను అభ్యసించి పలికిస్తారు. కాని  భానుమతిగారు మాత్రం అతి సునాయాసంగా తన గాత్రంలో ఎంత  కష్టమైన సంగతి అయినా అలవోకగా  పలికించే వారు.  ఆమె గళం లో ఆ విరుపులు ఆ వంపులు అతి సహజంగా ఉట్టిపడతాయి . అది ఆమెకి భగవంతుడు ఇచ్చిన వరం. అంత మధురమైన, శాస్త్రీయమైన గానం విని ఆనందించగలగడం మన అదృష్టం. వేరవ్వరూ ఆమె గాత్రాన్ని అనుకరించ లేరు. ఆమెకే సొంతమైన ఆ గమకాలూ, సంగతులు మరెవ్వరూ పలికించలేరు.

అలాగే ఉత్తరాదిన స్వర్గీయ  మన్నాడే గారి గాత్రంలో  కూడా  ఓ ప్రత్యేకత ఉంది.  ఆయన  గళంలో కూడా సహజమైన గమకాలు, సంగతులు జాలువారుతాయి.  ఉదాహరణకి “ సుర్ నా సజే క్యా గావున్ మైన్ “ “తుజ్హే సూరజ్ కహూన్ య చందా ” మొదలైన   రసగుళికలు  ఎన్నో! ఎన్నెన్నో !! వీరు హాస్య గీతాలు ఆలపించినా అందులోనూ హాస్యంతోపాటు సుమధురమయిన గమకాలు పలుకుతుంటాయి.

 https://www.youtube.com/watch?v=vZhJIBxK35E&hd=1
http://www.youtube.com/watch?v=hpVvfPKyjLM&hd=1

భానుమతి గారికి, మన్నాడే గారికి  గమకాలూ సంగతులు పలికించడము లోనూ  చాలా సారూప్యత గోచరిస్తుంది . వీరిరువురూ సినీ రంగంలో  కాకుండా శాస్త్రీయ సంగీత  ప్రపంచానికే అంకితమయివుంటే  మరో ఇద్దరు గొప్ప శాస్త్రీయ సంగీత  మహా కళాకారులుగా,   భారతదేశ రత్నాలుగా పేరు గాంచేవారు. అంతటి గొప్పవారు మళ్ళీ జన్మించి ఆ గానామృతాన్ని పంచుతారన్న ఆశ లేదు. ఎందుకంటే ఇంత అద్భుతమైన గాయకుల్ని ఆ అమరులు వదిలిపెట్టరు.

  

Friday 9 May 2014

పెంచి తమపెట్టుజెట్టు - అన్నమయ్య కీర్తన

పెంచి తమపెట్టుజెట్టు
పెంచి తమపెట్టుజెట్టు పెరికివేయ రెవ్వరు మంచివాడ గాకున్న మన్నించకుండేవా

తెరువు దప్పి యడవి దిరిగేటివారి దెచ్చి తెర్వున బెట్టుదురు తెలిసినవారలు
నరుడనై నేరక నడిచేటినన్ను నీవు మరిగించి కావక మానవచ్చునా

దిక్కుమాలినట్టివారి దెచ్చి దయగలనారు దిక్కయి కాతురు వారి దిగదోయరు
తక్కక మాయలోబడి దరిదాపులేనినన్ను వెక్కసాన రక్షించక విడిచేవా నీవు

ఆవల బయపడ్డవా రంగడిబడితే దొర లోవల విచారించి వూరడింతు రంతలోనే
శ్రీవేంకటేశ నీవు సృష్టికల్లా నేలికవు వేవేలు మామొర నీవు విచారించకుండేవా

ఈ వారం అన్నమయ్య కీర్తన.
భావం:
దేవా! తామే మొక్కను నాటి పెంచిన చెట్టును తమ చేతులారా ఎవరును పెరికి వేయరు. నీవే నన్ను పుట్టించి పోషించితివి. నేను మంచివాడిని కాకున్నచో నన్ను మన్నింప లేవా?
ఎవరైనా దారి తప్పి అడవిలో తిరుగుచున్నచో తెలిసినవారు వారికి సరియైన దారి చూపి కాపాడుదురు. నరుడనై పుట్టి సన్మార్గము వదలి అపమార్గములో పడి పోవుచున్న నాకు సన్మార్గమును చూపి నన్ను కాపాడక వదలి వేయుదువా?
దిక్కులేని వారిని దయగలవారు దిక్కయి  కాపాడుదురు గాని వారిని విడనాడరు. దయామయుడవైన నీవు మాయలో పడి దారి, తెన్నూ తెలియక తికమక లాడుచున్న నన్ను కరుణ చూపి రక్షింపక విడిచి పెడుదువా?
ఏ కారణము చేతో భయపడి కొలువుకూటములోనికి వచ్చినచో అచ్చటి దొరలు వారి భయానికి కారణము తెలిసికొని తగురీతిని విచారించి వారి భయమును పోగొట్టి ఊరడింతురు. శ్రీ వేంకటేశ్వరా! నీవు ఈ విశాలసృష్టి కంతటికీ యేలికవు. అట్టి నీవు మా అపరాధములను మన్నించి మా మొరలను ఆలకించి మమ్మల్ని రక్షించాలేవ?   



Wednesday 7 May 2014

అన్నమయ్య సూక్తులు

08.05.2014
అన్నమయ్య సూక్తులు :
1. నిప్పు దెచ్చి ఒడిలోన నియమాన బెట్టుకొంటే – ఎప్పుడును రాజుగాక ఇదియేల మాను.
భావం:
నిప్పును తీసుకొచ్చి భధ్రంగా ఒడిలోన దాచుకొన్నా రగులుకొనక మానదు.

2. అరయ పంచదార నద్దుక తినబోతే – చేరరాని ముష్టిగింజ చేదేల మాను.
భావం:
ముష్టిగింజని పంచదారలో అద్దుకొని తిన్నా దాని చేదు పోదు. (ముష్టిగింజ = అదొకరకమైన విషపు గింజ)

3. పెద్ద తెరువులుండగాను పేద గంతలు దీసుక – పోద్దువొక యడవుల బుంగుడయ్యేరు.
భావం:
లోకులు మంచి మార్గాములుండగా అడవులలో పడి పెడదారులు తవ్వుకుంటూ కష్టాల పాలౌతారు

4. మానని  కాముకులకు మగువలే దైవము – పానిపట్టి వారి భ్రమ మాన్ప వశమా.

భావం:
అతి కాముకులైన వారికి మగువలే దైవం. ఎంత ప్రయత్నించినా వారి భ్రమను మాన్ప గలమా?


Friday 2 May 2014

షోడసకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి (ఓ చక్కని అన్నమయ్య కీర్తన)


షోడసకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి

అలరు విశ్వాత్మకున కావాహన మిదె
సర్వనిలయున కాసనము నెమ్మి నిదే
అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు 
తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము

అమృతమథనునకు నదివో నైవేద్యము
గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో        
 

శ్రీ మహావిష్ణువుకి షోడశోపచారాములతో  పూజ ఈ కీర్తనలో అన్నమయ్య రచించాడు. రోజూ ఉదయం ఈ కీర్తన పాడుకుంటే ఆ పరమాత్మునికి షోడశోపచారములతో పూజించినట్లేనని మా గురువుగారు చెప్పేవారు.

భావం :

పదహారు కళలకు నిలయమైన శ్రీహరికి షోడశోపచారములతో నిత్యమూ పూజ సమర్పిస్తున్నాను.
విస్వాత్ముడై అలరించే హరికి ఆహ్వానము ఇదే. సర్వమూ తానె అయిన హరికి ఆసనము ఇదే. గంగాజనకుడైన హరికి అర్ఘ్య, పాద్య, ఆచమనాలు ఇవే. జలధిలో శేష పాన్పుపై నుండే హరికి స్నానం ఇదే.
పీతంబరధారుడైన హరికి వస్త్రాలు ఇవే. శ్రీ మహాలక్ష్మికి పతియై అలరారే హరికి భూషణములు ఇవే. భూదేవిని ధరించె హరికి గంధ పుష్ప ధూపములు, కోటిసూర్య తేజునకు దీపము ఇవే.
అమృత మధనము లో సహాయము చేసిన హరికినైవేద్యము ఇదే. సూర్య చంద్రులు నేత్రలుగా భాసిల్లే హరికి కర్పూరము, తాంబూలము ఇవే. శ్రీ వేంకటాద్రిమీద దేవుడైన హరికి ఆర్తితో ప్రదక్షణములు, నమస్కారములు ఇవే.