Tuesday 29 April 2014

శ్రీమద్భాగవతంలో దసమస్కందములోని పద్యం.
శ్రీ కృష్ణుడు కాళీయ మర్దనం చేస్తున్నప్పుడు కాళీయుని భార్యలు శ్రీ కృష్ణుని నుతిస్తూ చెప్పిన పద్యం.
సి. విశ్వంబు నీవయై విశ్వంబు జూచుచు, విశ్వంబు సేయుచు విశ్వమునకు
హేతువైన పంచాభూతమాత్రెంద్రియములకు మనఃప్రాణబుద్ది చిత్త
ముల కెల్ల నాత్మవై మొనసి గుణంబుల నావృత మగుచు నిజాంశభూత
మగు నాత్మచయమున కనుభూతి సేయుచు మూడహంకృతులచే ముసుగువడక
తే  నెరి ననంతుడవై దర్సనీయరుచివి, గాక సూక్ష్ముడవై నిర్వికారమహిమ
దనరి కూటస్తుడన  సమస్తంబు నెరగు, నీకు మ్రొక్కెద  మాలింపు నిర్మలాత్మ!
భావం: 
ఈ సమస్త విశ్వమూ నీవే. దీన్ని స్మరిస్తూ ఉన్నది నీవే. ఈ  విశ్వంగా ఉండి విశ్వాన్ని చూస్తూ ఉన్నవాడివి కూడా నీవే. పంచ తన్మాత్రలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, ప్రాణం ఉన్నాయని అనుకుంటున్నాం గాని నీవే అన్నిటా ఆవరించబడి ఉన్నావు. నీ అంశగా నీలో కొంత భాగంగా ఇన్ని ఆత్మలు వర్తిస్తూ ఉంటే, వాటికి అనుభూతి కలిగించేవానిగా నీవు ఉన్నావు. సత్వరజస్తమనస్సుల రూపంలో మూడు అహంకారాలూ పని చేస్తూ ఉన్నా వాటితో కప్పబడకుండా అంతులేని ప్రకాశం కలిగి ఉన్నావు. మేము దర్శించడానికి వీలు లేని సూక్ష్మరూపుదవై ఉన్నావు. ఇన్ని మార్పులూ పొందకుండానే ఇన్నిటిలో దాగి ఉన్నావు కనుక, ఇన్నిటినీ ఎరుగుదువు. అలాంటి నిర్మలాత్ముడవైన నీకు నమస్కరిస్తున్నాము.
పోతనగారి అనిముత్యాలైన పద్యాలలో ఇది ఒక ఆణిముత్యం.


Friday 25 April 2014

యెంత విభవముగలిగె – నంతయును నాపదని

ఈ వారం అన్నమయ్య కీర్తన.
యెంత విభవముగలిగె – నంతయును నాపదని
చింతించినది గదా – చెడని జీవనము
చలము గోపంబు దను – జమ్పేటి పగతులని
తెలిసినది యది గదా – తెలివి
తలకొన్న పరనింద – తనపాలి మృత్యువని
తొలగినది యది గదా – తుదగన్న ఫలము
మెరయు విషయములే తన – మెడనున్న  యురులుగా
యెరిగినది యదిగదా – యెరుక,
పరివోని యాస దను – బట్టుకొను భూతమని
వెరచినది యదిగదా – విజ్ఞాన మహిమ
ఎనలేని తిరువేంక – టేశుడే దైవమని
వినగలిగినదిగదా – వినికి,
అనయంబు నతని సే – వానన్దెఅ పరులయి
మనగలిగినది గదా –మనుజులకు మనికి.
భావము:
యెంత ఐశ్వర్యము కలిగినను అది అంతయు ఆపదయే గాని సంపద గాదని గ్రహించిన వాని బ్రతుకే చెడిపోని బ్రతుకు.
మచ్చరము, కోపము అను దుర్గుణములే తన్ను చంపు శత్రువులని తెలిసికొని వాటిని దరికి రానీయకుండుటే నిజమైన తెలివి. పరదూషణనము తనపాలి మృత్యువని తలచి దానిని విసర్జించుటయే ఉన్నతమైన ఫలము.
శబ్ద స్పర్శ రూపాదులైన విషయములే తనమెడకు తగులుకొన్న తాళ్లుగా గ్రహించి వాటికి దూరముగా నుండుటే నిజమైన విజ్ఞత. తెగని ఆశయే తన్ను పట్టుకొన్న దయ్యమని యెంచి దానికి వెఱచి తొలగుటయే విశిష్టమైన తెలివి.
సాటిలేని శ్రీ  వేంకటేశుడే  దైవమని పెద్దలవలన విన్నదియే నిజమైన వినికి. ఎల్లప్పుడు ఆ దేవుని సేవించుచూ ఆనందముతో బ్రదుకు వారిదే నిజమైన బ్రదుకు.
నా మాట:

యెంత చదివినా, ఎన్ని తెలిసినా మనుజులు అరిషడ్వర్గాలను జయించలేక ఆ పరమాత్ముని తెలుసుకోలేక  కొట్టు మిట్టాడుతూ ఉంటారు. అదే ఈ కీర్తనలోని అంతరార్ధము.
శ్రీమద్భాగవతం లోని దసమస్కందములో గోపికావస్త్రాపహరణం లోని పద్యం.
గోపికలు వివస్త్రలై నదిలో జలకాలాడుతుండగా శ్రీ కృష్ణుడు వారి వలువలను  అపహరించాడు. ఆ సందర్భములో గోపికలు శ్రీ కృష్ణుని ఉద్దేశించి చెప్పిన పద్యం.

శా. ఇంతుల్ తోయములాడుచుండ మగవారేతెంతురే? వచ్చి రా
యింతల్ సేయుదురే? కృపారహితులై  యేలోకమందైన నీ
వింతల్ నీ తలబుట్టె గాక! మరి యేవీ కృష్ణ! యో చెల్ల! నీ
చెంతన్ దాసులమై చరించెదము మా చేలంబు లిప్పింపవే!

భావము:

కృష్ణా! ఆడువారు స్నానము చేసేటప్పుడు మగవారు ఆ ఛాయలకు వస్తారా? వచ్చినా దయమాలి ఎక్కడైనా ఈ మాదిరి వింతైన అల్లరి పనులు చేస్తారా? ఔరా! ఈ చిత్రమైన చర్యలు నీకే సరిపోయాయి. మరెక్కడా లేవు. నీకు దాసులమై ఉంటాము. మా కోకలు ఇప్పించు.
క. వచ్చెదము నీవు పిలిచిన; నిచ్చెద మేమైన గాని; యెట జొరు మనినం
జొచ్చెదము; నేడు వస్త్రము, లిచ్చి మముం గరుణతోడ నేలుము కృష్ణా!
భావము:
కృష్ణా! నీవు పిలువగానే వస్తాము. నీవేది కోరినా ఇస్తాము. నీవేక్కడికి పొమ్మన్నా పోతాము.   
ఇపుడు మా చీరలు మాకిచ్చి దయతో మమ్మెలుకొ!

ఈ విధంగా పరిపరి విధముల వారిచే బ్రతిమాలించుకొని  వారిచే వందనములందుకొని  వారి వస్త్రములను వారికిచ్చెను.

Wednesday 23 April 2014

రాధామాధవుల ప్రణయం.


చేతికి గాజులులా, కళ్ళకు కాటుకలా 
  నుదిటికి తిలకంలా రాధకు మాధవుదు
                                                            అన్నాడొక సినీకవి.

రాధామాధవుల ప్రేమతత్వం అజరామరమైనది, అనిర్వచనీయమైనది. వారి అనురాగం, నిండైన వారి ప్రేమ లోకానికి ఆదర్శం. తొలి వాగ్గేయకారుడైన శ్రీ జయదేవుడు పన్నెండవ శతాబ్దము వాడు. ఉత్కళ దేశస్థుడు. సంస్కృతంలో లో రచించన ఈతని రచనలన్నీ రాధామాధవుల ప్రణయంతో నిండివున్నవే. గీత గోవిందం పేరిట ప్రసిద్ధి గాంచిన అష్టపదులు. జయదేవుని అష్టపదులు నాటికీ నేటికీ కవులకూ, గాయకులకూ మార్గదర్శకం. అష్టపది లేని ఏ సంగీత కచేరి ఉండదు. తరువాత పద్నాల్గవ శతాబ్దం వాడైన అన్నమయ్య కూడా రాధా మాధవుల ప్రణయముపై చాలా అందమైన కీర్తనలను రచించాడు. ఆ తరువాత మహాకవి క్షేత్రయ్య అచ్చ తెలుగు భాషలో రచించిన మువ్వ గోపాలుని పదాలన్నీ రాధామాధవ ప్రణయం తోనే నిండి ఉంటాయి.

నిజానికి రాధామాధవుల ప్రణయం అంతర్లీనంగా ఆత్మ పరమాత్మల సంగమం. అదో అద్భుతమైన ప్రేమ తత్వం.

Monday 21 April 2014

ధరణి నెందరెన్ని – తపములు చేసినాను

ధరణి నెందరెన్ని – తపములు చేసినాను
హరిక్రుప గలవాడే – అన్నిటా బూజ్యుడు.

మితి లేని విత్తులెన్ని – మేదినిపై జల్లినాను
తతివో విత్తినవే – తగ బండును .
ఇతర కాంతలు మరి – యెందరు గలిగినాను
పతి మన్నించినదే – పట్టపు దేవులు.

పాలుపడి నరులెన్ని – పాట్లబడి కొలిచినా
నేలిక చేపట్టినవాడే – ఎక్కుడు బంటు.
మూలనెంత ధనమున్నా – ముంచి దాన ధర్మములు
తాలిమితో నిచ్చినదే – దాపురమై నిల్చును.

ఎన్నికకు గొడుకులు – యెందరు గలిగినాను
ఇన్నిటా ధర్మపరుడే – ఈడేరును,
ఉన్నతి జదువు లెన్ని – వుండినా శ్రీ వేంకటేశు
సన్నుతించిన మంత్రమే – సతమై ఫలించును.

భావము:

ఇలలో ఎందరో ఎన్నో తపములు చేయుచున్నారు. కానీ వారందరూ పూజనీయులు కాజాలరు. వారిలో శ్రీహరి కృపను సాధించినవాడే అన్నిటా పూజ కర్హుడగును.
అదను జూడక నేలపై ఎన్ని విత్తనములు జల్లినను అవి ఫలింపవు. బాగుగా దున్నిన నేలలో అదనున చల్లిన విత్తనములే చక్కగా ఫలించును. అలాగే ఒక రాజుకు ఎందరో రాణులుందురు కాని వారెల్లరు పట్టపు రాణులు కాలేరు. రాజు ఎవరిని ఎక్కువగా మన్నించి గౌరవించునో ఆమెయే పట్టపు రాణిగా చలామణి యగును.

ఒక ప్రభువు వద్ద ఎందరో సేవకులు కష్టించి సేవించిననూ, వారందరూ ప్రధాన సేవకులు కాజాలరు. ఆ ప్రభువు ఎవరిని ఎక్కువ నమ్మకముతో చేపట్టునో అతనే ప్రధానాధికారిగా గుర్తింపబడును. ఒకని వద్ద ఎంతో ధనముండును. కానీ అది అతనికి ఏ విధంగానూ సాయపడదు పాత్రులైన వారికి దానం చేసిన ధనమే అతనికి జన్మాంతరము లో కూడా సహాయమై నిల్చును.
ఎవరికైన కొడుకులు లెక్కకెందరో పుట్టవచ్చు. కానీ వారిలో ఎవరు ధర్మపరుడో వాడే తల్లితండ్రుల ఋణము తీర్చి వారి దినము దీర్చును. అలాగే లోకములో ఎన్నో చదువులుండవచ్చు, కానీ వాని వల్ల ప్రయోజనముండదు. ఆ వేంకటేశ్వరుని సన్నుతించు మంత్రమే శాశ్వతమైన చదువై అభీష్టఫలములను ఇచ్చునది.


తలచి చూడ పరతత్వంబితడు

శ్రీ మహావిష్ణువు చుట్టరికాలు

పరమాత్ముడు ఎవరికీ ఏవిధంగా చుట్టమో ఈ కీర్తనలో అన్నమయ్య చాలా అందంగా విశదీకరించాడు.
లక్ష్మీదేవికి భర్త, సముద్రునికి అల్లుడు, బ్రహ్మకి తండ్రి, పార్వతికి సోదరుడు, శివునికి బావ, దేవేంద్రునికి అనుజుడు, చంద్రునికి బావమరిది, అదితికి కొడుకు, సురాసురాలకు తాత, ప్రాణులన్నిటికీ బంధువు, వాణికి మామగారు. ఇంతటితో ఆగక మనతో కూడా చుట్టరింకం కలుపుకోవడానికి వేంకటాచల రమణుడుగా తిరుమల గిరిమీద వెలసి వున్నాడు.

కీర్తన
తలచిచూడ పరతత్వంబితడు
వలసినవారికి వరదుడితడు

సిరికి మగడు అమృతసింధువునకు నల్లుడు
సరుస పార్వతికి సయిదోడు
గరిమెల బ్రహ్మకుఁ గన్న తండ్రి యితడు
పరగి శివునకు బావ యితడు

అల దేవేంద్రుని అనుజుడితడు
మలసి చంద్రుని మఱదితడు
కులమున నదితికి కొడుకూ నితడు
తలపు సురాసురలతాతయు నితడు

ప్రాణుల కెల్లా బంధుడితడు
వాణికి మామగు వావి యితడు
జాణ శ్రీవేంకటాచల రమణుడితడు
మాణికపు మన్మథుడితడు.