Saturday 28 September 2019

అన్నిటి మూలం బతఁడు - అన్నమయ్య కీర్తన.





అన్నమయ్య శ్రీనివాసుని ఘనతను గురించి మనకు వివరిస్తున్నాడు. శ్రీమహావిష్ణువే అన్నిటికీ మూలము అని ఎలుగెత్తి చాటుతున్నాడు భక్త హృదయాలకు. ఆ వివరాలను ఈ కీర్తనలో చూద్దాం.
కీర్తన:
పల్లవి: అన్నిటి మూలం బతఁడు
వెన్నుని కంటెను వేల్పులు లేరు || అన్నిటి ||
చ.1. పంచభూతముల ప్రపంచ మూలము
ముంచిన బ్రహ్మము మూలము
పొంచిన జీవుల పుట్టుగు మూలము
యెంచఁగ దైవము యితఁడే కాఁడా || అన్నిటి ||
చ.2. వెనుకొని పొగడేటి వేదాల మూలము
మునుల తపములకు మూలము
ఘనయజ్ఞాదుల కర్మపు మూలము
యెనలేని దైవ మితఁడే కాఁడా || అన్నిటి ||
చ.3. అగపడి సురలకు నమృత మూలము
ముగ్గురు మూర్తులకు మూలము
నగు శ్రీవేంకటనాథుఁడే మూలము
యెగువ లోకపతి యితఁడే కాఁడా || అన్నిటి ||
ఈ సర్వ సృష్టికి మూలస్తంభము శ్రీ వేంకటేశ్వరుడే! శ్రీ మహావిష్ణువుకన్న ఘనమైన దైవమీ యిలలోలేదు. ఆయన శరణు వేడండి. కైవల్యప్రాప్తిని సులభంగా పొందండి అని ఉద్భోదించడం ఈ కీర్తనలోని సారాంశం.
పంచభూతములు అనగా మనిషి ప్రతి అడుగుకూ ఆధారభూతమైన ఈ భూమండలం, మనిషి జన్మించినదాది మరణించే వరకూ ఊపిరినిచ్చే వాయువు, మనిషి దాహాన్ని తీర్చి సేదనిచ్చే నీరు, మనిషిని జీవితాంతం తల్లి గర్భంలా కాపాడే ఆకాశము, జీవించడానికి శక్తినిచ్చే అగ్ని, ఇవన్నీ కూడా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కానీ ఆ పంచభూతాలకు మూలము శ్రీనివాసుడు. ఆయనే చతుర్ముఖుడైన బ్రహ్మ, సృష్టికి మూలమైన వానికి కూడా మూలమితడే. ఇతని యందే ఆ బ్రహ్మ జన్మించాడు. మరి మనము నిత్యము నిరతము తలచవలసినవాడు శ్రీమహావిష్ణువే కదా! అన్య చింతనలెందుకు? ఆయన్ను సదా సేవించి ముక్తులవండి అంటున్నాడు అన్నమయ్య.
చతుర్వేదముల ఘనతను మనకు తెలిపి వేద విహారుడై ఆ వేదాలలో విహరించే మహావిష్ణువితడే! సర్వ ముని, ఋషి జన సమూహములకు మూలమితడే! సమస్త సృష్టి ఇతని వలననే జనియించి లయిస్తున్నది. యజ్ఞ యాగాదులకు కర్త కర్మ క్రియ ఇతడే! ఈ యజ్ఞకర్తకు మించిన దైవము ఈ సృష్టిలో మరొకడు గలడా! అన్నిటికీ ఆది, అంత్యము యితడే! శరణు శరణని పాప పంకిలాన్ని పటాపంచలు గావించుకొనండి అంటున్నాడు అన్నమయ్య.
ఒకనాడు క్షీరసాగర మధనంలో శ్రీమహావిష్ణువు సురాసురులకు మోహినిగా అగుపించి సురలకు అమృతపానం గావించిన ఘనమైన దేవుడు శ్రీమహావిష్ణువే కదా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులన్న భేదం లేక ముగ్గురికీ మూలమైన మూలపురుషుడు ఈ మహావిష్ణువే కదా! ఏడు ఊర్ధ్వలోకములైన భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకములకు అధిపతి యితడే కదా! ఈతని మించిన దైవము ఈ చతుర్దశభువనములలో లేడు. ఆయన పదకమలాలను పట్టుకొని సేవించి సుగతులను పొందండి అని మనకు సందేశమిస్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య.
విశ్లేషణ : శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి సౌజన్యంతో

Friday 27 September 2019

ఎదుటనే ఉండగాను యెడమాటలేమిటికే - అన్నమయ్య కీర్తన



ఎదుటనే ఉండగాను యెడమాటలేమిటికే
కదిసి పెనుగులాడే కలయికలే మేలే.. !!
మచ్చికలు నెరపితే మనసులేకము లౌను
ఇచ్చకము తెచ్చితేనే ఇంపులు పుట్టు
ముచ్చటలు గలిసితే ముదురు నడియాసలు
మెచ్చులుగా బతితోడి మేలములే మేలే. !!
నగవు లుప్పతిలితే ననుపులు సమకూడు
మొగమోట గలిగితే మొనయు దమి
తగులాయా లొనరితే దట్టమౌను వలపులు
మగవానితో మంచిమాటలే మేలే !!
చూపులు తారసించితే సొంపులు మిక్కుటమౌను
కాపురాలు దొరకితే గట్టియౌ బొందు
పైపై నీమీది బత్తి బాయక నన్నేలినాడు
చేపట్టి శ్రీవేంకటేశు సేవలే మేలే.
భావ మాధుర్యం:
దాంపత్య జీవితం ఎలా ఉండాలో ఈ కీర్తనలో వివరించాడు అన్నమయ్య. ఓ దేవీ ! ఆలుమగలు కలిసి జీవిస్తుంటే వాళ్ళ మధ్య దూరం పెంచే మాటలు ఎందుకమ్మా..? పోట్లాట తరువాత కలయిక ఎంత మధురమో తెలుసా?
అనుకూలత చూపిస్తే మనసులు కలుస్తాయి. ఒకరిపైఒకరు ప్రీతి తెచ్చుకుంటేనే ఇష్టం కలుగుతుంది. నీ మాటలు కలిస్తే ఆశలు చిగుళ్ళు తొడుగుతాయి. ముంగిలా ఉండేకంటే పతితో సరసాలాడితేనే బాగుంటుంది.
నవ్వుతూ సంభాషిస్తే అనురాగములు అతిశయిస్తాయి. మొగమోటము కలిగితే ఆపేక్షలు పెరుగుతాయి. అనురాగం మీ మధ్య ఉంటేనే వలపు వృధ్ధిచెందుతుంది. భర్తతో ఏదైనా మంచి మాటలే మాట్లాడాలి.
చూపులతో చూపులు కలుపుతూ మాట్లాడుకోవాలి. కాపురాలు చేస్తుంటేనే భార్యాభర్తల మధ్య కూటములు కలుగుతాయి. మీమీద ఎంతో భక్తి, ప్రేమా ఉన్నా నా భక్తిని చూసి నన్నూ అనుగ్రహించాడమ్మా శ్రీవేంకటేశుడు. ఆ శ్రీవేంకటేశుని సేవలే అన్నిటా మేలు.
(భావమాధుర్యం : శ్రీ అమరవాది శుభ్రహ్మణ్య దీక్షితులు గారి సౌజన్యంతో)

Sunday 22 September 2019

ఆతడే ఇన్నియును నిచ్చు. అన్నమయ్య కీర్తన.


21..9..19..ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప. ఆతడే ఇన్నియును నిచ్చు నడిగిన వల్లాను
    చేతిలోనే ఉండగాను చింతించరు హరిని.            !!

చ.  వలెనంటే సంపదలు వట్టి యలమట బెట్టు
     అలసి నోపనంటేను అండనే ఉండు.
     తలచి ఇందరు నీ తరితీపుల జిక్కి
     తలచ రెందును బరతత్వమైన హరిని.              !!

౨.  ఆసపడితే నింతులు అన్నిటాను బిగుతురు
     వాసితో నుంటేనే తామే వత్తు రొద్దికి.
     పోసరించి ఇందరు నీ పొందుల భ్రమలబడి
     పాసివున్నారదే తమ పతియైన హరిని.            !!

౩.   గట్టిగా రాతిరెల్లాను కలయై యుండు జగము
     పట్టపగలైతే తమ పాల నుండును.
     బట్టబయలు సందిలి పెట్టేరు గాని చే
     పట్టరు శ్రీ వేంకటాద్రిపైనున్న హరిని.         !!

భావము..  ఆ పరమాత్ముని భక్తితో ప్రార్ధించినచో జీవుల కోరికలనెల్లా తానే నెరవేర్చును. అందుబాటులో అనగా తమ హృదయమునందే ఉన్న హరిని గూర్చి చింతించలేరు.

కావలెనని సంపదలను ఆశిస్తే అవి మనల్ని తిప్పలు బెట్టి అందకుండా పోతాయి. వాటిపై విసిగి, అవి నాకక్కర్లేదు అనుకొని ఆశ వదలిపెట్టి భగవంతునిపై భారముంచినచో తమకు తామే అవి మన చెంతకు వచ్చి చేరును. ఈ సూక్ష్మమును తెలియక సంపదల వ్యామోహములో పడి పరతత్వమైన హరిని నమ్మలేకున్నారు.  

పురుషులు ఆశపడి వెంటబడిన పడతులు బిగువు చూపుదురు. కాస్త నిగ్రహము చూపి వారే బెట్టుగానున్నచో అ పడతులే తమ చెంతకు చేరుదురు. కాని జనులందరూ స్త్రీలపై వ్యామోహముతో వారికై ఆతాటపడి తమ స్వామియైన శ్రీహరిని వీడి యున్నారు.

రాత్రి గాఢనిద్రలో నున్నప్పుడు ఈ ప్రపంచమంతా కలవలె తోచును. కానీ తెల్లవారేసరికి అంతా ఎప్పటిలాగే కనుపించును. ఇంతగా అశాశ్వతమైన ఈ ప్రపంచములో జీవులు బట్టబయలు పందిలి వదిలిపెట్టినట్లుగాఏమో సాధింపగోరి వ్యర్ధ ప్రయత్నములు చేయుచున్నారే కానీ శాశ్వతుడై శ్రీ వెంకటాద్రి మీద నున్న శ్రీహరినిమాత్రము విశ్వసించరు.

ఇచ్చుటలో ఉన్న హాయి. కథానిక.


ఇచ్చుటలో ఉన్న హాయి..

“అమ్మా” అన్న పనిమనిషి రమణమ్మ పిలిపుతో ఆలోచనలలోనుండి బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టింది లలిత.
అమ్మో అప్పుడే ఎనిమిది అయిపోయిందా? రమణమ్మ వచ్చేసింది అనుకుంటూ కూర్చున్న చోటు నుంచి లేచింది. సూర్యచంద్రులే గతులు తప్పినా, ప్రపంచమే తల్లకిందులయినా రమణమ్మ మాత్రం సరిగ్గా ఎనిమిది గంటలకి గుమ్మంలో ప్రత్యక్ష్యం అవుతుంది. అంత చక్కని సమయపాలన ఆమెది.  పిల్లలు స్కూల్  కి  వెళ్ళాక కాసేపు విస్రాంతిగా కాఫీ తాగుతూ సేద తీరుతూంటుంది లలిత. రమణమ్మ వచ్చాక మళ్ళీ దినచర్య మొదలు.
రోజూ నవ్వుతూ పలకరించి, గలగలా మాట్లాడుతూ, కాస్త లలితను సాధిస్తూ చకచకా తనపని తాను చేసుకుపోతూ ఉంటుంది రమణమ్మ..   కానీ ఈ రోజు మాత్రం ముభావంగా దిగులుగా కనిపించింది. మొహం చిన్నబోయి ఉంది. “ఏమయింది రమణమ్మ అలా ఉన్నావు? ఒంట్లో బాగులేదా” అని అడిగింది లలిత. “ఏటోనమ్మా మేము ముసలోళ్ళం అయిపోనామంట! మమ్మల్ని పనిలోంచి తీసేసి వేరే వయసోళ్ళని పన్లోకి పెట్టుకుంటారట” అంది దీనంగా.
రమణమ్మ వాళ్ళది గొదావరి జిల్లాలో చిన్న గ్రామం. అక్కడ జీవనోపాధి కుదరక బందువులసాయంతో హైదెరాబాద్ వచ్చి అపార్త్మెంట్లో పనికి కుదురుకున్నారు. లలిత వాళ్ళ పక్క అపార్త్మెంట్ లో రమణమ్మ భర్త వాచ్ మెన్ గా చేస్తున్నాడు. రమణమ్మ నాలుగిళ్ళలో పని చెసుకుంటూ భర్తకు చేదోడు వాదోదుగా ఉంటూ గుట్టుగా కాలం గడుపుతున్నారు. వారిక్ ముగ్గురు కుమార్తెలు. వారికి పెళ్ళిళ్ళు చేసి ఉన్నలో ఉన్నంత ముద్దుముచ్చట్లు, పెట్టుపోతలు చూస్తుంటారు. వాళ్ళు కూడా హైదెరాబాద్లోనే వేరు వేరు ప్రదేశాల్లో ఉంటున్నారు, పండక్కి, పున్నానికి వచ్చి పోతుంటారు.
కాలం ఎప్పుడూ ఒక్కలా నడవదు. రమణమ్మ భర్తకి రెండేళ్ళక్రితం క్షయ వ్యాధి సోకి సరిగ్గా పని చేయలేకపోతున్నాడు. రమణమ్మే ఇటు భర్తను చూసుకుంటూ, అటు అపార్త్మెంట్ పని కూడా తనే చేసుకుంటూంది. ఆమె పనితో సంతృప్తి చెందని వారు,  వీరిని తొలగించి కొత్త వాళ్ళని ఏర్పాటు చేసుకుందామని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రమణమ్మకి పుట్టెడు బెంగ పట్టుకుంది.  తన గోడంతా లలితకి చెప్పుకుని బాధపడింది. మరి నీ పిల్లలు ఉన్నారుగా వారికి చెప్పలేక పోయావా? వారి దాపునే ఉండి నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చుగా అంది లలిత. “అయ్యో తల్లే ఏం చెప్పమంటావు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. వాళ్ళకి చెప్తే “మా సంసారాలు  మేమే ఏదుకోలేకపోతన్నం. ఇంక నిన్నూ ఆ రోగిష్టి ముసలాడిని ఎక్కడ సూడగలం? మా మొగోళ్ళు ఒప్ప్పుకుంటారేట్?” అని కుందబద్దలుకొట్టినట్లు చెప్పేసారమ్మా అంది బాధగా..సరే.. ఏదో మార్గం అలోచిద్దాంలే! నువేమీ బెంగపడకు రమణమ్మా! అని ఆమెకు ధైర్యం చెప్పి పంపించింది.
లలిత యోగా టీచెర్. ఉదయం సాయంత్రం క్లాసులు చెప్తూ ఉంటుంది. మిగతాసమయం ఖాళీ కదా అని ఈమధ్యే ఒక ప్లే స్కూల్ ఆరంభించి నడుపుతూంది. స్కూల్ ని తన చాకచక్యంతో, తెలివితేటలతో  కొద్ది కొద్దిగా అభివృధ్ధి పథంలోకి తీసుకు వెల్తూంది. భర్త పిల్లలు వెళ్ళాక మిగత సమయాన్ని ఇలా వినియోగించుకుంటూంది. రమణమ్మ సమస్యని విని, ఆమెకెలాగయినా  ఏదో ఒక మార్గం చూపాలని ఆలోచిస్తూంది. రాత్రి భర్త తో కూడా ఈ విషయం  ప్రస్తావించింది.
ఈ మధ్యే లలిత ప్లే స్కూల్ అభివృధ్ధి చేసే ఉద్దేశంలో పిల్లల సామానులు, ఆట బొమ్మలు కొన్ని పెట్టుకుందికి పక్కనే ఒక గది తీసుకుంది. అది మదిలో మెదలి లలిత ఆలోచనకి ఒక రూపు వచ్చింది. మర్నాడు రమణమ్మతో ‘నువ్వు ఏం బెంగ పెట్టుకోకు  మా స్కూల్ లో ఆయాగా చేద్దువుగాని, నీకు అక్కడ ఒక గది ఇస్తాను. నువ్వు మీ ఆయన అందులో ఉండొచ్చు.ఓపికను బట్టి  మీ ఆయన ఏదైనా చిన్న పని చెయ్యొచ్చు. నువ్వు కూడా అక్కడ ఒకటి రెందు ఇంటి పనులు చేసుకో” అని చెప్పింది. ఒక్కసారి రమణమ్మ కళ్ళలో నీళ్ళు చిప్పిలాయి. సొంతపిల్లలు కూడా మా గురించి ఈపాటి అలోచించలేదమ్మా.. నామీద ఇంత నమ్మకంతో, సానుభూతితొ దారి చూపిస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవలమ్మా “ అన్న రమణమ్మతో “అంత పెద్ద మాటలు వద్దు ఏదో నాకు తోచిన సాయం చేస్తున్నాను అంది లలిత.  రమణమ్మ ముఖంలో సంతోషం, ధీమా చూసి ‘ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటనూ లేనే లేదనీ’ అని సన్నగా పాడుకుంటూ సంతృప్తిగా, ఉత్సాహంగా దినచర్య ప్రారంభించింది.



అమ్మ ఆదిగురువు.


అమ్మేగా ఆదిగురువు అడుగేసే వరకూ
నాన్నేగా ఆచార్యుడు బడికెళ్ళే వరకూ
ఒనమాలు దిద్దించిన ఒజ్జలనే మరువను
వారిమాట వేదవాక్కు వదిలెళ్ళే వరకూ
కళాశాల చదువుల్లో యేదోలోకం మాదీ
ఆరాధన గురువంటే అదిదాటే వరకూ
ఆగురువుల గొప్పదనం ఎంఏలో తెలుసా
వారంటే వణుకుగదా చదువయ్యే వరకూ
సాధిస్తూ పనినేర్పిన అత్తగారు గురువేగా
ఆసంగతి తెలిసిందా దివికేగే వరకూ
లోకమెరుగ నీయకుండ అన్నీతానే జేసే
అసలుగురువు తనేఅందు నేపోయే వరకూ !
జగద్గురువు నెరుగుదువా జంధ్యాలా నీవూ
ఆధ్యాత్మికమే అంటదు ఇదితెలిసే వరకూ !
**********************************
*

మదిలో కదిలిన భావం.

మదిలో కదిలిన భావం.

గతంలో జరిగిన చేదు అనుభవాలని నెమరేసుకుంటూ కుమిలిపోకు
గడిచినకాలం తిరిగి రాదని జరిగిన నష్టం సమసిపోదని తెలుసుకో..
దగాచేసినది దగ్గిరవారయినా దండించలేని నిస్సహయతకు విచారించకు.
పరమాత్ముడు పాపపుణ్యాల చిట్టాను రాసి ఉంచుతున్నాడని మరచిపోకు.
అందీ అందనిదానికోసం అర్రులు చాచి ఆరాటపడకు,
ఏ నీడలేని వానికన్న నీకున్న చిన్నపొదరిల్లును చూసి భాగ్యవంతుడనని తృప్తిపడు.
ఇతరులముందు చేయిచాచే దుస్థితి లేనందుకు ఆనందించు.
నీకున్నదానిలో అన్నార్తులకు పట్టెడన్నం పెట్టగలుగుతున్నందుకు గర్వించు.
నిలబెట్టే ఆశను వదలి, కృంగదీసే నిరాశను ఆశ్రయించకు.
ప్రతికూల భావాలను మట్టుపెట్టి, అనుకూలభావాలతో మనసును శాంతపరుచుకో.
గతాన్ని మర్చిపో, భవిష్యత్తు గురించి ఆలోచించకు, వర్తమానంలో సంతోషంగా జీవించు

సంఘర్షణ


 సంఘర్షణ.
ఎప్పుడు, ఎక్కడ ఎవరిపై, ఎందుకు కలుగుతుందో చెప్పలేని ఆత్మీయత.
ఆరాధన కావొచ్చు, ఆకర్షణ కావొచ్చు. మంచి స్నేహం కావొచ్చు.
కాంతులు చిందే నీ నగుమోము, పెదవులపై మెరిసే చిరుదరహాసం
చెప్పకనే చెప్తున్నాయి నీ మదిలో కలిగిన అనురాగాన్ని.
ఆ కన్నులలో మెరుపులూ, మదిలో మెదిలే అలజడులూ
ప్రతిబింబిస్తున్నాయి అంతర్గతంగా నీలో దాగిన మమకారాన్ని.
దాచినా దాగని భావొద్వేగం, అంతరంగంలో ఇముడ్చుకోలేని భావపరంపర.
తలచినంతనే కలిగే మథురానుభూతి,, తనువంతా వింత పులకరింత. 
అనుకోకుండా ఏర్పడిన అనుబంధాలు, అరాధనతో ముడివడి
అనురాగాన్ని కురిపించాయి.
ఆత్మీయ పలకరింపులు,  ప్రశంశలు, సంభాషణలు ఆనందానుభూతిని కలిగించాయి.
అంతలోనే ఎందుకో అనుబంధాన్ని, ఆత్మీయతని మరచిపోయి మౌనం వహించాయి.
ముందు కలిగిన మమత, మమకారం ఏమైనట్టో?
కాసేపు మనసు బాధతో మూలిగినా ఈ బంధాలన్నీ అశాశ్వతమనీ, 
పవిత్రమైన వివాహబంధం మాత్రమే శాశ్వతం అన్న జీవితసత్యం 
కళ్ళముందు కదిలి మనసు ఊరట చెందింది.


Wednesday 4 September 2019

'నల్లనివాడా నే గొల్లకనెనోయ్;



రావు బాలసరస్వతి గారు పాడిన 'నల్లనివాడా నే గొల్లకనెనోయ' పాట నా గళంలో.  విని మీ అభిప్రాయం తెలియబరచమని మనవి.