Tuesday 16 May 2017

ఆమెరికా మిరప తెలుగునేలపైకి....

వ్యాఖ్యను జోడించు
ఆమెరికా మిరప తెలుగునేలపైకి.....

13 – 14 శతాబ్దాల కాలంలో భారతదేశానికి దగ్గరమార్గం కనుక్కోవాలనే ప్రయత్నాలు ముమ్మరం అయాయి. నేలదారి ఎంత ప్రమాదకరమో అరేబియా సముద్రంలో ఓడ ప్రయాణం కూడా అంతే ప్రమాదకరం, అయిన పరిస్థితుల్లో భారతదేశం వచ్చి సురక్షితంగా సరుకు తీసుకెళ్ళే మార్గంకోసం వెదుకులాట ప్రారంభమైనది.

కోలంబస్ కూడా ఇండియాకి దారి కనుక్కొంటూ ఇలాగె బయల్దేరి పొరపాటున అమెరికా వైపు వెళ్ళాడని అంటారు. మెక్సికో సమీపంలో ఓడ చేరింది. అక్కడాయనకి యెర్రని పండ్లు కనిపించాయి. ఒకటి కొరికి చూసాడు. కారం నషాళానికి అంటింది. కారంగా ఉండే పళ్ళు కూడా ఉంటాయా?

కొలంబస్ దృష్టి మిరియాల మీద ఉంది. ఎక్కడ కారపురుచి కనిపిస్తుందో అదే ఇండియా అని ఆయన నమ్మకం. ఇక్కడ కారపుకాయలు కనిపించాయి. ఇదే ఇండియా అనుకున్నాడు.

మిరియాలు నల్లగా ఉంటాయి. కానీ ఇవి ఎర్రగా ఉన్నాయి కదా, వీటిని రెడ్ పెప్పర్ అన్నాడు. ఇండియన్లు నల్లగా ఉంటారు కదా – ఇక్కడి మనుషులు ఎర్రగా ఉన్నారు.వాళ్ళని రెడ్ ఇండియన్లు అని అన్నారు. ఆ తర్వాత తేలింది అది అమెరికా ఖండం అని. ఏమయితే నేం?కారంగా ఉండే మరో కాయలు కనుక్కోవడం జరిగింది.

స్థానికంగా రెడ్ ఇండియన్లు “చివే” అని పిలిచేవాళ్ళు. వీటిని యూరోపియన్లు “చిలీ” అన్నారు. కాలక్రమంలో అవి చిల్లీలగా మారాయి. స్పెయిన్ వాళ్ళు అమెరికా వెళ్లి ఓడలకొద్దీ మిరపకాయలు తెచ్చుకొని సంతోషించారు. కానీ, పోర్చుగీసులు ఒక అడుగు ముందుకెళ్ళి మిరపకాయల్ని ఓడలలో ఇండియాకు తీసుకొచ్చారు.

1751 లో ఇవి మొదట కేరళ చేరాయి. ఆ తర్వాత తెలుగునేలపై అడుగు పెట్టాయి. తెలుగువారు వీటిని మిరియపుకాయలు అన్నారు. మిరియపుకాయలె మిరపకాయలు అయ్యాయని భాషావేత్తలు చెప్తున్నారు. ప్రాకృత భాషలో ‘మిరి అం’ , ‘మరీచం’ అంటే మిరియాలు. మరీచం సంస్కృతంలో మరీచి అయింది. మరీచి అన్నపదమే మిర్చిగా మారి ఎర్రమిర్చి అనే మాట వ్యాప్తిలోకి వచ్చింది. మొత్తానికి మిరపకాయలకి ఇంత చరిత్ర ఉందన్నమాట.

(శ్రీకృష్ణదేవరాయ వైభవం పుస్తకంలోని ‘రాయలనాటి రుచులు’ అన్న అంశం పై జి.వి. పూర్ణచంద్ గారి వ్యాసం ఆధారంగా ...) పొన్నాడ లక్ష్మి.

రాగరంజితం

రాగరంజితం

తూర్పున బాలభానుడు ఉదయించే వేళ
భూపాలరాగంతో మేలుకొలిపావు.
మోహనరాగాన్ని ఆలపిస్తూ నా మదినిండా
మోహాన్ని రగిలించి పులకరింప చేశావు.
తోడిరాగ గమకాలతో నాకు
తోడునీడగా నిలిచావు
కదనకుతూహలంతో అప్పుడప్పుడు
ప్రేమయుధ్ధాలు చేసావు.
హిందోళ మధుర స్వరాలతొ నాకు
మధురిమలను చవిచూపావు.
వసంత రాగంతో నా జీవితమంతా
వసంతాన్ని నింపావు.
ఆనందభైరవి ఆలాపనతొ నా
అంతరంగాన్ని ఆనందభరితం చేసావు.
వేదనాభరితమైన నా హృదయానికి
శివరంజనితో సేద తీర్చావు.
మలయమారుతంలా నన్ను
చుట్టు ముట్టి ఉక్కిరిబిక్కిరి చేసావు.
రాగమాలికలతో మన సంసారాన్ని
అనురాగరంజితం చేసావు.

- పొన్నాడ లక్ష్మి

కౌమార్యం



కౌమార్యం

బాల్యం నుంచి కౌమార్యంలోకి అడుగిడిన రోజులు
బాధ్యతలు బ్రతుకుబరువు తెలియక తిరిగిన రోజులు
మనసులొ ఎవేవో వింత వింత వూహలు
కనులతో ఎవేవో కమ్మని కలలు కన్న రోజులు
ప్రపంచమంతా రంగుటద్దాలలో అందంగా కనిపించిన రోజులు
లంగా వోణీతో రెండుజడలతో గెంతుతూ ఆడుకున్న రోజులు
పాటలు పాడుకుంటూ త్రుళ్ళిపడుతూ తిరిగిన రోజులు
నిశ్చింతగా అమ్మానాన్నల లాలనలో కరిగిపోయిన రోజులు
చేతికిపండిన గోరింటాకు అమ్మ వేసిన మొగిలిపూవుల జడ
అందరికీ చూపించి మురిసిపోయిన రోజులు
అత్త కొడుకు బావతో పరాచికాలాడుతూ అల్లరిపెట్టిన రోజులు
గవ్వలాడుతూ శివరాత్రి జాగరణ చేసి మర్నాడు
పంతులమ్మతో చీవాట్లు తిన్న రోజులు
ఆ పంతులమ్మలే విరామ సమయంలో నాచేత
ఏరికోరి పాటలు పాడించి మెచ్చుకున్న రోజులు
అంతిమ పరీక్షల ముందు విద్యార్ధులకీ గురువులకీ
వీడ్కొలు చెప్తూ కంటతడి పెట్టుకున్న రోజులు
ఆందోళనతో అంతిమ పరీక్షలు రాసిన రోజులు
ఫలితాలు తెలిసి ఇంటిల్లపాదీ ఆనందించిన రోజులు
మరపురాని మధురమయిన తిరిగిరాని రోజులు

Ponnada Lakshmi

Monday 15 May 2017

నీవే రక్షింతువు గాక నిన్ను నమ్మితిమి మేము అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.
నీవే రక్షింతువు గాక నిన్ను నమ్మితిమి మేము
దైవమవై నీవుండగ తగ మాదే బ్రతుకు.
కోరి వొకరాతివీరు గొల్చి బతికీనొకడు
పైరు వొక్క చెట్టువెట్టి బతికేననీ నొకడు
కూరిమి బాము చేపట్టుకొని బతికీ నొకడు
శ్రీరమణుని దాసుల చేతిదేపో భాగ్యము.
ఇసుమంత మన్ను వట్టి యేచి బతికీ నొకడు.
పసురము నింటగట్టి బతికేననీ నొకడు
పసగా వేలె డినుము పట్టి బతికీ నొకడు.
వశుధేశ నీవు గలవారి కేమి గడమ.
ఆకునలము గసవునంటి బతికీ నొకడు
లోకులు పెక్కుపాయాల లోలులై బతికీ రదే
యీకడ శ్రీ వేంకటేశ ఇవెల్లా నీ మహిమలే
చేకొని నీమరగు చొచ్చినవారే ఘనులు.
అర్ధ పరమార్ధం.
శ్రీ వేంకటేశా! మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము. నువ్వు మాకు దైవంగా వుండగా వివిధ వృత్తులలో ఉండే మా భక్తులమందరము మా అభిరుచికి తగినట్లుగా బతుకుతున్నాము. నీ అనుగ్రహం కలిగిన బతుకు మాది.
ఇష్టపడి ఒకడు దేవాలయములో దైవరూపంలో ఉన్న వీరుని విగ్రహాన్ని (రాతివీరు) పూజించి బతుకుతున్నాడు.(పూజారి).
రైతు వేసిన పంత మధ్యలో ఒక చెట్టు పెట్టి దానిమీద వచ్చే ఆదాయంతో ఒకడు బతుకుతున్నాడు.(వ్యాపారి లేదా రైతు).
ప్రేమతో పాముని చేత పట్టుకొని ఆడిస్తూ ఒకడు బతుకుతున్నాడు. (పాములవాడు లేదా గారడీవాడు).
శ్రీకి ఇష్టమైన వేమ్కటేశుని దాసులుగా ఉంటే చాలు - వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా అదృష్టవంతులే.
ఒకడు చాలా మట్టిని పట్టుకొని మదించి, పిసికి బతుకుతున్నాడు. (కుమ్మరి)
పశువులను ఇంట్లో కట్టుకొని (అంటే వాటిని మేపుతూ పాలు మొదలైనవి తీసి అమ్ముకుంటూ) ఒకడు బతుకుతున్నాడు (గొల్లవాడు).
చాతుర్యముతో ఒక చిన్నపాటి ఇనుమును పట్టుకొని, ఆయుధాలు, పనిముట్లు తయాఎఉ చేసి బతుకుతున్నాడు. (కమ్మరి). ఓ భూపతీ నీ దయ ఉన్నవారికి ఏమి కొరత?
ఒకడు గడ్డీ గాదము ఏరుకొని (అంటే వాటిని పీకుతూ, అమ్ముతూ) బతుకుతున్నాడు (రైతుకూలీ, రోజుకూలీ).
లోకులు ఇలా అనేక వృత్తులకు సంబంధించిన ఉపాయాలతొ బతుకుతున్నారు. ఈ ప్రపంచములో ఈ వృత్తులకు సంబంధించిన నైపుణ్యాలన్నీ నీ మహిమలే. ఆదరముతో, భక్తితో నీ శరణు చొచ్చినవారే, నిన్ను శరణన్నవారే ఈ లోకంలో ఘనులు.
సంకలనం, వ్యాఖ్యానం..డా॥ తాడేపల్లి పతంజలి.
LikeShow More Reactions
Comment

అమ్మా! నిర్భయా!

అమ్మా! నిర్భయా!
తూట్లు పడిన దేహంతో, ఛిద్రమయిన పేగులతో, మృత్యువుతో
పోరాడుతున్న నిన్ను చూచి, విదేశీ వైద్యులు సైతం విస్తుబోయారు తల్లీ!
ఒక అబలను నిస్సహాయస్థితిలోకి నెట్టి ఇంత రాక్షసంగా
అనుభవించొచ్చని వారికప్పుడే తెలిసిందేమోనమ్మా!
ఆరుగురి మానవమృగాల చేతులలో ఆటబొమ్మవయి
ఎన్ని చిత్రహింసల పాలయినావో? ఎంతగా ఆక్రోశించావో తల్లీ!
నీ ఆక్రందన, ఆవేదన ఒక్క దేవుడి కయినా వినిపించలేదంటే
ఆ భగవంతునిపైననే నమ్మకం పోయింది అమ్మా!
మంచితనంతో వారిని మార్చాలని మానవతావాదులు
నీతిబోధలు చేస్తుంటే ఔరా! ఎంత దయ! అనిపించిందమ్మా..
నువ్వు పడిన చిత్రహింస తలుచుకుంటె మాకే నిద్ర రావట్లేదు,
ఇంక నిన్ను కన్నవారిని ఏమని ఓదార్చగలము తల్లీ!
వేదభూమి, పవిత్ర భారతావని ఇంత క్రూర రాక్షసులకు ఆలవాలమా?
అని ప్రపంచమంతా నివ్వెరబోయి నిశ్చేష్టిత అయింది తల్లీ!
ఆ నరరూప రాక్షసులకు ఇంతవరకూ శిక్ష అమలు జరగలేదంటే
ఎక్కడుంది న్యాయం? ఏదీ మానవత్వం? ఏ స్త్రీకయినా ఏదీ రక్షణ ?

అమ్మకి స్మృత్యంజలి

అమ్మకి స్మృత్యంజలి..
చిన్న వయసులోనే భర్తని కోల్పోయి
ఆత్మస్థైర్యంతో సంసార నావను
నడిపించిన ధీశాలి మా అమ్మ.
కలిమి లేకపోయినా చెలిమిని పంచిన
అనురాగమూర్తి మా నాన్నగారిని నిత్యం
స్మరించుకుంటూ కర్తవ్యపాలన చేసిన మా అమ్మ.
దగ్గిరబంధువులే దగా చేసినా వారిని
నిందించకుండా కర్మసిధ్ధాంతాన్ని నమ్ముకుని
బతుకు బండిని నడిపిన మా అమ్మ.
సంసారపు బండిలో ఒక చక్రం విరిగిపోయినా
రెండుచక్రాలు తానే ఐయి నేర్పుతో, ఓర్మితో
సంసారనౌకను ఒడ్డుకు చేర్చించిన మా అమ్మ.
ఇంటికి వచ్చినవారికి తనకున్నదానిలో
ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించి,
వారిని తృప్తిపరచి ఆనందం పొందిన మా అమ్మ.
కష్టాలకడలిలో ఎదురీదుతూ మాకు
విద్యాబుధ్ధులు నేర్పించి, మా జీవితాలకు
ఒక అర్ధం పరమార్ధం చూపించిన మార్గదర్సి మా అమ్మ.
- పొన్నాడ లక్ష్మి