Monday 30 March 2015

దేవ దేవం భజే దివ్యప్రభావంరావణాసురవైరి రణపుంగవం



ఈ వారం అన్నమయ్య కీర్తన : రామనవమి సుందర్భంగా ఈ కీర్తనా రత్నం:

దే దేవం భజే దివ్యప్రభావంరాణాసురవైరి ణపుంగవం

రావరశేఖరం వికులసుధాకరం
జానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం

నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం

పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం


భావం: దేవదేవా ! నిన్ను భజిస్తున్నాను. దివ్యమైన ప్రభావం కలవాడవు. రావణుడి శత్రువువి, రణరంగంలో వీరుడివి. నీకు నమస్సులు.

       రాజవరులలో అగ్రగణ్యుడివి. సూర్యవంశ సుధాకరుడివి, ఆజానుబాహుడివి (పొడవైన చేతులు కలవాడు. నిల్చుంటే అరచేతులు మోకాళ్లను తగులుతాయి. అటువంటి వారిని ఆజానుబాహుడని అంటారు.) నీలమేఘ శరీరం కలవాడివి. రాజులకు శత్రువైన పరశురాముని మెప్పించినవాడివి, ఎర్రతామర రేకుల వంటి కన్నులు గలవాడా! (శ్రీముని కళ్ళు కొంచెం ఎర్రగా ఉంటాయని అంటారు) రామచంద్రా ! నిన్ను భజిస్తున్నాను.

       వర్షాకాలంలో వచ్చే దట్టమైన కారుమేఘవంటి శరీరవర్ణం కలవాడా, ఘనమైన, విశాలమైన వక్షస్థలం కలవాడా, స్వచ్చమైన జలజాన్ని నాభి యందున్నవాడా, ఒకే బాణంతో తాల వృక్షాలను నరికి, వాలిని వధించి ధర్మ సంస్థాపనం చేసిన వాడా, (తాలాహినగహరం అన్న పదప్రయోగానికి సరి అయిన అర్ధం నాకు తెలియలేదు. తెలిసింది రాసాను. తప్పయితే క్షమించి సరి అయిన అర్ధం తెలియజేస్తారని ఆశిస్తున్నాను.)  భూమిజకు అధిపతి అయినవాడా, భోగి శయనుడా! రామా! నిన్ను భజిస్తున్నాను. 

       పంకజాసనుడైన బ్రహ్మదేవునిచే కీర్తింపబడిన వాడా, నారాయణుడా, శంకరుని అర్చించి పొందిన జనకుని విల్లుని విరిచి సీతను చేపట్టినవాడా, లంకను జయించి, విభీషణుని లాలించినవాడా, వేంకటాద్రిమీద నున్న  సాధుపుంగవుల చేత నుతింపబడినవాడా, శ్రీ రామా ! నిన్ను భజిస్తున్నాను. నన్నురక్షించు.

Monday 16 March 2015

తాళ్ళపాక అన్నమాచార్యులు

తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి.  ఫాల్గుణ బహుళ ద్వాదశి:
          ఈ రోజు పదకవితాపితామహుడు అన్నమయ్య వర్ధంతి. ఆరువందల సంవత్సరాల క్రితం నారాయణసూరి లక్కమాంబ దంపతులకు సర్వధారి నామ సంవత్సరం వైశాఖ పున్నమి (1408) నాడు తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. ఎనిమిదేళ్ళ వయసులోనే కాలినడకన ఏడుకొండలూ ఎక్కి స్వామిని దర్శించి ‘పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా’ అని కీర్తించి తరించిన మహానుభావుడు.
          అన్నమయ్య కీర్తనలలో భక్తీ, శృంగారం, తత్వం, వేదాంతం, జానపదం ఒకటేమిటి అన్ని సారాంశాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి.  32,000 కీర్తనలను రచించి తరించిన ఘనాపాటి.  మనకు లబించినవి 14,000 కీర్తనలే అయినా  అవి మన గుండెల్లో, తెలుగువారి లోగిళ్ళలో సజీవంగా ఈనాటికీ వీనులవిందుగా వినిపిస్తున్నాయి. అలతి అలతి పదాలతో అచ్చతెనుగు నుడికారంతో జానపదుల నోళ్ళలో సైతం నానేలా తన పదకవితా వైభవాన్ని ఆవిష్కరించాడు.
          వేంకటేశుని పాదపద్మములనే మనసున నిలిపి భక్తి పారవశ్యంతో మైమరచిపోయేవాడు. అంతలోనే వేడుకుంటూ, మరంతలోనే నిష్టూరమాడుతూ స్వామిని నిలదీసేవాడు. స్వామిపట్ల అంత చనువు, అధికారం అన్నమయ్య ఒక్కడికే స్వంతం.  ఒక కీర్తనలో అయితే ‘నాకు నీ అండ ఉంది నీకెవరున్నారు’ అని స్వామికంటే తనే గొప్పవాడినని స్వాతిసయం చూపిస్తాడు. అంతలోనే అమ్మవారికి ఫిర్యాదు చేస్తాడు.
          ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాతృమూర్తులకు అన్నమయ్య వ్రాసిన జోల పాటలు ఒక ఎత్తు. “జో అచ్యుతానంద  జో జో ముకుందా’” అన్న లాలిపాట, పసిపిల్లలకు చందమామని చూపిస్టూ గోరుముద్దలు తినిపిస్తూ పాడే ‘చందమామ రావే పాట నాటినుంచి నేటివరకూ తెలుగింట ప్రతి అమ్మనోట పలుకుతున్నాయి.
          పండితులకే కాకుండా “సామాన్యులకు  సైతం రసజ్ఞత జోడించి చెప్పిన కవి అన్నమయ్య’ అని విద్వాన్ విశ్వం తన మాటలలో చెప్పారు. అన్నమయ్య  ఆనాడే సంఘ సంస్కర్తగా, మహిళా అభ్య్దయవాదిగా వ్యవహరించాడు. ప్రస్తుత సమాజానికి ఏమి అవసరమో అవ్వన్నీ ఆనాడే తన కీర్తనలలో పొందుపరిచాడు. “పరుల మనసుకు ఆపదలు కలుగజేయు పరితాపకరమయిన బ్రతుకేలా” అన్న కీర్తనలో వ్యక్తి నడవడిక ఎలా ఉండాలో వివరించిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు అన్నమయ్య.
 మేలుకొలుపు పాటలు, జోలపాటలు, పెళ్లిపాటలు, సువ్వి పాటలు, విరహపు పాటలు, జాజర పాటలు ఇలా సామాన్య జీవితాలలో ప్రతి దశనూ సంబంధించిన కీర్తనలను అన్నమయ్య మనకు అందించాడు. మొత్తమ్మీద తన జీవిత కాలంలో ముఫయి రెండు వేల సంకీర్తనలు, పన్నెండు శతకాలు, ద్విపద రామాయణం, శృంగార మంజరి, వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తన లక్షణం, ఇలా ఎన్నో రచనలు చేసిన అన్నమయ్య అజరామరుడు.
          దుందిభినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు (1503) అన్నమయ్య శ్రీనివాసునిలో ఐక్యమయ్యాడు. తెలుగు జాతికి తరగని సాహితీ సంపదని అందించిన నా అన్నమయ్య అమరుడు.
          అన్నమయ్య కీర్తనలు ఆంద్ర దేశానికి అమృత గుళికలు.
పోన్నాడ లక్ష్మి – 17.03.2015)

Thursday 12 March 2015

వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ - అన్నమయ్య కీర్తన







ఈ వారం (14.03.2015)  అన్నమయ్య కీర్తన
స్వామివారి దర్శనార్ధం ఈ రోజు మా తిరుపతి ప్రయాణం. అందుచేత ఓ రోజు ముందుగా ఈ అన్నమయ్య కీర్తన

|| వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ ||

|| వెలయ నీట జోప్పువేసేటి దొంగ | తలగాననీక దాగుదొంగ |

తలకక నేలదవ్వేటిదొంగ | తెలిసి సందెకాడ దిరిగేటి దొంగ ||

|| అడుగుకింద లోకమడచేటి దొంగ | అడరి తల్లికినైన నలుగుదొంగ |
అడవిలో నెలవైయున్న దొంగ | తొడరి నీలికాసెతో నుండుదొంగ ||

|| మోస మింతుల జేయుమునిముచ్చుదొంగ | రాసికెక్కినగుఱ్ఱంపుదొంగ |
వేసాల కిటు వచ్చి వెంకటగిరిమీద | మూసినముత్యమై ముదమందుదొంగ |

అన్నమయ్య ఈ కీర్తనలో పరమాత్ముణ్ణి దొంగగా అభివర్ణిస్తాడు. ఇందులో అవతారాలన్నీ దాగి ఉన్నాయి.గమనించండి. అన్నమయ్య స్వామిని ఒకసారి దొంగగా, ఒకసారి నల్లని భూతంగా ఇంకోసారి, భూభారాన్ని మోసే జగన్నదుడుగా వర్ణిస్తాడు. పరమాత్ముణ్ణి  ఎన్ని రకాలుగా స్తుతించినా, ఏవిధంగా నినదించినా అది అన్నమయ్యకే చెల్లు.
వీడొక వింత దొంగ, వేడిపాలు, వెన్న దొంగలించే దొంగ.
నీటిలో కాపు వేసి వేదాలని తీసుకున్న దొంగ, తల కనిపించకుండా దాచుకొనే దొంగ, నేలని తవ్వి తీసుకున్న దొంగ, సందె వేళలో తిరిగేటి దొంగ.
అడుగుకింద లోకాన్ని అణిచిన దొంగ, తల్లికి పునర్జన్మ నిచ్చిన దొంగ,  అడవిలో కాపురమున్న దొంగ, నీలిరంగుతో తిరుగాడే దొంగ.
మోసంతో స్త్రీల మానములను హరించిన దొంగ, రాసికెక్కి గుర్రమును ఎక్కి తిరిగే దొంగ, ఇన్ని వేషాలు వేసి వేంకటగిరిమీద మూసినముత్యంలా ముదమొందే దొంగ.

Friday 6 March 2015

నూరవద్దు తాగవద్దు నోరు చేఁదుగావద్దు - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన: 

ప.     నూరవద్దు తాగవద్దు నోరు చేఁదుగావద్దు
•       
చేరువ నొకచోట సంజీవి వున్నదిదివో. IIపల్లవిII

•       
పొలమెల్లాఁ దిరిగాడి పొడిఁబడనెవద్దు
•       
తలఁకక గడ్డపారఁ దవ్వవద్దు
•       
వలవని వాఁగుల వంకల వెదకవద్దు
•       
చెలఁగి వొకచోట సంజీవి వున్నదిదివో. IIనూరII

•       
మొక్కలానఁ జెరువులో మునిఁగి చూడవద్దు
•       
నిక్కిన పుట్టలమీఁద నెమకవద్దు
•       
వెక్కసానఁ జేతిపైఁడి వెలవెట్టి కొనవద్దు
•       
చిక్కులెల్లాఁ బాపెటి సంజీవి వున్నదిదివో. IIనూరII

•       
దీవులను నోడలెక్కి తిరుగాడనేవద్దు
•       
సోవల బిలములోనఁ జొరవద్దు
•       
కావించి గ్రహణాదికాలము వెదకవద్దు
•       
శ్రీవేంకటనాథుఁడై సంజీవి వున్నదిదివో. IIనూరII


భావం:
 చేదు మందులని నూరుకొని తాగవద్దు. మనకి దగ్గరలో ఉన్న వెంకటనాదుడే సంజీవని. ఇదిగో ఇక్కడనే ఉన్నది.
పొలమంతా తిరిగి అలసిపోవద్దు. గడ్డ పారలతో తవ్వి తవ్వి చూడవద్దు. వాగులలో వంకలలో వెదకవద్దు. ఇదిగో ఒకచోట సంజీవి ఉన్నది.
చెరువులో మునిగి చూడవద్దు. పుట్టలమీద వెదకవద్దు. చేతిలోనున్న బంగారాని పెట్టి కొనవద్దు. చిక్కులన్నిటిని దీర్చే సంజీవి ఇదిగో ఇక్కడనే ఉంది.
ఓడలేక్కి దీవులన్నీతిరుగ వద్దు. కొండ గుహలలో జోరబడి వెదకవద్దు. గ్రహణాల సమయంకోసం ఎదురుచూసి వెదకవద్దు. శ్రీ వెంకటనాధుని రూపంలో సంజీవి ఇక్కడనే ఉన్నది.
మనకి అత్యంత దగ్గరలో ఉన్న పరమాత్ముని కనుగొనలేక ఎక్కడెక్కడో వెదకి వేసారి పోవద్దని అన్నమయ్య ఈ కీర్తనలో విశదీకరించాడు.
(పొన్నాడ లక్ష్మి)