Wednesday 16 January 2019

యిరవగుజీవుల కెంతగలిగినా పరధనకాంతలే బలుప్రియము - అన్నమయ్య కీర్తన






అన్నమయ్య కీర్తన :
ఈ లౌకిక ప్రపంచమంతా మాయామయం. ఈ మాయను మానవుడు సులభంగా దాటగలడా? కనుక భగవంతుని శరణుజొచ్చి మాయ మేలిముసుగులో నుంచి మనం బయటపడాలి. ఏదో ఒక అద్భుత సంఘటన జరిగి ఆ శ్రీహరి కృప కలిగితే చెప్పలేము కానీ అన్యులకు ఇది దుస్సాధ్యం అంటున్నాడు అన్నమయ్య.
పల్లవి: కటకట యీమాయ గడచుట యెట్లో
ఘటనల హరికృప గలిగినఁ గాక
చ.1. యిరవగుజీవుల కెంతగలిగినా
పరధనకాంతలే బలుప్రియము
ధరఁ గర్మాపుఁజేతలలోనెల్లా
సొరదిఁ బాపమే సులభము ॥కటకట ||
చ.2. నానారుచులు యనంతము గలిగిన
కానిపదార్ధమె కడుఁ దీపు
పానిన చదువుల పఠన లుండగా
మానని దుర్బాషమాఁటలే హితవు ॥కటకట॥
చ.3. యెదలో శ్రీవేంకటేశ్వరుఁడుండఁగ
సదరపు దివిజులు చవులయిరి
అదనను శ్రీగురుయానతి గలుగఁగ
పొదిగొని యివి తలపోయఁగ వలెసె ॥కటకట॥
విశ్లేషణ:
అయ్యయ్యో! ఈ మాయను దాటడం ఎటుల? అర్ధం కావడంలేదు. ఏదైన దైవ సంఘటన జరిగి ఆ శ్రీనివాసుని దయ కలిగితే వేరే విషయం కానీ మామూలుగా దాట శక్యమా!
చ.1.
ఆహా! శ్రీహరీ! ఈ భువిపై స్థిరంగా ఉన్న జీవులు ఎంత చిత్త చాపల్యం కలిగినవారు? వీరికి ఎంత ధనం ఉన్నప్పటికీ పరధనం మాత్రమే వీరికి ప్రియము. ఇంట సతి ఉన్నప్పటికీ పరకాంతలమీదనే వీరి ధ్యాస! ఈ భూమిపై పుణ్యకార్యాలు చేయాలంటేనే అందరికీ కష్టం. పాపకార్యాలు వరుసగా చేస్తూఆ విషయంలో మాత్రం ముందుంటారు కదా!
చ.2.
మనకు తినడానికి తయారుగా అనేక పదార్ధాలు ఉన్నప్పటికీ, మనకు కాని పదార్ధమే ఎక్కువ తీపుగా ఉంటుంది కదా! పొరుగింటి పుల్లగూర రుచి చందాన ఉంటుంది మన నైజం. అలాగే మనం ఎంతో కష్టపడి గురుశుశ్రూష చేసి వేద,వేదాంగాలను చదువుకుని నెమరు వేసుకోవడానికి భగవంతుడిని ధ్యానించడానికి నాలుకపై తయారుగా ఉన్నప్పటికీ, మనం అనకూడని మాటలు పాపపూరిత భాషణలే సదా చేస్తూ ఉంటాము. అవే మనకు ఇష్టంగా ఉండడం మాయకాకపోతే మరి ఏమిటి?
చ.3.
అందరి హృదయక్షేత్రాలలో స్థిరంగా నెలకొని శ్రీవేంకటేశ్వరస్వామి ఉండగా, తేలికగా అనుగ్రహం కలుగుతుందని వెళ్ళి చిల్లరదేవుళ్ళను చేరి ఇష్టప్రీతి కొలవడం ఎందుకు? తగిన సమయంలో గురువుగారి శిష్యరికం చేసి ఆయన ఆశీర్వాదం పొందవలెను గదా! అలా చేసినట్లైతే మనకు అనేక సమస్యలు నశించి ధన్యులవడం తధ్యము అని అన్నమయ్య నివేదిస్తున్నాడు.

అక్కర కొదగని యట్టి అర్ధము లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే - అన్నమయ్య కీర్తన




అన్నమయ్య కీర్తన
పల్లవి: అక్కర కొదగని యట్టి అర్ధము
లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే
చ.1. దండితో దనకు గాని ధరణీసు రాజ్యంబు
యెండె నేమియది పండే నేమిరే
బెండు పడ గేశవుని బేరుకొనని నాలికె
వుండనేమి వుండకుండ నేమిరే ॥ అక్కర ॥
చ.2. యెదిరి దన్ను గానని యడపుల గుడ్డికన్ను
మొదల దెరచెనేమి మూసెనేమిరే
వెదకి శ్రీపతి సేవ వేడుక జేయని వాడు
చదివెనేమి చదువు చాలించె నేమిరే ॥ అక్కర ॥
చ.3. ఆవల నెవ్వరు లేని అడవిలోని వెన్నెల
కావిరి గాసెనేమి కాయకున్న నేమిరే
శ్రీవేంకటేశ్వరుని జేరని ధర్మములెల్ల
తోవల నుండెనేమి తొలగిన నేమిరే ॥ అక్కర ॥
భావం :
మనదగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ మనకు అవసరమైనప్పుడు అది మనకు అక్కరకు రావాలి కదా! అలా కానప్పుడు ధనం ఎంతవున్నా ఉపయోగశూన్యమే కదా! అసలు లేకపోయినప్పటికీ ఉపయోగం ఏమీ ఉండదు అని అర్ధాన్ని గూర్చిన గొప్ప సత్యాన్ని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.
1. దేశాన్ని పరిపాలించే చక్రవర్తికి లేక మహారాజుకు ధనం దండిగా ఉండాలి. అలా కాకపోతే ఆ రాజుగారికి ఏమి ఉపయోగం ఉండదు కదా! బలహీనుడైన మానవుడు కేశవుని నామం జపించి రక్షణ పొందాలి అలా కాని నాడు ఆ నాలుక ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి?
2. విరోధులను ఎదిరించడానికి కండ్లు కావాలి. దానికి ఉపయోగించనటువంటి కన్నులు ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? అలాగే శ్రీపతిని కన్నులతో వెదకి వెదకి పట్టుకుని సేవించగలగాలి. అలా చేయని వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఉపయోగం ఏమిటి?
3. ఎటువంటి మనుష్య సంచారంలేని అడవిలో ఎంత పున్నమి వెన్నెలలు కాస్తే మాత్రం ఉపయోగం ఏమిటి? ఎవరికి ఉపయోగం? ఆ వెన్నెల చీకటిని తొలగించినా ఏమీ ఎవరికీ ఉపయోగం ఉండదు కదా! మానవుడు ఏ ధర్మ శాస్త్రాలు చదివినా పురాణాలు చదివినా దానికి పరమార్ధం ఏమిటి? చదివినది ఏ చదువైనప్పటికీ అది శ్రీవేంకటేశ్వరుని దరికి జేరే మార్గం నేర్పాలి. అలా కానప్పుడు మన జీవనంలో ఎన్ని వేదాలు, ధర్మాలు, శాస్త్రాలు పురాణాలు చదివితే నేమిటి? చదవకపోతే నేమిటి? అన్నీ వృధానే కదా!