Saturday 25 November 2017

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా! - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను
సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా!

ఊరుకున్న జీవునికి ఒక్కఒక్క స్వతంత్రమిచ్చి
కోరేటి   అపరాధాలు  కొన్నివేసి
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటా
దూరువేసే వింతగా దోషమెవ్వరిదయ్యా?

మనసు చూడవలసి మాయలు నీవే కప్పి
జనులకు విషయాలు చవులు చూపి
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటే కర్మమిచ్చి
ఘనముసేసే విందు కర్తలెవరయ్యా?

వున్నారు ప్రాణులెల్లా నొక్క నీ గర్భములోనే
కన్న  కన్న  భ్రమతలే  కల్పించి
ఇన్నిటా శ్రీ వేంకటేశ ఏలితివి మిమ్మునిట్టె
నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసు నయ్య!

భావం.. స్వామీ! ఓ వెంకటేశా! నీవు సర్వాత్మకుడవు. నేను నీ శరణు కోరేవాడినై సర్వపరాధాలకు కారణభూతుడైతిని. చాలు చాలయ్యా!
ఊరకే ఉన్న జీవునికి ఎంతో స్వతంత్రమిచ్చి కొన్ని విషయాలు సృష్టించి, అవి చెయ్యకుంటే నరకము, చేస్తే స్వర్గము అని చెప్పి మళ్ళీ మమ్మల్ని వింతగా నిందిస్తున్నావు. ఇందులో దోషమెవరిదయ్యా?
మనసుతో చూడవలసిన వచ్చినవాటికి మాయలను నీవే కప్పిపుచ్చి, మాకందరికీ ఎన్నో విషయాలు రుచి చూపించి, ఇందులో మంచిచెడ్డలు కనుగొంటే మోక్షమిచ్చి, కానుకోక వాటికి లోబడితే కర్మమునిచ్చి గొప్పగా చేసేనని చెప్తావు. ఇందుకు కర్త ఎవరయ్యా?
ప్రాణులందరూ నీ గర్భములోనే ఉన్నారు, మేమే కన్నామని మాకు భ్రమ కల్పించుతావు. జగత్తునంతా నీవే ఏలుతున్నావు. అంతా నీ చేతిలోనే ఉంది. ఇంక నన్ను నీవు, నిన్ను నేను ఎంచుకుంటే ఎలా?  నీకే తెలుసు గదయ్యా..

Friday 17 November 2017

ఈ వారం అన్నమయ్య (పెదతిరుమలాచార్య, అన్నమయ్య కుమారుడు) కీర్తన :

ఈ వారం అన్నమయ్య (పెదతిరుమలాచార్య, అన్నమయ్య కుమారుడు) కీర్తన :
అదే వంటశాలలోన అలిమేలుమంగనాంచా
రెదుట శ్రీవేంకటేశు కితవైనట్లు ॥
వెండిపైడి చట్లలో వేరె కూరలెల్ల
వండించి దొంతివెట్టించి వద్దనుండి
కొండలపొడవుగాగ కోటిబోనా అపరంజి
కుండల గుమ్మరింపించి కొలువై కూచుండీ ॥
పానకాలు శిఖరులు పటికింపు గొప్పెరల
పూని వాసనలుగాగ పువ్వు గట్టించి
వానినే నీలపుఅత్తువములనే నించి నించి
ఆనించుకొని వడ్డించ నాయత్తపడీని ॥
అందెలు గల్లు రనగా నడుగులు పెట్టిపెట్టి
విందు అలమేలుమంగ వేళ వేళను
చెంది శ్రీవేంకటపతికి చేతులకు గడిగడి
అందియిచ్చి సొత్తున దా నారగించి నదివో ॥
పెదతిరుమలయ్య వినిపిస్తున్న ఈ చక్కని సంకీర్తనలో దేవి అలిమేలుమంగ వంటశాలలో తయారుచేసిన వేడివేడి వంటకాలలోంచి తిరుమలేశునికిష్టమయిన కూరలు, రుచికరమయిన పదార్ధాలు, పానకాలు స్వామి చేతికందిస్తూ కలిసి భుజించిందట. చదివి మీరు ఆనందించండి.
దేవి అలిమేలుమంగ నాంచారి అదే వంటశాలలో పతి శ్రీవేంకటేశ్వరుని ఎదుట కూర్చుని ఆయనకు హితవైనట్లు వడ్డించిందట. బంగారు వెండి గిన్నెలలో రకరకాల కూరలు తెచ్చి దొంతరగా పెట్టించి ఒకదానివెనుక ఒకటి వడ్డించింది. రకరకములైన చిత్రాన్నములను స్వామి ఏడుకొండలు పొడుగ్గా వరుసగా ఉన్నట్లు వడ్డించింది. బంగారు కుండలలో కుమ్మరించి కొలువై కూర్చుని వడ్డించింది. పెద్దపెద్ద పాత్రలలో పటికబెల్లపు శిఖరాలుగా పోసి మంచినీటితో కలిపి చక్కని పానకాలు చేసారు. సువాసనకోసం కొంత కుంకుమపువ్వు కలిపి నీలములతో చేసిన గరిటలతో నించి స్వామికి ఆనుకును కూర్చుని వడ్డించిందట. దేవి కాలి అందియలు ఘల్లుఘల్లుమని ధ్వనిస్తుంటే నాజూకుగా చిన్నచిన్న అడుగులు పెట్టుకుంటూ అలిమేలుమంగమ్మ సరైనవేళకు శ్రీ వేంకటేశునకు వడ్డించింది. స్వయంగా ఆయన చేతులకు అందించింది. ఆయన పొత్తుననే తానూ కూర్చుని అదిగో దేవి కూడా ఆరగించింది.
భర్తకి ఇష్తమైన పదార్ధాలను వండి ఆప్యాయంగా పక్కన కూర్చొని ఒక్కొక్కటీ వడ్డించి సంతృప్తిపరచడం మన భారత స్త్రీ సంప్రదాయం. అదే విషయాన్ని పెదతిరుమలయ్య ఈ కీర్తనలో ఎంతో అందంగా వివరించాడు.
- పొన్నాడ లక్ష్మి (వ్యాఖ్యానం : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు)

Saturday 11 November 2017

అందరికొక్కటే చాలు ఆండ్లకు మొగలకు ముందటెత్తు వేరే నీతో మోవనాడవలెనా - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన :

అందరికొక్కటే చాలు ఆండ్లకు మొగలకు
ముందటెత్తు వేరే నీతో మోవనాడవలెనా
వలపుల ఈది ఈది వాసులకే లోగి లోగి
అలుకలే తవ్వి తవ్వి యట్టె నవ్వి
చెలగేటి విరహివి చింత మాన్ప నెరగనా
చెలి నింతే నీకు నేను చెప్పి చూపవలెనా
బలిమై చేయి చాచి చాచి పంతాన మెయి దోచిదోచి
పలుకాక గందికంది భామల బొంది
కులుకుజాణడవు నా కోర్కె తీర్పనెరుగవా
ఇలా నే జవ్వని నింతే ఇంతరట్టు వలెనా
పలుకులే చల్లిచల్లి పారిపారి మళ్ళీ మళ్ళీ
వలరాచపనులకే వయ్యాళి వెళ్ళి
తలచి శ్రీవేంకటేశ తగ నన్ను గూడితివీ
వెలయు నీదేవి నింతే వేదుకొనవలెనా

భావం :
అన్నమయ్య చెప్పిన ఈ కీర్తనలో, ఆడువారైనా, మగవారైనా అందరికీ ఒక్కటే మాట చాలును అంటారు. ముందటనే ఎత్తుగడగా నిన్ను నొప్పించేటట్లు నాకు మాటాడవలఇన పనియేమి.
ఆడువారికైనా మగవారికైనా ఒక్కటే నీతి కదా స్వామీ ! నీవు వనితల వలపులలో ఈది ఈది, వారి చూపే వాసులకు (ఆధిక్యమునకు) లొంగి లొంగి వారి అలకలు తీర్చి తీర్చి మళ్ళీ మధురంగా వాళ్ల విరహతాపమును నీవే అనుభవిస్తూ వారి చింత బాపుట ఎరుగుదవు. నీకు నేను నెచ్చిలినే కదా స్వామీ ! వేరే నీకు చెప్పవలనా ?
స్వామీ ! బలిష్టమయిన నీ చేయి చాచి చాచి, నా శరీరమును పంతముతో దోచి దోచి, అనేకమైన తాపములతో కంది కంది, అనేకమంది భామలను పొంది పొంది, వారితో కులికే నేర్పరివి. మరి నా కోర్కెలనుకూడా తీర్చనెరుగవా? నేనూ జవ్వనినే. నన్నింత రట్టుచేయవలెనా ?
స్వామీ ! నాపై మాటలు గుప్పించి గుప్పించి, మళ్ళీ మళ్ళీ నన్ను పారి పారి (తడివీ తడివీ) మన్మధుని పనులకు వాహ్యాళికి వెళ్ళి పనిలోపనిగా వేంకటేశా నన్ను కూడితివి. ఇంతాచేసి నేను నీ దేవేరినే కదా స్వామీ. నన్నింత వేడుకోవలెనా?


Saturday 4 November 2017

నిన్ను బోలు వారమా నీఅంతవారమా - అన్నమయ్య కీర్తన



ఈ వారం అనమయ్య కీర్తన..
ఈ కీర్తనలో గోపికల అమాయక మనస్తత్వం అన్నమయ్య ఎంతబాగా వివరించాడో చూడండి.
అంతదొడ్డవారమా అందుకు దగుదుమా
మంతనపుమాటల మరగించేవు

నిన్ను బోలు వారమా నీఅంతవారమా
వెన్నలు జల్లలు నమ్మువెలదులము
పనినఈరత్నాల బంగారుతిండ్లలో
యెన్నకైనతూగుమంచ మెక్కు మనేవు

చెప్పరానివారమా చెమటపై వారమా
కప్పురంపుజని యేరుగనివారమా
చిప్పిలేటితేనెల సేమంతివిరుల
చప్పరములోనికి సారే బిలిచేవు.

జంకెనలవారమా సరసపువారమా
మంకుమంకు మాటల మందవారమా
వెంకటాద్రి విభుడా వేడుకలరాయడా
తెంకికి నెప్పరిగమీదికి రమ్మనేవు.

భావం:

అన్నమయ్య ఈ మధురకీర్తనలో ఒక గోపికవలె భావించుకుని కృష్నయ్యతో నిష్టూరంగా ఏమంటున్నాడో ఆకర్ణించండి. కృష్ట్నయ్యా ! నీ వలపుజల్లులలో తడిసేతంట అదృష్టం మాకు ఉన్నదా? మేము అంత గొప్పవారమా? నీతో మంతనములాడే మాటల చాతుర్యము మాకు గలదా? మేము అందుకు తగినవారమా? మమ్మల్ని మాటలతో మైమరపించుట నీకు తగునా? కృష్ట్నా ! మేము నిన్ను పోలినవారమా? నీ అంతటివారమా? మేము వెన్నలు చల్లలు, అమ్ముకునే వనితలము. రత్నాలు తాపడంచేసిన బంగారపు ఇండ్లలో ఊయల చమునెక్కమని అనేవు. మాకంత అదృష్టం దక్కుతుందా? మాతో నీకు సంబంధం ఉన్నదని చెప్పగలవారమా? చెమటపోవునట్లు పన్నీటి స్నానాలు చేయగలవారమా? కర్పూరం తింటూ రుచినాస్వాదించలేని గొల్లవారము. తేనెల మాధుర్యము తెలియనివారము. చేమంతిపూలు విస్తరించిన పందిట్లోకి రమ్మని మాటిమాటికీ మమ్మల్ని పిలుస్తావు. ఇది బాగున్నదా? కృష్ట్నా మేము నిన్ను బెదిరించగలవారమా? పోనీ సరసములాడగల చతురలమా? పైగా పుష్కలంగా మంకుతనమున్న గొల్లవారము. ఓ వేంకటాద్రినాధుడా! వేడుకలరాయుడా! మమ్మల్ని మిద్దె మీదకు రమ్మనేవు. అది నీ స్థానమని మేమెరుగమా? ఇది నీకు న్యాయమా? (వ్యాఖ్యానం : అమరవాది సుబ్రహమణ్య దీక్షితులు, సేకరణ : పొన్నాడ లక్ష్మి).