Friday 13 December 2019

ఎంచి చూచితే ఇతనికెవ్వరెదురు..


ఈ వారం అన్నమయ్య కీర్తన. 


ఎంచి చూచితే ఇతనికెవ్వరెదురు
కొంచడేమిటికి వీడె ఘూర నారాసింహుడు.

గక్కన అహోబలాన కంబములోన వెడలి
ఉక్కుమీరి హిరణ్యుని నొడిసిపట్టి
చెక్కలువార గోళ్ళ జించి చెండాడినయట్టి
వెక్కసీడు వీడివో వీర నారసింహుడు.

భవనాసి ఏటిదండబాదుకొని కూచుండి
జవళి దైత్య పేగులు జందేలు వేసి
భువియు దివియు ఒక్క పొడవుతో నిండుకొని
తివురుచున్నాడు వీడె దివ్య నారసింహుడు.

కదిసి శ్రీసతి గూడి గద్దెమీద గూచుండి
యెదుట ప్రహ్లాదుడు చేయెత్తి మొక్కగా
అదన శ్రీ వేంకటాద్రినందరికి వరాలిచ్చి
సదరమైనాడు వీడె శాంత నారసింహుడు.

భావం..
ఈ కీర్తనలో నరసింహస్వామి ప్రతాపాన్ని, గొప్పదనాన్ని వర్ణిస్తున్నాడు అన్నమయ్య.
ఎంచి చూడగా ఈతని కెవ్వరు ఎదురు రాగలరు ఈతనికితనే సాటి అయిన ఘోర నారసింహుడు.
అహోబలక్షేత్రం లో కంబములోనించి వెలికి వచ్చి, అతి బలవంతుడైన హిరణ్యకశిపుని వొడిసి పట్టుకొని,  తన వాడియన గోళ్ళతో చీల్చి చెండాడి సాటిలేనటువంటి వీరనారసింహుడితడు.
భవనాసి ఏటి తీరాన తనభుజబలం చూపిస్తూ కూర్చుని ఆ రాక్షసుని పేగులు జందేలుగా వేసుకొని, భూమి ఆకాసం ఒక్కటే పొడవుగా నిండి తిరుగుచున్న దివ్య నారసింహుడితడు.
సమీపాన శ్రీసతితో కలసి గద్దెమీద కూర్చొని, ఎదురుగా ప్రహ్లదుడు చేయెత్తి మొక్కుతుండగా, శ్రీవెంకటాద్రిమీద కొలువై యుండి అందరికీ వరాలిచ్చే తేలికపడ్డ వాడైన శాంత నారసింహుడితడు.

No comments:

Post a Comment