Monday 24 November 2014

అందరి వశమా హరి నెరుగ – కందువగ నొకడు గాని యెరుగడు. - అన్నమయ్య కీర్తన



ప.         అందరి వశమా హరి నెరుగ – కందువగ నొకడు గాని యెరుగడు.
౧.         లలితపు పది గొట్ల నొకడు గాని – కలుగడు శ్రీహరి గని మనగ.
            ఒలిసి తెలియు పుణ్యుల కొట్లలో ఇల నొకడు గాని యెరుగడు హరిని.
౨.         శృతి చదివిన భూసురకోట్లలో – గతియను  హరినే యోకానొకడు,
            అతిఘను లట్టిమహాత్మ కోటిలో – తతి నొకడు గాని తలచడు హరిని.
౩.          తుద కెక్కిన నిత్యుల కొట్లలో – పొదుగు నొకడు తలపున హరిని,
            గుదిగొను హరి భక్తుల కొట్లలో – వెదకు నొకడు శ్రీ వేంకటపతిని.
భావము:
            శ్రీహరిని తెలిసికొనుట అందరికీ వశమా? ఒకానొక విజ్ఞానికి తప్ప పరమాత్ముని తెలుసుకోవడం సాధ్యం కాదు.
            పదికోట్ల మందిలో ఏ ఒక్కడో తప్ప మరెవ్వడూ శ్రీహరిని గుర్తించలేడు. అట్లు గుర్తించిన పుణ్యాత్ములలో ఒక్కడు మాత్రమే హరితత్వమును పూర్తిగా తెలిసినవాడగును.
            వేదములు చదివిన కోట్లకొలది విప్రులలో ‘హరియే గతి’  అని చెప్పువాడు ఒకానొకడు మాత్రమే. అట్లు చెప్పు మహా ఘనులలో ఏ ఒక్కడో తప్ప హరిని  నిక్కముగా మదిలో భావింపడు.
            విద్యావివేకాదులచే ప్రతిష్ఠ గాంచిన నిత్యస్వరూపులైన అనేక జీవులలో తలపున శ్రీ హరిని నిలుపు వాడొక్కడే. అన్నివిధముల అతిశయించిన హరిభక్తుల సమూహములలో శ్రీ వేంకటేశ్వరుని నిజముగా అన్వేషించి కనుగొను వాడెవడో ఒకడే అగును.




Saturday 15 November 2014

పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు మరుగురుని మీదట మనసుండవలదా - అన్నమయ్య కీర్తన



పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు
మరుగురుని మీదట మనసుండవలదా

ఆకలిగొన్నవానికి అన్నముపై నుండినట్టు
యేకట వుండవలదా యీశ్వరునిపై
కాకల విటులచూపు కాంతలపై నుండినట్టు
తేకువ నుండవలదా దేవునిమీదటను

పసిబిడ్డలకు నాస పాలచంటిపై నున్నట్లు
కొసరే భక్తివలదా గోవిందునిపై
వెసదెరువరి తమి విడిదలపై నునట్టు
వసియించ వలదా శ్రీవల్లభుమీదను

వెప్పున ధనవంతుడు నిధి కాచియుందినట్టు
తప్పక శ్రీవేంకటేశు తగులవద్దా
అప్పసమైన భ్రమ ఆలజాలాలకున్నట్టు
యిప్పుడే వుండవలదా యీతని మీదను

భావం:                                  
            పరమ సుజ్ఞానులకు ప్రపత్తి మార్గమును అనుసరించువారికి మాధవునిపై సదా మనస్సు లగ్నమై ఉండవలెను.
            ఆకలిగొన్నవానికి అన్నముపై నుండునట్లు భక్తునికి పరమేస్వరునిపై తీవ్రమైన ఆపేక్ష ఉండవలెను. కామార్తులైన విటుల చూపు కాంతల పైననే ఉండినట్లు జిజ్ఞాసువులకు దేవుని మీదనే ధృడమైన దృష్టి ఉండవలెను.
            పసిబిడ్డలకు పాలచన్ను పైననే ఆశ ఉన్నట్లు భక్తులకు గోవిందుని పైననే భక్తి స్థిరమై ఉండవలెను. బాటసారి ఆపేక్ష అంతయు తాను  విడినచోటనే ఉన్నట్లు ప్రపన్నునకు శ్రీనాధుని మీదనే లక్ష్యముండవలెను.
            ధనికుడు ఏమరుపాటులేక నేర్పుతో తన ధనపేటికను కాచుకొని యుండునట్లు శరణాగతుడు శ్రీవేంకటేశ్వరునే అనుసరించి యుండవలెను. ఆలజాలములకు(నీటిలోనే తిరుగాడే పురుగులు)నీటిపై ఎడతెగని భ్రమణ మున్నట్లు ఈ దేవునిపై సంతత ప్రేమ, భక్తి యుండవలెను.

భవరోగ వైద్యుడవు పాటించ నీవొకఁడవే - అన్నమయ్య కీర్తన



భవరోగ వైద్యుడవు పాటించ నీవొకఁడవే
నవనీతచోర నీకు నమో నమో. IIపల్లవిII

అతివలనెడి సర్పా లధరాలు గఱచిన
తతి మదనవిషాలు తలకెక్కెను
మితిలేనిరతులఁ దిమ్మరివట్టె దేహాలు
మతిమఱచె నిందుకు మందేదొకో. IIభవII

పొలఁతులనెడిమహాభూతాలు సోఁకిన
తలమొలలు విడి బిత్తలై యున్నారుక్షతా
అలరుచెనకులచే నంగములు జీరలాయ
మలసి యిందుకు నిఁక మంత్రమేదొకో. IIభవII

తరుణులకాఁగిలనే తాపజ్వరాలు వట్టి
కరఁగి మేనెల్ల దిగఁగారఁజొచ్చెను
నిరతి శ్రీవేంకటేశ నీవే లోకులకు దిక్కు
అరుదుసుననుండే యంత్రమేదొకో
భావం:
        దేవా! ఆలోచించి చూడగా సంసారమను జబ్బుకు నీవొకడవే. ఓ వెన్నదొంగా!  నీకు దండము ,నీకు దండము.
        స్త్రీలనెడు పాములు పెదవులు గరచినంత పురుషులకు కామవిషములు తలకెక్కినవి.  అంతులేని రతిక్రీడలలో మునిగి తేలుటచే శరీరములు తిమ్మిరి పట్టినవి. మతిమరుపు కలిగినది. ఈ విషం దిగుటకు, ఈ తిమ్మిరి వదులుటకు తగిన మందేదో!
        స్త్రీ వ్యామోహం అనెడి పెద్ద భూతం సోకగా మనుజులు తలమొలలు వీడి ఒడలు తెలియక దిసమొలలుతో ఉన్నారు. కామక్రీడలకు సంబంధించిన నఖక్షత దంతక్షతాదులచే శరీరము అంతయు గీరలు పడినవి. ఈ దెయ్యమును విడిపించుటకు మంత్రమేదోకదా!!
        అంగనల ఆలింగనములనెడి తాప జ్వరములు పట్టి శరీరములెల్ల చెమటలు కారుచున్నవి. శ్రీ వెంకటేశ్వరా  ఈ విషమ పరిస్థితులలో ఉన్నవారికి నీవే రక్షకుడవు. ఈ చిక్కులనుండి విడివడి శాశ్వతమైన సుఖము పొందుటకు సాధనమైన యంత్రమేదో అనుగ్రహింప రాదా!!!