Thursday 22 March 2018

ఉగాది కవిత


కోకిల మధురస్వరాలతో మామిడిపూల పరిమళాలతో
నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ అరుదెంచినది వసంత ఋతువు.
మల్లెల గుబాళింపుతో, నోరూరించే ఆవకాయ రుచులతో
మామిడిఫలాల మధురిమలతో అలరించునది గ్రీష్మ ఋతువు,
మార్తాండుని ప్రతాపముతో అలసిన పుడమితల్లిని తన
అమృత వర్షధారలతో శాంతపరుచును వర్షఋతువు.
సన్నని చలిగాలులతో, చల్లని వెన్నెల సోయగాలతో
మానవ హృదయాలను పులకరింపజేయును శరదృతువు
ఊషోదయవేళ మంచుబిందువులతో ప్రకృతి కాంతను
పునీతను చేయును హేమంతఋతువు.
పండుటాకులను రాల్చి కొత్త చివురులను ఆహ్వానిస్తూ
జీవిత సత్యాన్ని తెలియజేసే శిశిర ఋతువు.
ఆరు ఋతువుల అందాలని, ఆనందాలని ఆస్వాదించగలిగే
మానవజీవితం మహనీయం కదా!ఉ

కవితా దినోత్సవం

కవితా దినోత్సవ సందర్భంగా నా మదిలో భావం.

నీవారెవరో పైవారెవరో ఎన్నటికీ తెలియని తాతమ్యం,
ఎవరికీ అర్ధంకాని ప్రశ్నంటే ఇదేనేమో!
జీవిత పయనంలో ఆటుపోట్లని తట్టుకుంటూ
గమ్యంకోసం వెతుకులాడే బాటసారులం.
మార్గమధ్యంలో కలిసే మిత్రులు కొందరైతే.
అకారణంగా వైరం పెంచుకొనే శత్రువులు కొందరు.
ఒకరి మనసు అనురాగ జలధి అయితే,
మరొకరి అంతరంగం ద్వేషంతో రగిలే అగ్నిగుండం.
స్వల్ప పరిచయంలోనే ఆత్మీయంగా అక్కున చేర్చుకునేవారు కొందరైతే,
సన్నిహితులైన వారే అపార్ధాలతో బంధాల్ని తెంచేసేవారు కొందరు.
జ్ఞాపకాల పొరలలో కనిపించే ఆత్మీయులు కోందరైతే,
చేదుజ్ఞాపకాలలో మరీ మరీ బాధించె వారు కొందరు.
మార్గమధ్యంలో ఎందరినో పోగొట్టుకొని, మరెందరినో పొందుతుంటాం.
ఇదేనేమో జీవిత పయనానికి అర్ధం పరమార్ధం.

Wednesday 14 March 2018

అన్నమయ్య


అన్నమయ్య వర్ధంతి సందర్భంగా .....
ఏ జన్మమున ఏమి తపముచేసి ఈ జన్మమున మన అన్నమయ్యగా ఆవిర్భవించాడో ఈ మహాత్ముడు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బ్రాహ్మణులు , భరధ్వాజస గోత్రులు అయిన లక్కమాంబ, నారాయణసూరి పుణ్యదంపతులకు 1408 వ సంవత్సరము విశాఖ నక్షత్రం, వైశాఖపూర్ణిమనాడు కడపజిల్లా తాళ్ళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. ఈయనతో మొదలుపెట్టి మూడు తరాలవరకూ అందరూ కవులే. గాయకులే. తెలుగులో మొదటి కవయిత్రి అయిన తాళ్ళపాక తిమ్మక్క అన్నమయ్య మొదటి భార్య'సుభద్రా కల్యాణం' కావ్యాన్ని మంజరీ ద్విపదలో రచించారు.
పదకవిత్వం కవిత్వం కాదని నిరసించే కాలంలో అన్నమయ్య వాటిని రచించి, పద కవితకు ఒక నిర్దిష్టతనీ, గౌరవాన్ని కల్పించారు. పైగా పండితులకంటే, ముఖ్యంగా పామరులను రంజింపజేసేందుకు జానపదుల భాషలో మేలుకొలుపు, ఉగ్గు, కూగూగు, ఏల, జోల, జాలి, ఉయ్యాల, కోలాట, సువ్వి, జాజర పదాలను, సామెతలనీ, జాతీయాలనీ పొందుపరుస్తూ, తేలిక భాషలో జనరంజకంగా రచించారు. పండితానురంజకంగా గ్రాంథిక, సంస్కృత భాషల్లో కూడా సంకీర్తనలను రచించారు. అందువల్లనే ఆరు శతాబ్ధాలు గడిచినా ఇప్పటికీ అన్నమయ్య కీర్తనలు పండిత పామరుల నందరినీ ఆకర్షిస్తున్నాయి. అంతేకాక వైరాగ్య మనస్తత్వాలకు ఆధ్యాత్మిక సంకీర్తనలనీ, శృంగార ప్రియులకు శృంగార కీర్తనలనీ, పిల్లలకనువయిన ఆటపాట కీర్తనలనీ, శ్రమజీవులకోసం జానపద గేయాలనీ రచించారు. అందుకే సమాజంలోని అన్నివర్గాల వారికీ అన్నమయ్య సంకీర్తనలు నేటికీ ఆనందదాయకాలే. మానవ జీవన ధర్మాలన్నీ తన రచనల్లో పొందుపరిచారు. అన్నమయ్య మొత్తం 32,000 వేల కీర్తనలను రచించారు. అందులో 14 వేల కీర్తనలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి.

అన్నమయ్య కీర్తనల్లో అమృతత్వాన్ని ఆస్వాదించడానికి ఎందరో ప్రజలు ఆయన అనుగ్రహం కోసం అర్రులు చాచేవారు. అన్నమయ్య మనుమడు చిన్నన్న గ్రంథస్థం చేసిన 'అన్నమాచార్య చరిత్ర'లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మన అన్నమయ్యకు ప్రపంచవాసన, సంసార లంపటము, దాంపత్య సౌఖ్యము, భార్యాపుత్రులయందు మమకారము, దొరలతో చెలిమి వగైరాదులు ఏమీ తక్కువగా లేవు. అసలే జోడు చేడెల మగడు. కడుపునిండిన సంతానము. దేనికీ లోటులేని సంపూర్ణ జీవితము మన అన్నమయ్యది.
'శ్రీహరి కీర్తన నానిన జిహ్వ, పరుల నుతించగ నోపదు జిహ్వ' అంటూ రాజాస్థానాన్ని తిరస్కరించిన ఆత్మాభిమాని అన్నమయ్య. తిరుమలలో నిత్యకల్యాణ సంప్రదాయాన్ని ప్రారంభించింది అన్నమయ్యే అంటారు. ఆ చనువుకొద్దీ శ్రీనివాసుడు స్వప్న సంభాషణల్లో అన్నమయ్యని 'మామా' అని సంబోధించేవాడని చెబుతారు. వేంకటపతి ప్రతీ సేవలోనూ అన్నమయ్య సంకీర్తన ఉండవలసిందే. అన్నమయ్య కీర్తనలను వింటూనే ఊరేగుతాడు వేంకటేశ్వరుడు.
నా నాలికపై నుండి నానా సంకీర్తనలు - పూని నాచే నిన్ను పొగిడించితివి
వేనామాల వెన్నుడా వినుతించనెంతవాడ - కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతే అయ్యా!
అంటూ తన సంకీర్తనా ప్రతిభ స్వామి వరమే నని ప్రకటించాడు ఆచార్యుడు. 1503 దుందుభి నామ సంవత్సరం, ఫ్హాల్గుణ బహుళ ద్వాదశినాడు అన్నమయ్య అనంతకోటి బ్రహ్మాండ నాయకునిలో ఐక్యమయ్యాడు.
హరి అవతారమీతడు అన్నమయ్య - అరయ మా గురుడీతడు అన్నమయ్యా..
- పొన్నాడ లక్ష్మి
(చిత్రాలు courtesy శ్రీ Pvr Murty)

అన్నమయ్య - అన్నమాచార్యుడు

ఈరోజు అన్నమయ్య వర్ధంతి. అన్నమయ్య 'అన్నమాచార్యుడు" అయిన ఉదంతం.
ఘన విష్ణువు అనే వైష్ణవ యతి తిరుమలలో ఉండేవాడు.అతదు మహా భాగవతుడు. మాధవసేవ చేస్తూ సాటి మానవులకు విష్ణుతత్వాన్ని బోధించేవాడు. తన శెష జీవితాన్ని శేషాద్ర నిలయునికే అంకితం చేసాడు. ఆ దినం ద్వాదశి. రాత్రి వేంకటపతి ఆ యతికి కలలో కనిపించి "తాళ్ళపాక అన్నమయ్య అనే భక్తుడు రేపు నీదగ్గరకి వస్తాడు. వాడు నల్లగా అందంగా ఉంటాడు. ఎప్పుడూ నామీద పాటలు పాడుతూఉంటాడు. వాని చెవిలో మద్దికాయలు వేలాడూతూ ఉంటాయి. పట్టుకు కుచ్చులున్న దండె భుజంమీద మోపి మీటుకుంటూ ఉంటాడు. వానికి నీవు ముద్రాధారణం చెయ్యి. ఇవిగో నా ముద్రికలు" అని ఆదేశించాడు.
మర్నాడు ఉదయాన్నే స్నాన సంధ్యాదులు ముగించుకుని ఘన విష్ణువు స్వామి మందిరంలో యజ్ఞశాల వద్ద నిల్చున్నాడు. అతని చేతిలో స్వామి సమర్పించిన శంఖచక్రాల ముద్రలున్నాయి. అన్నమయ్య పొద్దున్నే లేచి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి ని దర్శించుకున్నాడు. హరినామ సంకీర్తన చేసుకుంటూ యజ్ఞశాలముందుకి వచ్చాడు. ఘనవవిష్ణువు వానిలో స్వామి చెప్పిన గుర్తులను చూసి మెల్లగా ఆ బాలుని సమీపించాడు. "నాయనా నీ పేరేమి?" అన్నమయ్య యతికి పాదాభివందనం చేసి "అన్నమయ్య" ప్రవర చెప్పాడు. యతి కళ్ళు ఆనందంతో మెరిసాయి. "నీకు ముద్రాధారణ చేస్తాను. సమ్మతమేనా..?" అని అడిగాడు. అన్నమయ్య యతి ముఖాన్ని చూసాడు. వేంకటేశ్వరుడే కనిపించాడు. "కృతార్ధుణ్ణి" అన్నాడు.
ఘన విష్ణువ వేదోక్తంగా అన్నమయ్యకు సంస్కారాలు నిర్వహించాడు. సాటి వైష్ణువులకు అన్ని విషయాలు తెలిపాడు. వాళ్ళు తృప్తిపడ్డారు. అప్పట్నించీ అన్నమయ్య అన్నమాచార్యుడయ్యాడు..
(చిత్రం courtesy శ్రీ Pvr Murty)

Tuesday 6 March 2018

వెర్రి దెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్లు యిర్రి దీముభోగముల నెనసేము. - అన్నమయ్య కీర్తన

వెర్రి దెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్లు
యిర్రి దీముభోగముల నెనసేము.

మురికి దేహము మోచి మూలల సిగ్గుపడక
పొరి బరిమళములు పూసేము
పరగ పునుకతల పావనము సేసేమంటా
నిరతితోడ దినము నీట ముంచేము

పుక్కట పంచేంద్రియపు పుట్టు పుట్టి యందరిలో
మొక్కించుక  దొరలమై మురిసేము
అక్కర నజ్ఞానమనే అంధకారముననుండి
దిక్కుల నెదిరివారి దెలిపేము

దినసంసారమే మాకు దేవుడని కొలుచుక
వెనుకొని ఘనముక్తి వెదకేము
యెనలేక శ్రీవేంకటేశ మమ్ముగావగాను
తనిసి తొల్లిటిపాటు దలచేము.

భావం॥  ఒకతనికి వెర్రి బాగా వచ్చింది. నాకు వెర్రి తగ్గిపోయిందని చెబుతూ రోకలిని తలకు చుట్టమన్నాడుట!  వెర్రి తగ్గితే రోకలిని తలకు చుట్టమనడమే వెర్రితనం కదా!
ఆ రకంగానే ఓ వేంకటేశా! మేము కూడా పెద్ద జ్ఞానులమనుకుంటూ ఈ లోకంలో ఎండమావుల్లాంటి భోగాలకోసమే తెగ తాపత్రయపడుతూంటాము.
ఓ వేంకటేశా! ఈ మురికి శరీరాన్ని మోస్తూ, ఆ మురికిని కప్పిపుచ్చుకుంటూ మూలమూలల సువాసనలు, సుఘంధ ద్రవ్యాలు (అంటే ఈనాడు ఉపయోగించే Body sprays అన్నమాట) పట్టిస్తాము.
ఠపీమని పేలిపోయే ఈ కపాలానికి తలంటి పోసి, సుగంధ నూనెలు మర్ధనాలు చేసి చక్కగా అలంకారాలు చేస్తాము( అంటే నేడు చేసే రకరకాల పిచ్చి పిచ్చి శిరొజాలంకరణలు, జుట్టుకి రక రకాల రంగులు వేయడం లాంటివి అనుకోవాలి).
పంచేంద్రియాల శక్తిని వ్యర్ధం చేసుకుంటూ ఇతరుల చేత దండాలు పెట్టించుకుని మురిసిపోతుంటాము. మనకేదో పెద్ద తెలిసున్నట్లు ఇతరులకు నీతులు భోధిస్తుంటాము.
ఓ వేంకటేశ్వరా! ప్రతిరోజూ చేసే సంసారంలోని నువ్వు దేవుడవని కొలిచి ముక్తిని పొందకుండా గొప్ప ముక్తి ఎక్కడొ ఉందని వెతుక్కుంటాము.  సాటిలేనివిధంగా నువ్వు మమ్మల్ని రక్షిస్తుంటే పూర్వజన్మ కర్మలను తలుచుకుని చింతిస్తూంటాము.

మిక్కిలి నేర్పరి యలమేలుమంగ - అన్నమయ్య కీర్తన

మిక్కిలి నేర్పరి యలమేలుమంగ
అక్కర దీరిచి పతినల మేలుమంగ !!
కన్నులనె నవ్వునవ్వి కాంతునిదప్పక చూచి
మిన్నక మాటాడీనలమేలుమంగ
సన్నలనె యాస రేచి జంకెన బొమ్మలు వంచి
అన్నువతో గొసరీని యలమేలుమంగ. !!
సారెకు జెక్కులు నొక్కి  సరుసనె కూచుండి
మేరలు మీరీ నలమేలుమంగ
గారవించి విభునికి గప్పురవిడెమిచ్చి
యారతులెత్తీనిదె యలమేలుమంగ !!
ఇచ్చకాలు సేసి సేసి యిక్కువలంటి  యంటి
మెచ్చీనతని నలమేలుమంగ
చెచ్చెర కౌగిట గూడి శ్రీ వేంకటేశ్వరుని
అచ్చముగా నురమెక్కీ నలమేలుమంగ. !!

భావం..
మా అలమేలుమంగ భర్తగారి అవసరాన్ని కనుక్కొని చక్కగా దాన్ని నెరవేర్చింది. ఆమె మహా జాణ.
మా అలమేలుమంగ స్వామి వారిని అదేపనిగా చూస్తూ కళ్ళతో నవ్వింది. కాసేపు మౌనంగా ఉండి తర్వాత ఏది మాట్లాడాలో అది మాట్లాడింది. కొన్ని సంజ్ఞలతో అయ్యవారికి ఆశలు రేపింది. దగ్గరగా ఉన్న కదలే కనుబొమ్మలను ఎలా వంచాలో అలా వంచింది. ఇంతటితో ఊరుకుందా? కొన్ని ప్రత్యేకమైన కూతలు చేసి, కొన్ని కోరుకొంది.
అయ్యవారి దగ్గరకు చేరి తన చెక్కిలిని వారి చెక్కిలితో నొక్కింది. దగ్గరగా తాకుతూ కూర్చుంది. ఇంక ఆ తర్వాత  చెప్పవలసిన పనేముంది? కాస్త హద్దులు దాటింది. స్వామి వారికి కర్పూర తాంబూలమిచ్చింది. ఆ తరువాత ప్రేమతో హారతులిచ్చింది.
ఎప్పుడూ చేతలేనా, కాసిన్ని ప్రియమైన మాటలు చెప్పుకొందామని, ముందుగా తాను ప్రియముగా మాట్లాడింది. తదుపరి ఇరువురి శరీరాల తాకిడికి మైమరచిపోయింది. స్వామివారి చేతలను మనసారా మెచ్చుకొంది. ఇక ఆగలేక  ఎక్కువ బెట్టు చేయకుండానే వేంకటేశ్వర స్వామివారి కౌగిట్లోకి చేరింది. ప్రసన్నంగా తానే అతని వక్షస్థలం మీదికి చేరుకొంది.
శృంగారానికి పరమార్ధం ఒకరిలో ఒకరు లీనం కావడం. మోక్షానికి కూడా పరమార్ధం జీవాత్మ పరమాత్మలో లీనం కావడం. తన్ను తాను మరిచిపోయిన సాన్నిహిత్యం ఉంటేనే స్వామి అనుగ్రహం  మనకు లభించగలదనే అన్నమయ్య సందేశం  ఈ కీర్తనలో ఉంది.
సంకలనం, వ్యాఖ్యానం..డా॥ తాడేపల్లి పతంజలి.
సేకరణ..పొన్నాడ లక్ష్మి.