Friday 9 May 2014

పెంచి తమపెట్టుజెట్టు - అన్నమయ్య కీర్తన

పెంచి తమపెట్టుజెట్టు
పెంచి తమపెట్టుజెట్టు పెరికివేయ రెవ్వరు మంచివాడ గాకున్న మన్నించకుండేవా

తెరువు దప్పి యడవి దిరిగేటివారి దెచ్చి తెర్వున బెట్టుదురు తెలిసినవారలు
నరుడనై నేరక నడిచేటినన్ను నీవు మరిగించి కావక మానవచ్చునా

దిక్కుమాలినట్టివారి దెచ్చి దయగలనారు దిక్కయి కాతురు వారి దిగదోయరు
తక్కక మాయలోబడి దరిదాపులేనినన్ను వెక్కసాన రక్షించక విడిచేవా నీవు

ఆవల బయపడ్డవా రంగడిబడితే దొర లోవల విచారించి వూరడింతు రంతలోనే
శ్రీవేంకటేశ నీవు సృష్టికల్లా నేలికవు వేవేలు మామొర నీవు విచారించకుండేవా

ఈ వారం అన్నమయ్య కీర్తన.
భావం:
దేవా! తామే మొక్కను నాటి పెంచిన చెట్టును తమ చేతులారా ఎవరును పెరికి వేయరు. నీవే నన్ను పుట్టించి పోషించితివి. నేను మంచివాడిని కాకున్నచో నన్ను మన్నింప లేవా?
ఎవరైనా దారి తప్పి అడవిలో తిరుగుచున్నచో తెలిసినవారు వారికి సరియైన దారి చూపి కాపాడుదురు. నరుడనై పుట్టి సన్మార్గము వదలి అపమార్గములో పడి పోవుచున్న నాకు సన్మార్గమును చూపి నన్ను కాపాడక వదలి వేయుదువా?
దిక్కులేని వారిని దయగలవారు దిక్కయి  కాపాడుదురు గాని వారిని విడనాడరు. దయామయుడవైన నీవు మాయలో పడి దారి, తెన్నూ తెలియక తికమక లాడుచున్న నన్ను కరుణ చూపి రక్షింపక విడిచి పెడుదువా?
ఏ కారణము చేతో భయపడి కొలువుకూటములోనికి వచ్చినచో అచ్చటి దొరలు వారి భయానికి కారణము తెలిసికొని తగురీతిని విచారించి వారి భయమును పోగొట్టి ఊరడింతురు. శ్రీ వేంకటేశ్వరా! నీవు ఈ విశాలసృష్టి కంతటికీ యేలికవు. అట్టి నీవు మా అపరాధములను మన్నించి మా మొరలను ఆలకించి మమ్మల్ని రక్షించాలేవ?   



No comments:

Post a Comment