Friday 2 May 2014

షోడసకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి (ఓ చక్కని అన్నమయ్య కీర్తన)


షోడసకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి

అలరు విశ్వాత్మకున కావాహన మిదె
సర్వనిలయున కాసనము నెమ్మి నిదే
అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు 
తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము

అమృతమథనునకు నదివో నైవేద్యము
గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో        
 

శ్రీ మహావిష్ణువుకి షోడశోపచారాములతో  పూజ ఈ కీర్తనలో అన్నమయ్య రచించాడు. రోజూ ఉదయం ఈ కీర్తన పాడుకుంటే ఆ పరమాత్మునికి షోడశోపచారములతో పూజించినట్లేనని మా గురువుగారు చెప్పేవారు.

భావం :

పదహారు కళలకు నిలయమైన శ్రీహరికి షోడశోపచారములతో నిత్యమూ పూజ సమర్పిస్తున్నాను.
విస్వాత్ముడై అలరించే హరికి ఆహ్వానము ఇదే. సర్వమూ తానె అయిన హరికి ఆసనము ఇదే. గంగాజనకుడైన హరికి అర్ఘ్య, పాద్య, ఆచమనాలు ఇవే. జలధిలో శేష పాన్పుపై నుండే హరికి స్నానం ఇదే.
పీతంబరధారుడైన హరికి వస్త్రాలు ఇవే. శ్రీ మహాలక్ష్మికి పతియై అలరారే హరికి భూషణములు ఇవే. భూదేవిని ధరించె హరికి గంధ పుష్ప ధూపములు, కోటిసూర్య తేజునకు దీపము ఇవే.
అమృత మధనము లో సహాయము చేసిన హరికినైవేద్యము ఇదే. సూర్య చంద్రులు నేత్రలుగా భాసిల్లే హరికి కర్పూరము, తాంబూలము ఇవే. శ్రీ వేంకటాద్రిమీద దేవుడైన హరికి ఆర్తితో ప్రదక్షణములు, నమస్కారములు ఇవే.  


No comments:

Post a Comment