Tuesday 20 May 2014

ఆవకాయలు - అభిరుచులు

ఆవకాయలు – అభిరుచులు
.
నిన్నటితో  ఆవకాయల ప్రహసనం ముగిసింది. ఇరవై రోజులనుంచి అదేపని.

మధ్య గిన్నెలో ఉన్న ఆవకాయ తూర్పు ఆంధ్రా వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు. ఎండపెట్టి చేస్తారు. అందుకే ఎండావకాయ అంటారు. ఎన్నాళ్ళయినా నిలవ ఉంటుంది. ఇది నాకు, మా మరిదికి, పిల్లలకి చాల ఇష్టం.

ఓ  చిన్న గిన్నెలో ఉన్నది పచ్చి ఆవకాయ. దీన్నే పుల్లావకాయ అంటారు. పుల్ల మామిడికాయ వాడతామేమో పిండి పుల్లగా ఉండి అన్నంలో కలుపుకుంటే భలే రుచిగా ఉంటుంది. దానికి తోడు మామిడిపండు గాని, కమ్మటి పెరుగు గాని నంజుకుంటే భలే రంజుగా ఉంటుంది. ఇది మా అల్లుళ్ళకి, మాకు కూడా చాలా ఇష్టం.

ఇంకొక గిన్నేలోనిది  బెల్లం ఆవకాయ. తియ్యగా ఉండి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. మా చిన్ని మనవలకోసం ఇది
.
ఇంకొకటి మసాలా ఆవకాయ. కొంచెం మసాలా వాసనవేస్తూ స్నాక్స్ లో, ఉప్మాలో నంజుకుందికి  చాలా  బాగుంటుంది. మా అబ్బాయికి చాలా ఇష్టం.

మరొకటి తొక్కుడు పచ్చడి. ఇదొక రుచి. అన్నంలో కలుపుకుని ఉల్లిపాయ నంజుకు తింటే భలే బాగుంటుంది. మా శ్రీవారికి చాలా  ఇష్టం.


 పైన చెప్పినవన్నీ  మా కోడలికి మా అమ్మాయిలకీ కూడా  చెప్పలేనంత ఇష్టం!! 

No comments:

Post a Comment