Wednesday 22 March 2017

బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే - అన్నమయ్య కీర్తన

బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే
సింగారాలు మీద మీద సేయరే చెలులు.. !!
తట్టుపుణుగుల నూనె తగనిండా నంటుకొని
గట్టిగాఁ కస్తూరి యట కలివెట్టి
మట్టులేని పన్నీట మజ్జనమాడె నిదే
వెట్టదీర నిందరును విసరరె చెలులు.. !!
కప్పురపు గంధవొడి కడు నిట్టె మెత్తుఁకొని
కొప్పుదువ్వి ముడిచెనె గొజ్జెంగలెల్లా
తెప్పలుగా నించుకొనె తిరుమేన సొమ్ములెల్లా
దప్పిదేర విడెమీరే తలకొని చెలులు.. !!
అలమేలుమంగను ఉరమందు నిట్టె నించుకొని
తులసిదండలు మోచె నిలువునను,
చెలరేఁగి యారగించె శ్రీ వేంకటేశ్వరుఁడు
కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు.. !!
బంగారు మేడలలో ఉండే పరమాత్ముడు వాడే. ఓ చెలులారా! స్వామి స్నానానంతరము ఒకదానిమించి ఒకటిగా అతనికి సింగారాలు చేసి అలంకరించండి అంటున్నాడు అన్నమయ్య.
తట్టుపుణుగు నూనెతో కలియబెట్టిన కస్తూరిని దట్టించి, మేని నిండా పట్టించి, నిర్మాల్యమైన పన్నీటితొ మజ్జనమాడేడు.{స్నానం చేసాడు}. ఓ చెలులారా! వెట్టదీర (తాపం ఉపసమించేటట్లు) విసరండమ్మా!
మజ్జనానంతరం కర్పూరగంధముయొక్క పొడిని స్వామి ఒంటిపై మెత్తండి. ఆయన కొప్పు చక్కగా దువ్వి చామంతిపూలతో అలంకరించండి. స్వామి ఒంటిపై తెప్పలుగానున్న ఆభరణాలను అందంగా అలంకరించండి. ఇవన్నీ అయేసరికి దప్పికతో స్వామి నోరెండిపోతుందేమో మరి! పరిమళభరితమైన తాంబూలం అందించండి.
దేవి అలమేల్మంగను తన ఉరముపై ఉంచుకున్న ఆ దేవదేవుడు నిలువెత్తు తులసిదండలు తనపైన ధరించాడు. తరువాత స్వామి కమ్మని ఆరగింపు చేసాడు. ఓ చెలులారా! శ్రీ వేంకటేశ్వరుడు కొలువుతీరి కార్య నిమగ్నుడై ఉన్నాడు. ఆ స్వామిని మధ్య మధ్య మీరు మోహపరవశుని చేసి సేద తీర్చండి.
అన్నమయ్య తన జీవితకాలంలో ఈ సేవలన్ని స్వామికి స్వయంగా చేసి తరించాడు. అదే ఈ కీర్తనలో మనకి విశదీకరించాడు.
- పొన్నాడ లక్ష్మి

No comments:

Post a Comment