Saturday 18 April 2015

నిన్ను నమ్మి విశ్వాసము – నీపై నిలుపుకొని ఉన్నవాడనిక – ఉపాయమేటికి ? - అన్నమయ్య కీర్తన



18.4.2015.ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప. నిన్ను నమ్మి విశ్వాసము – నీపై నిలుపుకొని
     ఉన్నవాడనిక – ఉపాయమేటికి ?

౧.   గతియై రక్షింతువో – కాక రక్షించవో యని
      మతిలోని సంశయము – మరి విడిచి,
       ఇతరులచే ముందర – నిక నేట్లౌదునో యని
       వెతతోడ దలచేటి – వెరపెల్లా విడిచి 

౨.    తిరమైన నీ మహిమ - తెలిసేవాడ ననే
       గరువముతోడి వుద్యో -  గము విడిచి,
       వెరపున నీ రూపు – వెదకి కానలే ననే
        గరిమ నలపు నాస్తి – కత్వము విడిచి.
౩.      ద్రువమైన నా చేతకు - తోడుదెచ్చుకో ననే
         ఆవల నన్యులమీది – యాస విడిచి
         వివరిచలమేల్మంగ – విభుడ శ్రీ వెంకటేశ
         తవిలితి నా పుణ్యమం – తయు నీకు విడిచి.  

భావం:  దేవా! నీవే గతియని నమ్ముకొని ణా విశ్వాసమంతయు నీ పైననే నిలుపుకొని యున్నాను. నాకిక వేరే ఉపాయమెందుకు?

నీవే నాకు దిక్కై కాపాడుదువో, కాపాడవో అన్నణా మనస్సులని సందేహమును పూర్తిగా వదిలిపెట్టినాను. తప్పక నీవే కాపాడుదువన్న గట్టినమ్మకముతో ఉన్నాను. ఇకమీదట ఇతరులవలన ఎట్టి అపకారమునకు గురి అగుదునో అన్న భయ మెల్ల విడనాడి నిర్భయముగా నున్నాను.

స్థిరమైన నీ మహిమ నంతయు తెలిసికొన గలనన్న గర్వముతో గూడిన ప్రయత్నము నంతయు త్యజించి నీ మహిమలు ఊహాతీతములని గుర్తించి గర్వరహితుడనై యున్నాను. నీ స్వరూపమును వెదకి కనుగొనజాలనన్న నాస్తిక భావమును విడిచినాను. సంపూర్ణ విశ్వాసముతో నిన్ను సేవించి నీ స్వరూపమును కనుగొనగల నన్న ఆస్తికభావముతో నున్నాను.

నీ సేవారూపమైన శాస్వతకార్యమునకు పరులనుండి సహాయము తెచ్చుకొందు నన్న ఆసను విడనాడి నాకు నేనే ఆత్మోద్ధరణ గావించుకొనుటకు పూనుకొన్నాను. అలమేల్మంగా పతివైన శ్రీ వేంకటేశ్వరా! నిన్ను మనసార తలపోసి సత్కర్మలచే నేనార్జించిన పుణ్యమునంతయును నీకు సమర్పించి నిన్ను ఆశ్రయించినాను. కాన నీవు నన్ను రక్షింపక తప్పదని భావము.

భగవంతునిపై యెంత విశ్వాసము కలిగి యుండవలేనో ఈ కీర్తనలో చక్కగా వివరించబడింది. “శ్రద్ధావాన్ లభతే జ్ఞానం”అని భగవానుడు ఆనతిచ్చినట్లు శ్రద్ధ గలిగినవాడే జ్ఞానము నొందగలడు. భగవంతునిపై విశ్వాసము గలవాడే రక్షణ పొందగలడు.    
(పొన్నాడ లక్ష్మి)

No comments:

Post a Comment