Thursday 11 December 2014

సంగీతకళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి నా అశ్రునివాళి.



సంగీతకళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి నా అశ్రునివాళి.
          సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు దివంగతులయ్యారన్న వార్త చాలాబాధ కలిగించింది. వారు కర్నాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన మహా గాయకులు. ఆయన వద్ద  ఎందరో మహానుభావులు శిష్యరికము చేసారు.  మేము విశాఖ వాస్తవ్యులము కావడం మూలాన, ఆయన దర్శనభాగ్యం, వారి కచేరి వినే భాగ్యం మాకు కలిగాయి. మొట్టమొదట్లో రాళ్ళపల్లివారు, నేదినూరి వారు అన్నమయ్య కీర్తనలను స్వరపరచి మనకి అందజేశారు. తిరుపతి దేవస్థానం వారి సహకారంతో అనేక  అన్నమయ్య కీర్తనలను స్వరపరచి, పుస్తకాలను కూడా ముద్రణ చేయించారు. ఆ పుస్తకాలు ఎంతమందికో మార్గదర్శకం  అయ్యాయి. వారు స్వరపరిచిన కీర్తనలలో ముఖ్యమైనది ‘ముద్దుగారే యశోద’ అన్న కీర్తన. ఇది ‘పడమటి సంధ్యారాగం’ అనే సినీమాలోకూడా చిత్రీకరించారు. ఇంకొక కీర్తన ‘పలుకు తేనెల తల్లి’ శ్రీమతి శోభానాయుడు గారు కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించారు. ఇంకా ఎన్నో అన్నమయ్య కీర్తనలు వారు స్వరపరచినవి ఎందరో కళాకారులు గానంచేశారు.
          తెలుగు వారు  మరో మంచి కళాకారుణ్ణి కోల్పోయారు. ఈ మహాగాయకునికి ప్రపంచంలో అన్ని చోట్లా సన్మానాలు, సత్కారాలు జరిగాయి. ఇటువంటి మహోన్నత కళాకారునికి ఎటువంటి కేంద్ర ‘పద్మ’ పురస్కారాలు లభించకపోవడం శోచనీయం. ఇది మన ఆంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అని అనుకోవాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. (పొన్నాడ లక్ష్మి – 8.12.14)

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. అందరూ ముద్దుగారే యశోద అంటుంటే వినటానికి ఏదోలా ఉంటున్నదండీ. ముద్దుగారే, 'యశోద ముంగిటి ముత్యము' వీడు అన్నది ఎవరూ సరిగా వ్యక్తీకరించటం లేదు.

    ధాతువు ప్రాధాన్యత ధాతువుదే కాని మాతువును ఛిన్నభిన్నం చేసి పాడటం ఉచితం కాదని అనుకుంటాను. స్వరకర్తల పొరపాటు ఉంటుందని అనుకోవటం లేదు కాని వ్యక్తీకరణకు ముఖ్యమైనది మాతువును గాయకులు సక్రమంగా గ్రహించవలసిన అవసరం ఉన్నది.

    గాయకులు "ముద్దుగారే యశోద, ముద్దుగారే యశోద" అని పునఃపునః పాడటమూ, నృత్యకళాకారులకు గానసహకారం అందించేవారు అది మరింతగా సాగతీయటమూ అభినయం చేసేవారూ అలాగే అనుసరించటమూ చూస్తూ ఉన్నాము. ఇవంత హర్షణీయములు కావని నా అభిప్రాయం.

    ReplyDelete