Friday 25 April 2014

యెంత విభవముగలిగె – నంతయును నాపదని

ఈ వారం అన్నమయ్య కీర్తన.
యెంత విభవముగలిగె – నంతయును నాపదని
చింతించినది గదా – చెడని జీవనము
చలము గోపంబు దను – జమ్పేటి పగతులని
తెలిసినది యది గదా – తెలివి
తలకొన్న పరనింద – తనపాలి మృత్యువని
తొలగినది యది గదా – తుదగన్న ఫలము
మెరయు విషయములే తన – మెడనున్న  యురులుగా
యెరిగినది యదిగదా – యెరుక,
పరివోని యాస దను – బట్టుకొను భూతమని
వెరచినది యదిగదా – విజ్ఞాన మహిమ
ఎనలేని తిరువేంక – టేశుడే దైవమని
వినగలిగినదిగదా – వినికి,
అనయంబు నతని సే – వానన్దెఅ పరులయి
మనగలిగినది గదా –మనుజులకు మనికి.
భావము:
యెంత ఐశ్వర్యము కలిగినను అది అంతయు ఆపదయే గాని సంపద గాదని గ్రహించిన వాని బ్రతుకే చెడిపోని బ్రతుకు.
మచ్చరము, కోపము అను దుర్గుణములే తన్ను చంపు శత్రువులని తెలిసికొని వాటిని దరికి రానీయకుండుటే నిజమైన తెలివి. పరదూషణనము తనపాలి మృత్యువని తలచి దానిని విసర్జించుటయే ఉన్నతమైన ఫలము.
శబ్ద స్పర్శ రూపాదులైన విషయములే తనమెడకు తగులుకొన్న తాళ్లుగా గ్రహించి వాటికి దూరముగా నుండుటే నిజమైన విజ్ఞత. తెగని ఆశయే తన్ను పట్టుకొన్న దయ్యమని యెంచి దానికి వెఱచి తొలగుటయే విశిష్టమైన తెలివి.
సాటిలేని శ్రీ  వేంకటేశుడే  దైవమని పెద్దలవలన విన్నదియే నిజమైన వినికి. ఎల్లప్పుడు ఆ దేవుని సేవించుచూ ఆనందముతో బ్రదుకు వారిదే నిజమైన బ్రదుకు.
నా మాట:

యెంత చదివినా, ఎన్ని తెలిసినా మనుజులు అరిషడ్వర్గాలను జయించలేక ఆ పరమాత్ముని తెలుసుకోలేక  కొట్టు మిట్టాడుతూ ఉంటారు. అదే ఈ కీర్తనలోని అంతరార్ధము.

No comments:

Post a Comment