Friday 25 April 2014

శ్రీమద్భాగవతం లోని దసమస్కందములో గోపికావస్త్రాపహరణం లోని పద్యం.
గోపికలు వివస్త్రలై నదిలో జలకాలాడుతుండగా శ్రీ కృష్ణుడు వారి వలువలను  అపహరించాడు. ఆ సందర్భములో గోపికలు శ్రీ కృష్ణుని ఉద్దేశించి చెప్పిన పద్యం.

శా. ఇంతుల్ తోయములాడుచుండ మగవారేతెంతురే? వచ్చి రా
యింతల్ సేయుదురే? కృపారహితులై  యేలోకమందైన నీ
వింతల్ నీ తలబుట్టె గాక! మరి యేవీ కృష్ణ! యో చెల్ల! నీ
చెంతన్ దాసులమై చరించెదము మా చేలంబు లిప్పింపవే!

భావము:

కృష్ణా! ఆడువారు స్నానము చేసేటప్పుడు మగవారు ఆ ఛాయలకు వస్తారా? వచ్చినా దయమాలి ఎక్కడైనా ఈ మాదిరి వింతైన అల్లరి పనులు చేస్తారా? ఔరా! ఈ చిత్రమైన చర్యలు నీకే సరిపోయాయి. మరెక్కడా లేవు. నీకు దాసులమై ఉంటాము. మా కోకలు ఇప్పించు.
క. వచ్చెదము నీవు పిలిచిన; నిచ్చెద మేమైన గాని; యెట జొరు మనినం
జొచ్చెదము; నేడు వస్త్రము, లిచ్చి మముం గరుణతోడ నేలుము కృష్ణా!
భావము:
కృష్ణా! నీవు పిలువగానే వస్తాము. నీవేది కోరినా ఇస్తాము. నీవేక్కడికి పొమ్మన్నా పోతాము.   
ఇపుడు మా చీరలు మాకిచ్చి దయతో మమ్మెలుకొ!

ఈ విధంగా పరిపరి విధముల వారిచే బ్రతిమాలించుకొని  వారిచే వందనములందుకొని  వారి వస్త్రములను వారికిచ్చెను.

No comments:

Post a Comment