Sunday 31 January 2021

అణుమాత్రపుదేహి నంతే నేను ముణిగెద లేచెద ముందర గానను

 ఈ వారం అన్నమయ్య కీర్తన

పల్లవి: అణుమాత్రపుదేహి నంతే నేను
మునిగెద లేచెద ముందర గానను
చ.1. తగు సంసారపు తరగలు నీ మాయ
నిగమముల యడవి నీ మాయ
పగలునిద్రలువుచ్చే భవములు నీ మాయ
గగనపు నీమాయ గడపగ వశమా! ॥అణుమాత్రపు॥
చ.2. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ
నియమపు పెనుగాలి నీ మాయ
క్రియనిసుకపాతర కెల్లొత్తు నీ మాయ
జయమంది వెడలగ జనులకు వశమా?॥ అణుమాత్రపు॥
చ.3. కులధనములతో జిగురుగండె నీ మాయ
నిలువు నివురగాయ నీ మాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుట గాక యిది గెలువగ వశమా? ॥ అణుమాత్రపు॥
విశ్లేషణ:
శ్రీనివాసా! అణుమాత్రపు కణంతో జన్మించాను నేను. అణువుతో సమానమైనవాడను. ఈ సంసార చక్రంలో పడి ముణుగుతున్నాను లేస్తున్నాను. అనగా పుడుతూ ఉన్నాను. మరలా జన్మిస్తూ ఉన్నాను. ఏది కొస ఏది మొదలు అనే అంతరం తెలియక కొట్టుమిట్టాడుతున్న వాడను. ముందు ఏమి జరుగుతుందో తెలీదు. తర్వాత ఏమి అవుతుందో తెలీదు. ఇదీ నా పరిస్థితి స్వామీ!
ఈ సంసారమనే మహాసముద్రంలో వువ్వెత్తున లేచే తరంగాలు నీ మాయ. ఈ మహారణ్యంలో పెనువృక్షాలలాగా వేదవేదాంగాలు అర్ధంకాని పరిస్థ్తిలో ఉన్నవి ఇదీ నీ మాయే! రాత్రి పగళ్ళు, నశించేటువంటి ఈ పుట్టుక నీ మాయ. ఆకాశం ఎంత అగమ్యగోచరమో నీ మాయ అంతే ! ఏమీ అర్ధం కాదు. దీన్ని దాటడం సామాన్యులమైన మా వశమా?
స్వామీ! మేము చేతగాని అనేక అవక తవక పనులు చేస్తూ మళ్ళీ మళ్ళీ ఈ కర్మ బంధాలలో తగులుకుంటూనే ఉన్నాము. నీ నియమానుసారం సంచరించే గాలి ఒక్కోసారి ప్రళయకాల సదృశమై పెనుగాలిగా మారడం నీ మాయ కాదా? సర్వస్వం పెళ్లగించి ఇసుక పాతరలో పూడ్చి పెట్టేయడం నీ మాయ కాదా? నిన్ను ఎదిరించి జయించడం ఎవరికి తరము? మాలాంటి వారికి ఈ ఆటుపోట్లను తట్టుకొని నిలబడే శక్తి ఉంటుందా చెప్పండి అని ప్రార్ధిస్తున్నాడు.
స్వామీ మేము గొప్ప కులంలో జన్మించామని కొందరు, గొప్ప కోటీశ్వరులుగా జన్మించామని కొందరు విర్రవీగుతుంటారు. కానీ ఇదంతా నీవు పన్నిన వుచ్చని తెలుసుకోలేని విధంగా మాయలో చిక్కిపోయాము. తెలుసుకోలేకపోతున్నాము. ఇలాంటి మాయా ప్రపంచంలో నివురుగప్పిన మాయతో జీవిస్తున్నాము. శ్రీ వేంకటేశ్వరా! నీవు మమ్మలను ప్రేమతో చేరదీస్తే ఈ మాయను గెలువగలము కానీ మామూలుగా జయింపవశముగాని మాయ ఇది. కనుక మమ్మలను ఈ మాయలో పడకుండా కాపాడి ముక్తిని ప్రసాదించండి అని అన్నమయ్య ప్రార్ధిస్తున్నాడు.
(భావార్ధం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి సౌజన్యంతో)

No comments:

Post a Comment