Friday 17 November 2017

ఈ వారం అన్నమయ్య (పెదతిరుమలాచార్య, అన్నమయ్య కుమారుడు) కీర్తన :

ఈ వారం అన్నమయ్య (పెదతిరుమలాచార్య, అన్నమయ్య కుమారుడు) కీర్తన :
అదే వంటశాలలోన అలిమేలుమంగనాంచా
రెదుట శ్రీవేంకటేశు కితవైనట్లు ॥
వెండిపైడి చట్లలో వేరె కూరలెల్ల
వండించి దొంతివెట్టించి వద్దనుండి
కొండలపొడవుగాగ కోటిబోనా అపరంజి
కుండల గుమ్మరింపించి కొలువై కూచుండీ ॥
పానకాలు శిఖరులు పటికింపు గొప్పెరల
పూని వాసనలుగాగ పువ్వు గట్టించి
వానినే నీలపుఅత్తువములనే నించి నించి
ఆనించుకొని వడ్డించ నాయత్తపడీని ॥
అందెలు గల్లు రనగా నడుగులు పెట్టిపెట్టి
విందు అలమేలుమంగ వేళ వేళను
చెంది శ్రీవేంకటపతికి చేతులకు గడిగడి
అందియిచ్చి సొత్తున దా నారగించి నదివో ॥
పెదతిరుమలయ్య వినిపిస్తున్న ఈ చక్కని సంకీర్తనలో దేవి అలిమేలుమంగ వంటశాలలో తయారుచేసిన వేడివేడి వంటకాలలోంచి తిరుమలేశునికిష్టమయిన కూరలు, రుచికరమయిన పదార్ధాలు, పానకాలు స్వామి చేతికందిస్తూ కలిసి భుజించిందట. చదివి మీరు ఆనందించండి.
దేవి అలిమేలుమంగ నాంచారి అదే వంటశాలలో పతి శ్రీవేంకటేశ్వరుని ఎదుట కూర్చుని ఆయనకు హితవైనట్లు వడ్డించిందట. బంగారు వెండి గిన్నెలలో రకరకాల కూరలు తెచ్చి దొంతరగా పెట్టించి ఒకదానివెనుక ఒకటి వడ్డించింది. రకరకములైన చిత్రాన్నములను స్వామి ఏడుకొండలు పొడుగ్గా వరుసగా ఉన్నట్లు వడ్డించింది. బంగారు కుండలలో కుమ్మరించి కొలువై కూర్చుని వడ్డించింది. పెద్దపెద్ద పాత్రలలో పటికబెల్లపు శిఖరాలుగా పోసి మంచినీటితో కలిపి చక్కని పానకాలు చేసారు. సువాసనకోసం కొంత కుంకుమపువ్వు కలిపి నీలములతో చేసిన గరిటలతో నించి స్వామికి ఆనుకును కూర్చుని వడ్డించిందట. దేవి కాలి అందియలు ఘల్లుఘల్లుమని ధ్వనిస్తుంటే నాజూకుగా చిన్నచిన్న అడుగులు పెట్టుకుంటూ అలిమేలుమంగమ్మ సరైనవేళకు శ్రీ వేంకటేశునకు వడ్డించింది. స్వయంగా ఆయన చేతులకు అందించింది. ఆయన పొత్తుననే తానూ కూర్చుని అదిగో దేవి కూడా ఆరగించింది.
భర్తకి ఇష్తమైన పదార్ధాలను వండి ఆప్యాయంగా పక్కన కూర్చొని ఒక్కొక్కటీ వడ్డించి సంతృప్తిపరచడం మన భారత స్త్రీ సంప్రదాయం. అదే విషయాన్ని పెదతిరుమలయ్య ఈ కీర్తనలో ఎంతో అందంగా వివరించాడు.
- పొన్నాడ లక్ష్మి (వ్యాఖ్యానం : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు)

No comments:

Post a Comment